జనఆశీర్వాద్ యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పర్యటించారు. తిరుపతి, విజయవాడల్లో ప్రసగించారు. ఆ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆర్థిక పరిస్థితి కుప్పకూలిందని.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. అయితే ఆ తర్వాత ఆయన సీక్రెట్‌గా వెళ్లి సీఎం జగన్‌తో సమావేశం కావడంతో ఏపీ బీజేపీ నేతలకు కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌తో భేటీ ఉంటుందని చివరి వరకూ ఏపీ బీజేపీ నేతలకూ కూడా తెలియలేదు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా జగన్ ఇంటికి వెళ్లారు. అప్పటి వరకూ ఆయనతో ఉన్న బీజేపీ సీనియర్ నేతలను పక్కన పెట్టేశారు.
ఈ వ్యవహారం ఏపీ బీజేపీలో చర్చనీయాంశమవుతోంది. కిషన్ రెడ్డి అధికారిక పర్యటన కోసం రాలేదు. జన ఆశీర్వాద్ పేరుతో బీజేపీ బలోపేత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కోసం వచ్చిన ఆయన ముఖ్యమంత్రి జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కావాల్సిన అవసరం ఏమిటన్న చర్చ బీజేపీ వర్గీయుల్లో వినిపిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. అధికంగా అప్పులు చేశారని నిందిస్తోంది. తాము చేస్తున్న అప్పులకు కేంద్రం అప్పులు చూపించి.. తప్పేం లేదని వాదిస్తోంది.
అదే సమయంలో ఏపీలో బలపడాలంటే ప్రభుత్వంపై పోరాడాలని… హైకమాండ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నా ఎలా ముందడుగు వేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ శ్రేణులను మరింతగా గందరగోళానికి గురి చేశారని అంటున్నారు. ఖచ్చితంగా ఇదే వ్యూహంతో సీఎం జగన్ .. కిషన్ రెడ్డిని విందు భేటీకి ఆహ్వానించారని అంటున్నారు. పార్టీ బలోపేతం చేయడానికి వచ్చిన కిషన్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ ద్వారా మరింత గందరగోళ పరిచారన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.