మన్ కీ బాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక. తన మదిలోని మాటను దేశ ప్రజలతో పంచుకుని తానున్నానంటూ బాసటగా నిలిచేలా కబుర్లు చెప్పడమే కాకుండా మంచి మంచి విషయాలను తెలియజేస్తూ.. ప్రజల్లో స్ఫూర్తినీ, సకారాత్మక దృక్పథాన్నీ నింపేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందించ దగ్గదే. ఈ రోజుకు 33 సంచికలు పూర్తయ్యాయి. ఆకాశవాణి ద్వారా ముందు పిలుపు ఇచ్చి, అందిన ఉత్తరాలు, వాయిస్ మెసేజీలను క్రోడీకరించి, అందులోంచి మంచి అంశాలను ఎంపిక చేసి, దేశం మొత్తానికీ వివరిస్తున్నారు ప్రధాని. జూన్ 25న ప్రసారమైన ఈ 33వ సంచికలో ఆయన ప్రధానంగా ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుచేశారు. ఆ సమయంలో జరిగిన అరాచకాలను గుదిగుచ్చారు. నాటి పరిస్థితులను అద్దం పట్టేలా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజపేయి రాసిన కవితను చదివి వినిపించారాయన. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, రంజాన్ పండుగనూ, జగన్నాథ రథోత్సవాన్నీ, నైరుతి రుతుపవనాల పలకరింతనూ ప్రస్తావిస్తూ సాగిన ఆయన ప్రసంగంలో ఏపీలోని విజయనగరం జిల్లా సాధించిన ఘనతను చెప్పడం హైలైట్. మార్చి పదో తేదీనుంచి 14 వ తేదీ వరకూ వంద గంటల్లో మొత్తం 71 గ్రామాల్లో పదివేల మరుగుదొడ్లను నిర్మించి, ఆదర్శంగా నిలిచిందని చెప్పారాయన. ఇందుకు దీక్షబూనిన జిల్లా యంత్రాంగాన్నీ, పాల్గొన్న ప్రజలనూ ప్రశంసల్లో ముంచెత్తారు. దేశానికి విజయనగరం జిల్లా స్ఫూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో ఉత్తర ప్రదేశ్‌లోని ముబారక్పూర్ గ్రామం మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 17 లక్షల రూపాయల గ్రాంటును తిరిగిచ్చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ గ్రామస్థులు తమ డబ్బుతో వాటిని నిర్మించుకుంటామని చెప్పడం దేశానికి ఆదర్శం కావాలని చెప్పడం.. ఆయన మనసులో మాటను నిజంగానే బయటపెట్టింది. అన్ని గ్రామాల వారూ ఇలాగే, డబ్బును వెనక్కిచ్చేస్తే…ప్రభుత్వానికి బోలెడంత ధనం మిగులు.
ఎలిజబెత్…చేనేత రుమాలు
తన వివాహానికి చేనేత రుమాలును మహాత్మా గాంధీ నుంచి బహుమతిగా అందుకున్న, క్వీన్ ఎలిజెబెత్ దానిని పదిలంగా దాచుకున్నారు. తాను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆమె ఆ రుమాలును చూపించారని చెప్పిన నరేంద్ర మోడీ….సమావేశాలలోనూ.. బహుమతులీయాల్సిన సందర్భాలలోనూ.. పెద్దలను కలిసినప్పుడూ చేతితో నేసిన రుమాలును బహుమతులుగా ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కేరళలో ఓ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలను అందజేశారని తెలుపుతూ.. ఇది మంచి అలవాటేననీ, రుమాలు ఇస్తే చేనేత కార్మికులకు సాయపడినట్లవుతుందనీ పేర్కొన్నారు. చేనేతల ప్రోత్సాహానికి ఆ రకంగా ఆయనో దారి చూపించారు. సమావేశాలలో మీరు బోకే ఇచ్చినా.. దండలు వేసినా.. వాటిని వేదికపైనే విడిచి వెళ్ళిపోతుంటారు. వృధా ఖర్చు తప్ప వేరొకటి కాదని చెప్పడం ఆయన ఉద్దేశం.
ఈ జెమ్…వ్యాపారానికి వేదిక
లేఖలు చదవడాన్ని అలవాటుగా మార్చుకోవాలంటూ ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద వ్యాపార దృక్పథమే కనిపించింది. ప్రస్తుతం ఇ-మార్కెటింగ్ విస్తృతంగా సాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇ-జెమ్ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో రిజిస్టర్ అవ్వడం ద్వారా తేలిగ్గా తమ వస్తువులు విక్రయించడం లేదా కొనుగోలు చేయవచ్చని నరేంద్ర మోడీ చెప్పడం వెనుక ఓ లేఖ ఉంది. అరుల్ మోజీ శరవణన్ అనే మహిళ మన్కీబాత్కు దీనిపై లేఖ రాసింది. ముద్ర యోజనా ద్వారా తాను రుణం పొంది వ్యాపారం ప్రారంభించాననీ, ఇ-జెమ్‌లో రిజిస్టరయి విక్రయాలు కూడా చేస్తున్నానని అందులో పేర్కొంది. సాక్షాత్తూ తనకు పిఎమ్ఓ నుంచే సరకుల కొనుగోలు ఆర్డరు వచ్చిందనీ, 1600 రూపాయలు పొందానని ఆమె తెలిపింది. దీనిని ప్రస్తావిస్తూ.. ఉత్పత్తులు చేసేవారు వాటిని అమ్ముకోవడానికి ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదని ఇ-జెమ్‌లో రిజిస్టర్ చేసుకుని తమ పని సులభతరం చేసుకోవచ్చనేది ఆయన మాటల సారాంశం.
యోగాలో గుజరాత్ రికార్డు…
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని అహ్మదాబాద్ 55వేల మందితో ఒకేసారి యోగాభ్యాసం చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిందన్న నరేంద్ర మోడీ జూన్ 21న ప్రపంచం మొత్తం యోగాతో సూర్యుడికి స్వాగతం పలికిందని చెప్పారు. యోగా పట్ల తనకున్న మక్కువను చాటారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. ప్యారిస్, వాషింగ్టన్, అఫ్ఘనిస్తాన్.. ఇలా ఎక్కడ చూసినా యోగాభ్యాసం ప్రత్యక్షమైందన్నారు.
రుతుపవనాలతో ప్రారంభించి, రంజాన్ శుభాకాంక్షలు చెప్పి, జగన్నాధ రథోత్సవాన్ని ప్రస్తావించి, వ్యాపారాన్ని సృజించి, మరుగుదొడ్ల నిర్మాణంతో దేశాన్ని శుభ్రం చేయాలని సూచించిన మోడీ మన్ కీ బాత్‌లో ఎమర్జెన్సీ రోజులను ప్రస్తావించి కాంగ్రెస్‌పై అన్యాపదేశంగా చురకలూ వేశారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి