1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు . నిజానికి 1994 వరకు ఈ ప్రభుత్వం కొనసాగాల్సి ఉంది. కానీ జయలలిత, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాజీవ్ గాంధీ సహాయంతో తమిళనాడు లో 1991 లో రాష్ట్రపతి పాలన విధింపచేసి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయించింది. 1991 లోనే మళ్లీ ఎన్నికలు తీసుకొచ్చి, ఆ ఎన్నికల్లో గెలిచేసి 1991 లోనే జయలలిత ముఖ్యమంత్రి అయిపోయింది. భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇటువంటి సిత్రాలు చాలా ఉన్నాయి.
కానీ, మూడు రోజుల కిందట బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం, బిజెపి యే పరిపాలిస్తున్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మణిపూర్ లో ఈ పరిస్థితికి దారి తీసిన పరిణామాలను, నేపథ్యాన్ని, రాష్ట్రపతి పాలన పర్యవసానాలను విశ్లేషించుకుందాం.
అసలు మణిపూర్ సమస్య ఏంటి?
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కులాల మధ్య గొడవలు, ఇంకొన్ని రాష్ట్రాల్లో మతాల మధ్య విరోధాలు ఉన్నట్లే మణిపూర్ లో తెగల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. గత రెండేళ్ల లో ఇవి తీవ్రమైన ఉద్రిక్తతలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఇక్కడ అనేక తెగలు ఉన్నప్పటికీ ప్రధానంగా 3 తెగలు కనిపిస్తాయి.
1. మెయిటి – వీరు ప్రధానంగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. 50% పైగా జనాభా వీరిదే.
2. నాగ – వీరు ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరి జనాభా సుమారు 24%.
3. కుకి – వీరిలో ఎక్కువ మంది ప్రాంతీయ గిరిజన పద్ధతులను ఆచరిస్తుండగా కొందరు క్రైస్తవ మతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. వీరి జనాభా సుమారు 16%.
2023 లో కుకి తెగ కి చెందిన మహిళ లని మెయిటీ తెగ కి చెందిన యువకుల గుంపు నగ్నం గా ఊరేగించి, అల్లరి చేసిన (ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేసారు కూడా) వీడియో బయటకి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అటు సుప్రీం కోర్ట్ పరిగణన లోకి, ఇటు పార్లమెంట్ లో చర్చ కీ వచ్చిన ఈ వీడియో మణిపూర్ పరిస్థితుల మీద విస్తృత చర్చ కి కారణభూతమైంది. తెగ ల మధ్య ఏర్పడ్డ ఈ సంఘర్షణ, విరోధాల కి అనేక కారణాలున్నాయి.
చారిత్రక కారణాలు:
1891 కి ముందు మణిపూర్ రాచరిక పాలనలో ఉండేది. ఈ రాజులు మెయిటి తెగ కి చెందిన వారు. 1891 లో మణిపూర్ బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. 1947 లో స్వాతంత్రం ఇచ్చినప్పుడు మణిపూర్ ని బ్రిటిష్ వారు భారతదేశానికి ఇవ్వకుండా తిరిగి 1891 కి ముందు పాలించిన రాజ వంశానికి ఇచ్చేశారు. మెయిటి తెగ కి చెందిన ఈ రాజు, భారత దేశంలో కలవకుండా మణిపూర్ ని స్వతంత్ర దేశంగా ఉంచాలని ప్రయత్నించారు. అయితే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 1949 లో మణిపూర్ భారత్ లో విలీనం అయ్యేలా చేశారు. అయితే ఆ తర్వాత కూడా మెయిటి తెగ కి చెందిన వారే మణిపూర్ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వస్తున్నారు. అంతెందుకు తాజాగా రాజీనామా చేసిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా ఇదే తెగకు చెందినవారు. వీటన్నిటి కారణంగా , మెయిటీ తో పోలిస్తే వెనుకబడిన ఇతర తెగల లో, మెయిటీ తెగ పై ఒక వైరుధ్యం ఏర్పడింది.
