‘అంతా బాగానే ఉంది కదా.. ఎందుకు నీకు ఇవన్నీ..’ అంటూ ఆంధ్రజ్యోతి రాధా కృష్ణని కమిడియన్ సత్య ఇమిటేట్ చేసిన డైలాగ్ ఒకటి బాగా పాపులర్. ఇదే డైలాగ్ ఇప్పుడు నానికి వాడాల్సిన సందర్భం వచ్చింది.
నాని మంచి హీరో. ఓ సినిమా చేసి వదిలేయడు, ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ప్రమోషన్లు దగ్గరుండి చేస్తుంటాడు. తన కష్టం ఎప్పుడూ వృధా కాలేదు కూడా. యావరేజ్, ఎబౌ ఏవరేజ్ సినిమాలు సైతం, నాని తన ప్రమోషన్లతో హిట్ రేంజ్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ కోసం కూడా అలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం డిఫరెంట్ గా ప్రమోషన్లు మొదలెట్టాడు. ఎన్నికల సీజన్ కదా, అందుకే పొలిటీషియన్ గెటప్పు వేసి, ఎన్నికల వాగ్దానాలంటూ, ప్రెస్ మీట్లు అంటూ.. కొత్త తరహా ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఇవన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి కూడా. అయితే లేటెస్ట్ వీడియో మాత్రం.. రివ్యూలపై, రివ్యూ రైటర్లపై ఓ రకమైన సెటైర్ వదిలాడు.
ఈ ప్రమోషన్ వీడియోలో… నాని పొలిటీషియన్ గెటప్పులో వచ్చాడు. మధ్యలో ఓ రిపోర్టర్ ‘ఈ మధ్య జనాలు రివ్యూలు బాగా చూస్తున్నారు కదా’ అని అడిగితే.. ‘ఆ.. అయితే ఏం చేయమంటావ్.. తలో లక్షా ఇవ్వమంటావా’ అంటూ కేసీఆర్ టైపులో సెటైర్ వేయడం జరిగిపోయాయి. అంతకు ముందు వీడియోలో ‘స్నాక్స్ తిన్నారా’ అంటూ ఓ ప్రెస్ మీట్ లో సుమతో ముడిపడిన ఇష్యూని గుర్తుకు చేశాడు. ఇదంతా నాని ఫన్ కోసమే చేసి ఉండొచ్చు. కానీ… జనంలోకి, మీడియాలోకి తప్పుడు అర్థాల్ని మోసుకెళ్లే ప్రమాదం ఉంది. నానికి మీడియాకీ ఎప్పుడూ సఖ్యతే ఉంది. తను ఎప్పుడూ గీత దాటలేదు. మీడియాతో సఖ్యతగా ఉంటాడు. ఎవరు కావాలన్నా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఓపిగ్గా సమాధానాలు చెబుతాడు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్న నానికి ఇలాంటి అనవసర ఇష్యూలు అవసరమా అనిపిస్తోంది. ప్రమోషన్ల కోసం ఎంత ఫన్ అయినా చేయొచ్చు. కానీ.. ఎవరినైనా హర్ట్ చేసేలా ఉంటే… ఫలితాలు వేరేలా మారిపోతాయి. ఈ విషయం నాని లాంటి హీరోలు గమనిస్తే మంచిది.