కేసీఆర్ లిస్ట్ ప్రకటించక ముందే తిరుమలలో మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన హరీష్ రావునే అన్నారు కానీ… టార్గెట్ చేసింది మాత్రం కేసీఆర్ నే అని ఆయన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత చేసిన అభ్యర్థుల జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. మైనంపల్లి వెళ్తానంటే. మేము వద్దంటామా అని..కేసీఆర్ ప్రెస్ మీట్ లో విమర్శలపై స్పందించారు. ఆయన స్పందన చూసి జర్నలిస్టులకు ఆశ్చర్యం వేసింది. అభ్యర్థిత్వం కూడా హోల్డ్ లో పెట్టకుండా.. చర్యలు తీసుకుంటామని కూడా చెప్పకుండా… వెళ్తానంటే అడ్డుకోమని మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. కేసీఆర్ లో ఈ తీరు గతంలో చూడలేదని.. ఎక్కువ మంది అనుకున్నారు. నిజానికి మొత్తం జాబితా చూస్తే కేసీఆర్ లో ఇంత ఆత్మరక్షణ ధోరణి ఎందుకు అని రాజకీయవర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
అభ్యర్థుల్ని ఎందుకు మార్చలేకపోయారు ?
భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో మెరుపులేం లేవు. కానీ మరకలు పడిన నేతలందరికీ జాబితాలో చోటు దొరికింది. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీం సర్వేలు చేసినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు. యాభై మందిని మారుస్తారని లీకులు వచ్చాయి. చివరికి ఏడుగురి విషయంలోనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడుగురు కూడా తిరగబడేవారు కాదు.. కనీసం బలమైన వాళ్లు కాదు. వారిని మార్చినా మార్చపోయినా పోయేదేం లేదు. మరి కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారు
పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా వారే ప్రజల్లోనే కాదు..క్యాడర్ లోనూ వ్యతిరేకత !
పదేళ్లుగా ఉన్న ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉంటుంది. అందులో డౌట్ లేదు. 2018లోనే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత ఎదురయింది. తిరుగులేని అధికారంతో ఎమ్మెల్యేలు .. చివరికి దళిత బంధు నిధుల్లోనూ వాటాలా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరు.. ఇద్దరు కాదు..దాదాపుగా ఎమ్మెల్యేలంతా ఇలాంటి దందాలు లెక్కలేనన్ని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందర్నీ మార్చలేక.. కొందర్ని మార్చితే ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక కేసీఆర్ .. మార్చామని చెప్పుకోవడానికన్నట్లుగా ఏడుగుర్ని మర్చినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండుచోట్ల పోటీ మరో బలహీన సంకేతం
కేసీఆర్ రెండు చోట్ల పోటీ ప్రకటన మరో బలహీన సంకేతం. గజ్వేల్ లో పోటీ చేస్తానని ఈటలరాజేందర్ చెబుతున్నారు. అక్కడ ఆయన పర్యటిస్తున్నారు కూడా. బీజేపీ ఏమైనా చేస్తుంది. అందుకు మమతా బెనర్జీ ఉదంతం కేసీఆర్ దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చు. పార్టీ గెలిచింది కానీ మమతా బెనర్జీ ఓడిపోయారు. అలాంటి పరిస్థితి రాకుండా రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ లిస్టులో ఆత్మరక్షణ ధోరణి ప్రస్ఫుటమవుతోంది కానీ.. ఏ మాత్రం కాన్ఫిడెన్స్ కనిపించడం లేదన్నది ఎక్కువ మంది మాట.