“ప్రజలను కన్విన్స్ చేయడం సాధ్యం కాకపోతే.. వాళ్లను కన్ఫ్యూజ్ చేయి సమస్య అదే పరిష్కారం అవుతుంది” అంటాడు అమెరికా ముఫ్పై మూడో ప్రెసిడెంట్ హ్యూరీ ట్రూమన్. యాభై ఏళ్ల కిందట అమెరికాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని ఉద్దేశించి..ఆయన ఈ రాజకీయ విజ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటారు. కానీ ఇండియాలో మాత్రం ఇలాంటి రాజకీయాలకు ఇప్పడిప్పుడే మాస్టర్‌పీస్‌లుగా రాజకీయ నేతలు మారుతున్నారు. దానికి రాష్ట్రాలు మొదలు కొని దేశం మొత్తం జరుగుతున్న రాజకీయ పరిమామాలే ఉదాహరణలు.
కేబినెట్ విస్తరణను ఈవెంట్‌గా మారిస్తే ప్రజలు సమస్యలు మర్చిపోతారా..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఈ విషయంలోనూ డ్రామాను ఏ మాత్రం తక్కువ నడపలేదు. దేశంలో ఓ వైపు ప్రజల బతుకు దుర్భరం అవుతూంటే… ప్రధానమంత్రి మాత్రం.. ఎవరెవరికి మంత్రి పదవులు ఊడతాయి.. ఎవరెవరికి కిరీటాలు పెడతారు అన్న చర్చ జరగాలని సీన్ క్రియేట్ చేశారు. చివరి క్షణం వరకూ సీక్రెట్‌గా ఉంచి.. మీడియాకు లీకులు ఇస్తూ.. మంత్రివర్గ విస్తరణ వ్యవహారానికీ అత్యంత ప్రాధాన్యత లభించేలా చూసుకోగలిగారు. అంటే.. ఓ ఈవెంట్‌లా చేయగలిగారు. నిజానికి ప్రజలకు మిన్ను విరిగి మీద పడినసమస్యలు ఇప్పుడు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈ కారణంగా నిత్యావవసర వస్తువుల ధరలు మడిపోతున్నాయి. కానీ కేంద్రానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదు. కరోనా వ్యాక్సిన్ల దగ్గర్నుంచి చెప్పుకోవాలంటే సవాలక్ష సమస్యలున్నాయి. కానీ.. వాటి గురించి అంత సీరియస్‌గా తీసుకోకుండా మంత్రివర్గ విస్తరణనే ఈవెంట్‌గా నిర్వహింప చేశారు. కొంత మంది సీనియర్లను తప్పించి.. మరింత చర్చ జరగాలని కోరుకున్నారు. గొప్ప గొప్పగా చదువుకున్న వారిని తీసుకుంటున్నారని బాకా ఊదించారు. కానీ కొత్త హెల్త్ మినిస్టర్ .. గతంలో చేసిన ట్వీట్లు చూసి.. ఆ మాత్రం చదువు వచ్చినవాళ్లు మోడీ కేబినెట్లో ఉండాల్సిందేనని సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా మోడీ వ్యూహాతమకంగానే చేశారని.. ప్రజల దృష్టి మళ్లించడానికే చేశారని చాలా కొద్ది మంది మాత్రమే నమ్ముతారు.
“రాష్ట్రాల సహకారరంగాన్ని” చేతుల్లోకి తీసుకుని అమిత్ షా ఏం చేయబోతున్నారు..?
కేంద్రం సందట్లో సడేమియాలా.. మంత్రివర్గ విస్తరణలో ఎవరికీ అనుమానం రాకుండా సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా ఓ నిర్ణయం తీలుకుంది. అదే అసలు సహకార వ్యవస్థకు కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం. నిజానికి అది రాష్ట్ర పరిధిలోని అంశం. రాజ్యాంగంలోని 75వ షెడ్యూలు ప్రకారం ‘సహకార రంగం’ రాష్ట్రాల పరిధిలోని అంశం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకార శాఖను ఏర్పాటు చేసేసి.. ఆ బాధ్యతలను అదనంగా అమిత్ షాకు అప్పగించారు. సహకార వ్యవస్థ బలోపేతం చేయడానికేనని కేంద్రం ఢంకా జజాయించి చెబుతోంది.కానీ… మోడీ, షాల పరిపాలన చూసిన వారికి ఆ నమ్మకం కలగడం లేదు. రాజకీయ, ఆర్థిక కుట్రలున్నాయనే అనుమానాలు బలంగా వస్తున్నాయి. గ్రామీణ భారతంలో స్థానిక ప్రజల విస్తృత భాగస్వామ్యంతో సాగుతున్న ఈ కో-ఆపరేటివ్ సెక్టార్‌ను నేరుగా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటే బీజేపీ.. ఓ ఆట ఆడించడానికి మరోఆయుధం దొరికినట్లు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదని.. అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉందన్న ప్రచారం సాగుతోంది. మహారాష్ట్రలోనే రెండు లక్షల సహకార సంస్థలుండగా ఐదు కోట్ల మంది సభ్యులున్నారు. గుజరాత్లో కూడా 81వేలకు పైగా సంఘాలున్నాయి. రాజకీయంగా కూడా గణనీయమైన ప్రభావం చూపగలశక్తి సహకార సంఘాలకు ఉంది. అందుకే రాష్ట్రాల హక్కులకే కాదు, రాజ్యాంగ నియమాలకూ విరుద్ధంగా సహకారశాఖను కేంద్రం కొద్ది కొద్దిగా మింగుతోంది. సమాఖ్య స్ఫూర్తికీ, సహకార వ్యవస్థకే కాదు… రాష్ట్ర ప్రభుత్వాల ఉనికికే కొత్త మంత్రిత్వశాఖ ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కంద్రం ఉద్దేశం అదే అయి ఉండవచ్చు.
