అమరావతిలోనే ఉన్నట్లుగా ఉంటారు కానీ.. సాయంత్రానికి అమిత్ షాతో చర్చలు జరిపారని బ్రేకింగ్ వస్తుంది. మరో రోజు ఉదయమే తన శాఖపై అధికారులతో సమీక్ష చేస్తారు. అదే రోజు సాయంత్రం విశాఖలో టాటా చైర్మన్‌తో సమావేశంలో .. విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునేలా చేసినట్లుగా ప్రకటన వస్తుంది. ఇవేమీ. బయటకు తెలియకుండానే ఆయన ప్రపంచంలో అతి పెద్ద స్టీల్ ఉత్పత్తిదారులతో జూమ్ మీటింగులు నిర్వహించి లక్షా నలభై వేలకోట్ల పెట్టుబడుల్ని ఫైనల్ చేస్తారు. అమెరికా పర్యటనలో ప్రపంచ దిగ్గజం కంపెనీల టాప్ మేనేజ్మెంట్తో సులువుగా సమావేశమై.. ఏపీ గురించి ప్రజెంటేషన్ ఇస్తారు. ఇలా నాలుగు నెలల కూటమి పాలనలో ఎక్కడ చూసినా నారా లోకేష్ కనిపించాడంటే అతిశయోక్తి కాదు. రాజకీయాల్లోనూ ఆయన ముద్ర కనిపిస్తోంది. పాలన.. పెట్టుబడుల ఆకర్షణలో క్లాస్..పాలిటిక్స్ లో మాస్ ను లోకేష్ చూపిస్తున్నారు.
తొలి విడత మంత్రిగా సాధించిన విజయాలకు దక్కని గుర్తింపు
నారా లోకేష్ మంత్రిగా తొలి విడతలో రెండున్నరేళ్లు మాత్రమే ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ , ఐటీ మంత్రిగా ఆయన సాధించిన విజయాలు ఎన్నో. పంచాయతీ రాజ్ విభాగంలో కేంద్రం నుంచి కొన్ని వందల పురస్కారాలు అందుకున్నారు. విజయవాడలో హెచ్‌సీఎల్ దగ్గర నుంచి అనేక పరిశ్రమలను తీసుకురావడం.. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటుచేయడం వరకూ ఆయన పాత్ర ఉంది. కానీ రావాల్సినంత ప్రచారం రాలేదు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన శ్రమ అంతా తేలిపోయింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్.. ఐదేళ్లలోనే తనంటే ఏంటో చూపించారు. ఇప్పుడు తన క్లాస్.. మాస్ స్టైల్‌ను నేరుగా చూపిస్తున్నారు.
రెండో విడతలో నాలుగు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు
నాలుగు నెలల కాలంలో నారా లోకేష్ మాట్లాడి తెచ్చిన పెట్టుబడుల ప్రకటనలు లక్షల కోట్లలోనే ఉన్నాయి. ముంబై పారిశ్రామిక వర్గాలకు లోకేష్ ఇప్పుడు అత్యంత సన్నిహితుడు. వారంతా పెట్టుబడులు పెట్టకపోవచ్చు కానీ.. ఎక్కడైనా తమ వ్యాపారం, పరిశ్రమలు విస్తరించాలనుకుంటే మొదటగా ఏపీ గుర్తొచ్చేలా చేశారు. టీసీఎస్, ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ వంటి కంపెనీలతో స్మూత్ గా డీల్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టం అని వెళ్లిపోయిన లూలూ వంటి కంపెనీలను వెనక్కి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికి నాలుగు నెలలు మాత్రమే అయింది . లోకేష్ మాత్రం తన క్లాస్ చూపించారు.
రాజకీయాల్లోనూ తనదైన మాస్ చూపిస్తున్న లోకేష్
రాజకీయాల్లో మాత్రం తన మాస్ ను చూపిస్తూనే ఉన్నారు. లోకేష్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియక వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. రెడ్ బుక్ పేరుతో వేధిస్తున్నారని రోజా కూడా అంటున్నారు. నిజానికి ఆమెపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటికే రెండు చాప్టర్లు పూర్తయ్యాయని మన్ చాప్టర్ ప్రారంభించబోతున్నామని చెప్పడంతో చాలా మంది వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతా చట్టం ప్రకారమే జరుగుతుంది కానీ క్యాడర్ అనుకున్నట్లుగా జరుగుతుందని భరోసా ఇస్తున్నారు. ఇక పార్టీ సభ్యత్వం రికార్డు స్థాయిలో జరగుతూండటానికి లోకేష్ వ్యూహమే కారణం. మొత్తంగా అటు పాలనలో ఇటు రాజకీయంలో లోకేష్ తన క్లాస్.. మాస్ చూపిస్తూ తక్కువ అంచనా వేసిన వారిని … నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు.