తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ కులోన్మాద హత్య నిందితుడు మారుతి రావు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఆత్మహత్యకు పలు రకాల కారణాలను చెబుతున్నారు. పైగా ఆయన రాసిన సూసైడ్ నోట్ లభించిందని కూడా చెబుతున్నప్పటికీ పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టడం లేదు. వివరాల్లోకి వెళితే..
ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య:
తన గారాలపట్టి, ఏకైక కూతురు అమృత , ప్రణయ్ అనే యువకుని ప్రేమ వివాహం చేసుకుంది. ఆర్థికంగా ప్రణయ్ కుటుంబం కూడా మంచి పరిస్థితి, స్థాయి లోనే ఉన్నప్పటికీ, ఇది కులాంతర వివాహం కావడం, కుల రీత్యా మారుతీరావు దృష్టిలో ప్రణయ్ ది తక్కువ కులం కావడం ఆయన తట్టుకోలేకపోయాడు. దీంతో దాదాపు కోటి రూపాయలు సుపారీ ఇచ్చి తన అల్లుని చంపించాడు. సమాజమే కాకుండా, స్వయానా తన కూతురు కూడా అసహ్యించుకున్న ప్పటికీ ఆయన మాత్రం హత్య చేయించడం పై ఏనాడు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ కి వెళ్తాను అని ఇంట్లో చెప్పి వచ్చిన మారుతీ రావు, ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో గది తీసుకుని, అక్కడే రాత్రి విషం త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారుతి రావు తో పాటు ఉన్న డ్రైవర్ రాత్రి వెళ్ళిపోయి, ఉదయం తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో, ఆర్య వైశ్య భవన్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు తమ దగ్గర ఉన్న మరొక తాళం చెవి తో గది తెరిచి చూసే సరికి అక్కడే అపస్మారక స్థితి లో మారుతి రావు పడి ఉన్నారు. దీంతో వారు సైఫాబాద్ పోలీసుల కు సమాచారం అందించారు. గదిలో వాంతులు చేసుకుని ఉండడం తో పాటు విషం తాగిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిర్థారణకు వచ్చారు.
కొద్ది రోజుల కిందట మారుతీ రావు షెడ్ లో మృతదేహం కలకలం:
అయితే కొద్ది రోజుల కిందట మారుతీరావు షెడ్ లో దొరికిన గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. సుపారీ తీసుకుని హత్యచేసిన నిందితులను నుండి కూడా మరింత డబ్బు కోసం ఆయనపై విపరీతమైన ఒత్తిడులు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో, షెడ్ లో దొరికిన ఈ మృతదేహం ఎవరిదై ఉంటుందన్న మిస్టరీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.
సూసైడ్ నోట్ లో ఏముంది?
అయితే మారుతీ రావు సూసైడ్ నోట్ రాశాడని వార్తలు వస్తున్నప్పటికీ పోలీసులు ఏం రాశాడు అన్న విషయంపై ధ్రువీకరించడం లేదు. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు, అమృతను తన తల్లి వద్దకు వెళ్ళి పోవలసిందిగా మారుతీరావు రాసినట్లు తెలుస్తోంది. అయితే గత వారం రోజుల కిందటే మారుతీ రావు తన ఆస్తులను భార్య పేరిట బదులీ చేయడం వంటి పనులన్నీ పూర్తి చేసినట్లు, వీలునామా కూడా రాసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మారుతీరావు ఆత్మహత్య ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని, ఆలోచించి ప్రణాళికాబద్ధంగా అమలుపరిచిన నిర్ణయమని అర్థమవుతుంది. గతంలో అమృతకు చిల్లిగవ్వ కూడా ఇవ్వనని చెప్పిన మారుతీ రావు, వీలునామాలో ఏం రాశాడు అన్నది తెలియాల్సి ఉంది.
తండ్రి ఆత్మ హత్య పై అమృత స్పందన:
అయితే ఆత్మహత్య సమాచారాన్ని అమృతకు తెలియజేయగా, అమృత దీనిపై వెంటనే స్పందించడానికి నిరాకరించారు. తనకు పూర్తి సమాచారం లేదని, అన్ని వివరాలు కనుక్కొన్న తర్వాత, ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిన తర్వాత స్పందిస్తానని అమృత అన్నారు. ఇప్పటికీ అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులతో నే ఉంటున్న సంగతి తెలిసిందే.
అసలు కారణం ఏంటి?
ప్రణయ్ ని హత్య చేయించిన తర్వాత, దాని పై ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా ఎంతో ధీమాగా కనిపించిన మారుతీరావు ఇప్పుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అని చర్చ నడుస్తోంది. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తి కావస్తూ ఉండడం, తనకు శిక్ష తప్పదని సమాచారం ఉండటం ఒక కారణంగా చెబుతున్నారు. రెండవ కారణంగా నిందితుల నుండి ఇప్పటికీ తనపై ఒత్తిడి ఉండడం, వారు ఎప్పటికప్పుడు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడం రెండో కారణంగా చెబుతున్నారు. అయితే అసలు కారణాలు ఏంటి అనేది విచారణలో తెలుస్తాయి.
మొత్తం మీద :
మొత్తం మీద చూస్తే కులోన్మాద హత్య చేయించి మారుతీ రావ్ ఏం బావుకున్నాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. అటు సొంత కూతురి జీవితాన్ని ఛిద్రం చేసి, ఇప్పుడు ఆత్మహత్య తో తన జీవితాన్ని ముగించుకుని, మొత్తం కుటుంబాన్ని మారుతీరావు చిన్నాభిన్నం చేసినట్లయింది. 21వ శతాబ్దంలో కూడా కులాన్ని పట్టుకుని వేలాడుతూ, కుల దురభిమానం కోసం కుటుంబాన్ని అంతటినీ చిన్నాభిన్నం చేసిన వ్యక్తిగా మారుతీరావు చరిత్రలో మిగిలిపోయారు.