ఎన్నికల సమయంలో ఒక సర్వే చేయించాలంటే… ఒక పెద్ద వ్యవస్థ అవసరమౌతుంది. ఒక నియోజక వర్గాన్నే తీసుకుంటే.. అన్ని వర్గాల ప్రజల దగ్గర అభిప్రాయాలు సేకరించాలి, మహిళలూ యువతా వయోవృద్ధులు, పేదలూ మధ్య తరగతీ ఉన్నత వర్గాలూ .. ఇలా అందర్నీ కలిపుకుంటూ నమూనాలు సేకరించాలి. ఇలా చాలా లెక్కలు ఉంటాయి. అందుకే, సర్వేలు నిర్వహించడం కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. నిజానికి, పెద్ద మీడియా సంస్థలు ఎన్నికల సమయంలో ఈజీగా ఇలాంటి సర్వేలు చేయించుకోగలవు. ఎందుకంటే, క్షేత్రస్థాయిలో వారికి నెట్ వర్క్ ఉంటుంది కాబట్టి! అలాంటి వ్యవస్థీకృతమైన మీడియా సంస్థలు కూడా ఇప్పుడు సరైన సర్వేలు చేయించుకోలేకపోతున్నాయి. కానీ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం బాగానే చేయిస్తుంటారు! ఇప్పుడు, నంద్యాల ఉప ఎన్నికపై కూడా ఆయన సర్వే చేయించారు. ఫలితాలను వెల్లడించారు. నంద్యాల విషయంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పేసరికి, ఆ పార్టీ వర్గాల్లో కొంత ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
నంద్యాలలో ఊహించినదానికంటే ఓటింగ్ బాగా జరిగిందని, దాని వల్ల ఫలితంలో మార్పు ఉంటుందని అనుకోవడం సరైందికాదని లగడపాటి తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీదే విజయమని, పార్టీకి పదిశాతం మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని 15 నుంచి 20 ఓట్ల మెజారిటీ రావడం ఖాయమని ఆయన మీడియాతో చెప్పారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. వైకాపా వర్గాలు ఆలోచనలో పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. లగడపాటి సర్వేను ఇంత సీరియస్ గా తీసుకోవాలా అంటే… ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది! దేశవ్యాప్తంగా సర్వే సంస్థలన్నీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి యాభై సీట్లు మించి రావని ఘోషిస్తే… లగడపాటి మాత్రం కేజ్రీవాల్ కు 70 సీట్లు దాటతాయని చెప్పారు. అదే నిజమైంది. ఉత్తరప్రదేశ్ విషయంలో కూడా భాజపాకి 300 సీట్లు వస్తాయని ముందే చెప్పారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఆంధ్రా తెలంగాణల్లో ఏయే పార్టీలు విజయం సాధిస్తాయనేది అంకెలతో సహా చెప్పారు.
నంద్యాల ఎన్నికలకు ముందే ఆయన ఓసారి సర్వే చేయించారు. ఆ తరువాత, ప్రచారం మాంచి ఊపు మీదున్న దశలో కూడా నమూనాలు సేకరించారట. ఎన్నిక పూర్తయ్యాక అన్ని లెక్కల్నీ క్రోడీకరించి, ఇదిగో ఈ ఫలితాలను వెల్లడించారు. అయితే, ఈ సర్వే ఫలితాలు వైకాపాకి కచ్చితంగా మింగుడు పడవు. లగడపాటి చెప్పిందే జరుగుతుందేమో అనే గుబులు లోలోపల ఉన్నా… ఇది ఆయన అంచనా మాత్రమే అనీ, ప్రతీసారీ ఆయన చెప్పిన లెక్కలే సరైనవి అవుతాయని గ్యారంటీ ఏముందని వైకాపా కొట్టిపారేస్తోంది! దీనికి రాజకీయ కోణం కూడా జోడించి… ఆయన ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనీ, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి సర్వేల పేరుతో ఏదో హడావుడి చేస్తున్నారంటూ ఓ ప్రముఖ వైకాపా నాయకుడు ఆఫ్ ద రికార్డ్ మీడియాతో అన్నారట! ఏదేమైనా, ఈ నెల 28 వరకూ ఓపిక పడితే.. ఆంధ్రా ఆక్టోపస్ చెప్పిన జోస్యం ఎంతవరకూ నిజమో అనేది తేలిపోతుంది.
ఆంధ్రాలో ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇంత ధీమాగా నంద్యాల ఫలితాల గురించి చెప్పలేకపోతున్నాయి! వారు నిర్వహించే సర్వేలు ఎలా ఉంటాయంటే… ఆ రెండు ప్రముఖ మీడియా హౌస్ ల సిబ్బంది ఏదైనా సర్వేకు దిగితే, ఏపార్టీకి అనుకూలంగా ఫలితం ఇవ్వాలనేది సర్వే నిర్వహిస్తున్నవారిలో కూడా ముందే ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది. దాంతో కిందిస్థాయిలో వారు సేకరించే నమూనాలు కూడా ముందుగా ఫిక్స్ చేసుకున్న ఫలితానికి సరిపోయేలానే చూసుకుంటారు! మీడియా సంస్థలు ఫెయిల్ అవుతున్నది ఇక్కడే. ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకుండా చేయలేకపోతున్నారు. లగడపాటి సర్వే సక్సెస్ అవుతున్నదీ ఇక్కడే. నిజానికి, ఎలాంటి ముందస్తు ఆలోచనలూ పెట్టుకోకుండా శాస్త్రీయంగా సర్వే నిర్వహిస్తే… దాదాపు వాస్తవాలే వస్తాయి. ఏదేమైనా, ఆంధ్రాలో ప్రముఖ మీడియా సంస్థలు చేయలేని పని లగడపాటి చేస్తున్నారు.