తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను తమిళనాడులో ఎంత మంది ప్రేక్షకులు చూస్తారో తెలియదు. కానీ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని మాత్రం తెలుగు-తమిళ్ భాషల్లో రూపొందిస్తున్నారు. తమిళనాడులో కూడా భారీగా రిలీజ్ చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే సడన్‌గా తమిళ ప్రజలపైన మహేష్‌కి ప్రేమ పుట్టుకొచ్చింది. జల్లికట్టు కోసం వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్ చేశాడు మన తెలుగు సూపర్ స్టార్. మరి అదే మహేష్‌బాబుని, అసలు మహేష్ బాబు హీరో అవడానికి కారణమైన వాళ్ళ నాన్న కృష్ణని దశాబ్ధాలుగా ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల మాటేంటి? జల్లికట్టు కంటే కూడా ఎన్నో రెట్లు ప్రాధాన్యత ఉన్న విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ని డిసైడ్ చేసే స్థాయి అంశమైన ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తెలుగు యువతకు మహేష్‌బాబు ఎందుకు సపోర్ట్ చేయడు? అదే రాజకీయ మహిమ.
నాకు ఎమ్మెల్యే, ఎంపి పదాలకు స్పెల్లింగ్ కూడా తెలియదు అని చెప్తూ ఉంటాడు మహేష్. రాజకీయాల్లోకి వస్తారా అని మీడియా అడిగినప్పుడు మహేష్ చెప్పే సమాధానం అది. కానీ మహేష్‌కి రాజకీయాలను ఎలా ఉపయోగపెట్టుకోవాలో బాగానే తెలుసు. జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు ఇంకో కేసు కూడా అప్పట్లో అంతే పాపులర్ అయింది. ఆ కేసు విచారణలోనే చాలా తక్కువ ధరకే అక్రమ మార్గాన మహేష్‌బాబు కూడా ఒక విల్లా కొన్నాడన్న ఆరోపణలు ససాక్ష్యంగా వినిపించాయి. అప్పట్లో మహేష్‌బాబు బంధువు గల్లా అరుణ కాంగ్రెస్‌లో ఉండేవారు. వైఎస్‌కి నమ్మిన బంటు కూడా. ఆ తర్వాత ఆ అరుణవారే టిడిపిలోకి జంప్ అయ్యారు. మహేష్‌బాబుకు ఎంతో ఇష్టుడైన ఆయన బావ గల్లా జయదేవ్ టిడిపి ఎంపి అయ్యారు. గల్లా జయదేవ్ గెలుపు కోసం మహేష్ కూడా ట్విట్టర్ రాజకీయం చేశారు. అక్కడొచ్చింది చిక్కు. ప్రత్యేక హోదా కోసం ఎవ్వరూ పోరాటం చేయకూడదు. ఎవరు పోరాటానికి ముందుకు వచ్చినా వాళ్ళ ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు, టిడిపి అనుకూల మీడియా మొత్తం కూడా కంకణం కట్టుకుని కూర్చున్నట్టుగా ఉంది కదా. అందుకే ఆంధ్రప్రదేశ్ యువత చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి అనుకూలం ట్వీటడానికి మహేష్‌కి చేతులు రావడం లేదు.
అభిమానులే మా ప్రాణం, ప్రేక్షక దేవుళ్ళు, నాన్నగారిని, నన్ను ఇంతలా ఆదరించిన ఘట్టమనేని ఫ్యాన్స్లాంటివన్నీ పెదాలపై నుంచి వచ్చే పంచ్ డైలాగ్స్. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు చెప్పే డైలాగ్స్‌కి, సినిమా ప్రమోషన్స్ కోసం చెప్పే అభిమాన దేవుళ్ళు లాంటి డైలాగ్స్‌కి పెద్ద తేడా ఏమీ ఉండదు. రెండూ నటనే. తమిళ ప్రేక్షకుల అభిమానం కావాలి. జల్లికట్టుకు మద్దతిస్తే వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. పోయేదేమీ లేదు….నాలుగు టిక్కెట్లు ఎక్కువ తెగి లాభం కూడా కనిపించింది కాబట్టే బాబుగారు ట్వీటారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటే మాటలా? బావ గల్లా జయదేవ్ వళ్ళ ఉన్న లాభాలెన్నో తెలియదు. బిజినెస్ మేన్ కం పొలిటీషియన్ అంటే ఇండియాలో ఏ రేంజ్లో సంపాదించుకునే మార్గాలు ఉంటాయో తెలియని విషయమా? అసలే బావగారు మోడీతో కూడా మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారాయే. అన్నింటికీ మించి అలవాటు పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు…..మళ్ళీ ఓ సారి అభిమానులే దేవుళ్ళు అని అంటే అన్నీ మర్చిపోతారు అన్న గట్టినమ్మకం కూడా. అంతోటిదానికి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అని చెప్పి ఆవేశపడడం అవసరమా? పాలిటిక్స్‌తో ఉన్న లాభాల కోసం ప్రత్యేక హోదా పోరాటానికి హ్యాండ్ ఇచ్చాడు మహేష్. అందుకే ట్విట్టర్ పిట్ట మూగబోయింది. అంతకుమించి వేరే ఏదైనా కారణం ఉందా మహేష్?