ఊరించీ ఊరించీ ఉసూరుమనిపించడం అంటే ఇదే! తెలుగు రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్లో కొత్త కొలువులు దక్కుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆంధ్రా నుంచి ఎంపీ కంభంపాటి హరిబాబుకు, తెలంగాణ నుంచి ఒకరికి బెర్తులు ఖాయం అనుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా విస్తరణ మోడ్ లో ఉంది కాబట్టి… కచ్చితంగా పెద్ద పీట వేస్తారనే అనుకున్నారు. కానీ, ఆ ఊహాగానాలేవీ వర్కౌట్ కాలేదు. ఆదివారం జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆంధ్రాకి చెందిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో.. ఆయన స్థానంలో హరిబాబుకు పదవి వస్తుందని ఆశించారు. తెలంగాణ విషయమైతే మరీ దారుణం! ఉన్న ఒక్క కేంద్రమంత్రి పదవినీ తీసేశారు! కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శివసేనకు, అన్నాడీఎంకే వంటి పక్షాలకు కూడా అవకాశాలున్నాయన్నారు. కానీ, ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇంతకీ, మిత్రులకు ఈ విస్తరణలో చోటెందుకు దక్కనట్టు..? విస్తరణ విషయంలో భాజపా వ్యూహం వేరే ఉందా..? ఏ వ్యూహం ఈ విస్తరణ చేసింది..? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు చర్చనీయం అవుతున్నాయి.
ఈ విస్తరణ ద్వారా భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసుకోవడమే వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహకర్తలు, విశ్లేషకులు, మేధావులను తన టీమ్ లోని మోడీ తెచ్చుకున్నారని చెప్పొచ్చు. మాజీ దౌత్యవేత్తలు, మాజీ పోలీస్ కమిషనర్లు ఇలాంటివారికి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు మోడీ సన్నద్ధత ఈ విస్తరణ నుంచే మొదలైందని చెప్పొచ్చు. అందుకే, మిత్రుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు అనిపిస్తుంది. సొంత పార్టీ వారికే ప్రాధాన్యత కల్పించుకున్నారు. నిజానికి, భాజపా ఎవ్వరిపైనా ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మిత్రులకు ఇప్పుడు పదవులు ఇవ్వనంత మాత్రాన వారికి జరిగే నష్టమూ ఏం లేదు. 2014లో పరిపూర్ణ మెజారిటీ సొంతంగానే సాధించుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా సొంతంగా అదే స్థాయి బలాన్ని మరోసారి దక్కించుకోవాలనే ఆశిస్తుంది కదా! అంతేగానీ, మిత్రులపై ఆధారపడాలని ఇప్పుడే ఎందుకు అనుకుంటుంది?
నిజానికి, భాజపాతో దోస్తీ కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతీయ పార్టీలకే ఉంది. ఆ విషయం మోడీకి బాగా తెలుసు! అందుకే, ఈ విస్తరణలో మిత్రులను ధైర్యంగా పక్కపెట్టారు. అలాగని, మిత్రులను వదులుకుంటున్నట్టు కూడా సంకేతాలు ఇవ్వడం లేదు. 2018లో మరోసారి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని భాజపా వర్గాలు అంటున్నాయి. అప్పుడు మిత్రపక్షాలకు పదవులు పంచుతారని చెబుతున్నారు. 2018 అంటే, అక్కడికి ఎన్నికలకు దాదాపు ఏడాది మాత్రమే సమయం ఉంటుంది. అప్పటికి దేశంలోని ప్రజల మూడ్ కొంతవరకూ అర్థమైపోతుంది కదా! మరోసారి మోడీ మేనియా దేశవ్యాప్తంగా పెరుగుతుందా..? లేదంటే, ఇతర పక్షాల మద్దతు కోరాల్సిన పరిస్థితి వస్తుందా..? ఆ పరిస్థితే వస్తే ఎవరి మద్దతు తీసుకోవాలి..? ఇలాంటివాటిపై అప్పటికి ఓ స్పష్టత వచ్చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం పెట్టుకుంటే, కావాల్సిన మిత్రులకు స్థానం కల్పించుకోవచ్చు. ప్రధాని వ్యూహం ఇదే అయి ఉండొచ్చు!