జగన్ రెడ్డి పాలనకు ఐదేళ్లు గడువు దగ్గర పడింది. ఇప్పుడు ఆయన చేస్తానన్నాడో.. ఏం చేశాడో గుర్తు చేసుకోాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రానికైనా యువత కీలకం. వారు ఖాళీగా ఉండకుండా ఉపాధి పొందితేనే అందరూ బాగుంటారు. వారి కుటుంబాలు బాగుంటాయి. రాష్ట్రం బాగుంటుంది. ఇదే మాటల్ని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందుకే తాను రాగానే లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండ్, మెగా డీఎస్సీ అని ప్రకటించారు. ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యాయి.
ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు.. ఎన్ని మెగా డీఎస్సీలు ఇచ్చారు ? అని ప్రశ్నించుకుంటే… యువత ఆశలకు బొక్క పెట్టేంత ” హోల్ ” జీరో అనే సమాధానం వస్తుంది. ఐదేళ్లలో ఐదు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి యువతకు ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్చాల్సిన మొహమాటానికి కూడా ఒక్క క్యాలెండర్ ఇవ్వలేదు. మధ్యలో క్యాలెండర్ పేరుతో నాలుగైదు గ్రూప్ ఉద్యోగాలతో ఓ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కానీ భర్తీ చేయలేదు. ఇటీవల గ్రూప్స్ ఉద్యోగాల పేరుతో డ్రామా స్టార్ట్ చేశారు. కనీసం అప్లయ్ చేయడానికి కూడా వెబ్ సైట్ సహకరించనంత దరిద్రంగా ఆగ్గనైజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ల పేరుతో పూర్తిగా అందర్నీ విజయవంతంగా మోసం చేసేశారు.
జగన్ రెడ్డిని నమ్ముకుని యువత తమ జీవితాలను పణంగా పెట్టేశారు. ఇప్పుడు అత్యదిక మంది ఆశలు ఆవిరైపోయాయి. ఇక టీచర్ ఉద్యోగాలను టార్గెట్ గా పెట్టుకుని లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. తాను రాగానే మెగా డీఎస్సీ అని కబుర్లు చెప్పిన జగన్ రెడ్డి.. ఘోరంగా మోసం చేశారు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. టీడీపీ హయాంలో వేసిన డీఎస్సీని కూడా ఆపేశారు. ఫలితంగా యువతకు మాత్రమే కాదు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం వల్ల పెద్ద ఎత్తున విద్యార్థి లోకం నష్టపోయింది. ఇప్పుడు నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తూంటే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ కబుర్లు చెబుతున్నారు. జగన్ రెడ్డి చెప్పి మరీ మోసం చేస్తున్నట్లుగా ఈ వ్యవహారం ఉంది.
తాము లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ రెడ్డి చెబుతూంటారు. ఆ జాబితాలో వాలంటీర్లు ఉంటారు. ఐదు వేలు ఇచ్చేది ఉద్యోగమా అనేది ఆయనే చెప్పాలి. అవసరానికి తగ్గట్లుగా అది ఉద్యోగమని ఓ సారి.. సేవ అని మరోసారి చెబుతూంటారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల గురించి ఉదరగొట్టేస్తూంటారు. వారికి అతి తక్కువ పేస్కేల్స్ నిర్ణయించి.. వాలంటీర్లకు ఎక్కువగా.. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ కు తక్కువ అన్నట్లుగా మార్చారు. వారికి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. వారికి జగన్ రెడ్డి మేలు చేసినట్లా ? వారి జీవితాల్ని నాశనం చేసినట్లా ?