ఉద్యోగాల భర్తీ చేయకుండా ప్రకటనలతో కన్ఫ్యూజ్ చేస్తున్న కేసీఆర్.. !
తెలుగు రాష్ట్రాలలోనూ హ్యారీ ట్రూమన్ను ఆదర్శంగా తీసుకున్న రాజకీయ నేతలకు కొదవ లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఆయన యాభై వేల మందికి ఉద్యోగాలిచ్చి ఆర్థిక పరిస్థితిని మరింతగా భారంగా మార్చుకునే ఉద్దేశంలో లేరు.కానీ వరుసగా వచ్చి పడుతున్న.. స్వయంగా తెచ్చి పెట్టుకుంటున్న ఎన్నికల కారణంగా… ఎంతో కొంత ముందడుగు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సర్కారు నియమించిన సీఆర్ బిస్వాల్ పీఆర్సీ కమిటీనే తేల్చింది. వీటి భర్తీ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుఅప్పగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సరైన నోటిఫికేషన్లు రాలేదు.టీఎస్పీఎస్సీలో 30 లక్షల మంది అర్హత గల అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేసీఆర్ సర్కార్.. ఎప్పటికప్పుడు ప్రజల్ని కర్ఫ్యూజ్ చేయడానికే ప్రయత్నిస్తోంది. యాభై వేల ఉద్యోగాల భర్తీ అని చెబుతున్నారు కానీ ఎక్కడికక్కడ వాయిదా వేసుకుంటూ పోతున్నారు. నిరుద్యోగ భృతి రూ. 3016లను ఇంత వరకూ ఎవరికీ ఇవ్వలేదు. 2019-20 బడ్జెట్లో ఈ పథకానికి రూ.1810 కోట్లు కేటాయించినా పైసాకూడా ఖర్చు చేయలేదు. కానీ యువతను గందరోగళ పరిచి.. నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు వాయిదా వేయడానికి మాత్రం… చిత్రవిచిత్రమైన విన్యాసాలను కేసీఆర్ చేస్తున్నారు.
సమస్యలపై దృష్టించి మళ్లించేలా చేయడం ఏపీలో నిరంతర ప్రక్రియ..!
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో పీహెచ్డీ చేసింది. ఏదైనా భారీ సమస్య వచ్చినప్పుడు.. అమరావతి భూముల కేసులను..మరొకదాన్నోతెరపైకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటారు. అందు కోసం కోర్టుల్లో చీవాట్లు తినేందుకు కూడా వెనుకాడని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇప్పటికి కనీసం నూట అరవై సార్లు ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కీలకమైన జీవోలన్నింటినీ సస్పెండ్ చేస్తూ ఉంది. మరో వైపు జల వివాదాలతో చుట్టుముట్టాయి. ఏ అంశాన్ని ఏపీ సర్కార్ పరిష్కరించుకోలేకపోతోంది. చివరికి… సుప్రీంకోర్టు గడప తొక్కింది. అసలు జల వివాదాల్ని పరిష్కరించుకోవడానికికి… అపెక్స్ కౌన్సిల్ ఉంది. ముందుగా అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు.. అన్న ప్రశ్న సహజంగానే అందరికీ వస్తుంది. అది ప్రభుత్వానికి కూడా వచ్చే ఉంటుంది. కానీ కావాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా ఏపీకి అన్యాయం చేసిందని.. ఆ సుప్రీంకోర్టుకు సీజేఐగా తెలుగు వ్యక్తి ఉన్నాడని ప్రచారం చేయడమే ఆ పిటిషన్ వెనుక ఉద్దేశం అని లోతుగా విశ్లేషించిన వారికి అర్థమవుతుంది. రెండు నిమిషాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కావాల్సింది పరిష్కారం కాదు., సమస్యల నుంచి ప్రజలు డైవర్ట్ కావాల్సి రావడమే అసలు సమస్య. ఆ ప్లాన్‌లో భాగంగానే హ్యారీ ట్రూమన్ను గుర్తు చేస్తున్నారు.
ప్రజలను మభ్యపెట్టడం చేత కాకపోతే.. వారిని భావోద్వేగానికి గురి చేసేలా కథ నడపడం కూడా.. దేశంలో రాజకీయ నేతలు నేర్చుకున్నారు. ఏదైనా అంటే దేశానికి ముడి పెడతారు.. రాష్ట్రాల్లో అయితే.. కులాలు.. మతాలు.. ప్రాంతాలకు ముడిపెడతారు. కానీ.. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో మాత్రం.. ఈ సృజనాత్మకత చూపరు. ప్రజలకు మంచి చేస్తే.. తమకేం వస్తుంది..? మహా అయితే ఓటు వేస్తారు.. కానీ ఆ ఓటును ఎలాగైనా సంపాదించుకోవచ్చని.. రాజకీయ నేతలు అనుకుంటున్నారు. అందుకే ప్రజలకు ఈ దుస్థితి.