భౌగోళిక కారణాలు :
మణిపూర్ భూభాగం లో 90 శాతం కొండలు, పర్వతాలు ఉంటే కేవలం 10 శాతం మాత్రమే చదునైన సారవంతమైన ప్రాంతం ఉంది. మొదటి నుండి కూడా అన్ని రకాలుగా ముందంజలో ఉన్న మెయిటి తెగ కి చెందిన వారు ఈ సారవంతమైన చదునైన ప్రాంతంలో ఉంటే, నాగ మరియు కుకి తో పాటు ఇతర తెగలు కొండ ప్రాంతాల లో ఉంటున్నారు. సారవంతమైన ప్రాంతం లో ఉంటున్న మెయిటి తెగకి చెందిన వారు అన్ని రకాలుగా ముందంజలో ఉన్న కారణంగా రాజ్యాంగపరంగా వీరికి షెడ్యూల్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ లేదు . నాగ మరియు కుకి తో పాటు ఇతర తెగలు షెడ్యూల్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కలిగి ఉన్నారు.
సామాజిక కారణాలు:
రకరకాల కారణాల వల్ల మెయిటి తెగ కి చెందిన వారు కూడా ఇటీవల కాలంలో షెడ్యూల్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ తమకు కూడా కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరు అలా కోరడానికి ఒక కారణం ఉంది. మణిపూర్ మాత్రమే కాకుండా భారత దేశం లోని పలు ప్రదేశాలలో, బయటి వ్యక్తులు వెళ్లి గిరిజన ప్రాంతాలలో స్థలాలు కొనడం మీద ప్రభుత్వపరంగా కొన్ని ఆంక్ష లు ఉంటాయి. గిరిజనులకు మాత్రమే పరిమితమైన వారి జీవన శైలి, వారి ఉనికి, బయట వ్యక్తుల కారణం గా కలుషితం కాకుండా, వారి ఉనికి కోల్పోకుండా ఉండడం కోసం రాజ్యాంగం ఏర్పాటు చేసిన పరిరక్షణ విధానం ఇది. అయితే గిరిజనులు ఇతర ప్రాంతాల లోని భూమిని కొనుక్కోవడం మీద ఎటువంటి ఆంక్ష లు ఉండవు. అయితే 10 శాతం చదునైన నేల ఉన్న తమ ప్రాంతం లోకి ఇతర తెగలవారు వచ్చి భూములు కొంటున్నారని, మిగతా 90 శాతం ప్రాంతం భూమిని తాము కొనలేక పోతున్నామని, అందుకే తమకు గిరిజన హోదా కావాలని మెయిటి తెగ వారు అడుగుతున్నారు. అయితే ఇతర తెగల వారు మాత్రం, పూర్తిగా అభివృద్ధి చెంది, రాజకీయ ఆధిపత్యం కూడా కలిగిన మెయిటి తెగ వారికి గిరిజన హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని, తమ ప్రాంతాలు కొనే అవకాశం వీరికి ఇస్తే తమ పై పెత్తనం చేస్తారని, తమ తెగలు ఉనికిని కోల్పోతాయని వారు భయపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నఈ సమస్య గత రెండేళ్లుగా మరింత సంక్లిష్టంగా మారింది.
ఒకే ఒక్కడు సినిమా తరహాలో ముఖ్యమంత్రి రాజీనామాకు దారి తీసిన సంచలన ఆడియో క్లిప్ లీక్:
దశాబ్దాల క్రితం విడుదలైన శంకర్ దర్శకత్వంలోని ఒకే ఒక్కడు సినిమాలో- రెండు కులాల మధ్య గొడవ జరిగినప్పుడు, విలన్ అయిన ముఖ్యమంత్రి తన కులానికి వంత పాడుతూ, కులాలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను హీరో రికార్డ్ చేసి, తర్వాత దానిని ముఖ్య మంత్రి కి లైవ్ లో వినిపించి, ముఖ్య మంత్రి రాజీనామా చేసేలా చేసిన సన్నివేశం కొంతమందికి గుర్తుండవచ్చు. కొద్ది నెలల క్రితం ఇదే తరహా లో లీక్ అయిన ఒక ఆడియో క్లిప్ మణిపూర్ లో సంచలనం సృష్టించింది. మెయిటి తెగ కి చెందిన ముఖ్యమంత్రి బీరన్ సింగ్, అల్లర్ల సందర్భం లో తన తెగ కు వత్తాసు పలకడమే కాకుండా, పోలీసు ఆయుధాల ను లూటీ చేయాల్సిందిగా తన తెగ కు చెందిన అల్లరి మూకలకు ఆయన దిశా నిర్దేశం కూడా చేసినట్లు ఆడియో క్లిప్ లో ఉంది. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కొన్ని సంస్థలు ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా ఆ వాయిస్ ముఖ్యమంత్రి దే అని నిర్ధారించాయి కూడా. దీంతో బీరెన్ సింగ్ ప్రభుత్వంపై విపక్షాలతో పాటు, స్వపక్షంలో ఉన్న ఇతర తెగలకు చెందిన నాయకుల నుండి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కొద్ది నెలలుగా నలుగుతున్న ఈ అంశం ఆఖరికి ముఖ్యమంత్రి రాజీనామాకు దారి తీసింది.
బిజెపికే మెజారిటీ ఉంది కదా, మరొక ముఖ్యమంత్రిని ఎన్నుకోకుండా రాష్ట్రపతి పాలన ఎందుకు?
2022 ఎన్నికలలో బిజెపి మణిపూర్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ నెంబర్ 30 ని దాటింది. 60 స్థానాల అసెంబ్లీలో 37 స్థానాలను గెలుచుకుంది. పైగా మిత్ర పక్షాల మద్దతు కూడా ఉంది. 2027 దాకా ప్రభుత్వాన్ని ఏదోలా నెట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. దీనికి అనేక కారణాలు:
1. అంతర్గత అసమ్మతి: కుకి మరియు ఇతర గిరిజన వర్గాలకు చెందిన అన్ని పార్టీల లోని ఎమ్మెల్యే లు ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా అవిశ్వాస తీర్మానం వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ పతనానికి కూడా దారి తీయవచ్చు.
2.పెరుగుతున్న హింస: గిరిజన తెగల మధ్య తీవ్ర స్థాయి కి చేరుకున్నసంఘర్షణలు, రాష్ట్రం లో ఘోరంగా దెబ్బ తిన్న శాంతిభద్రత లు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయి.
3.తదుపరి ముఖ్యమంత్రి ని ఎన్నుకోలేకపోవడం: నిజానికి అన్నింటి కంటే ముఖ్య కారణం ఇదే. గిరిజన తెగల మధ్య సంఘర్షణలు మరియు రాజకీయ సమస్యల కారణంగా బిజెపి నాయకులు తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి గా తమ లోని ఒకరిని గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో బిజెపి కేంద్ర నాయకత్వం రాష్ట్రపతి పాలనకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
4.రాజకీయ వ్యూహం: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపి మీద ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేకత విపక్షాలకి మేలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా, పరిస్థితిని చక్కబెట్టి, భవిష్యత్తు లో తిరిగి బిజెపి అధికారంలోకి రావడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం బిజెపి లక్ష్యం గా కనిపిస్తోంది.
తదుపరి ఏం జరగనుంది?
కేంద్రం, ఏ రాష్ట్రం మీదైనా రాష్ట్రపతి పాలన ను ఆరు నెలల పాటు విధించవచ్చు. ఒక్కొక్క సారి ఆర్నెల్ల చొప్పున మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. కానీ అలా పొడిగించిన ప్రతి సారీ పార్లమెంట్ ఆమోదం కావాలి. ఈ ఆరు నెలలూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరుగా (వయా రాష్ట్రపతి వయా గవర్నర్ అన్న మాట) పరిపాలిస్తుంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి, గిరిజనుల సమస్యలని పరిష్కరించడానికి, తమ పార్టీ కి అనుకూల పరిస్థితులు ఏర్పరచుకోడానికీ బిజెపి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
అయితే, ఇక్కడ చాలా సవాళ్ళు ఉన్నాయి. గిరిజన తెగల మధ్య వైరుధ్యాలు “Beyond the point of reconciliation” చేరుకున్నాయి. మెయిటీల ST హోదా డిమాండ్ ఇంకా పరిష్కారం కాకపోగా – “కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం” లాగా పరిస్థితి తయారైంది. మరి బిజెపి తిరిగి పరిస్థితులని తమ అదుపులోకి తెచ్చుకోగలుగుతుందా? రాష్ట్రపతి పాలనను ఎంతకాలం పొడిగిస్తుంది అన్నది వేచి చూడాలి.
–జురాన్ (@CriticZuran)