మోహన్ లాల్ – జీతూ జోసెఫ్‌ల ‘నిరు’ ఓ క్లాసిక్ గా నిలిచింది. బాక్సాఫీసు దగ్గర వసూళ్లతో పాటు, విమర్శకుల ప్రశంసల్నీ అందుకొంది. ఓటీటీలోకి వచ్చాక… ఈ సినిమాకి మరింత ఆదరణ పెరుగుతోంది. వాస్తవానికి ఇదో సింపుల్ కోర్ట్ రూమ్ డ్రామా. ఓ కేసు, దానిపై దర్యాప్తు, చివరికి దోషికి శిక్ష పడడం ఇంతే.. కథ! అయితే అంతర్లీనంగా చూస్తే దర్శకుడు న్యాయ వ్యవస్థపై సంధించిన ఓ విమర్శనాస్త్రం అనిపిస్తుంది. ఎన్నో విషయాలపై దర్శకుడు ఓ అంతర్లీనమైన చర్చని లేవనెత్తాడు. అలాగని సుదీర్ఘమైన ఉపన్యాసాలు దంచలేదు. న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి అనే స్టేట్మెంట్లు గుప్పించలేదు. ఇలా ఎందుకు ఉంది? అని విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. జడ్జిమెంట్ ప్రేక్షకులకు వదిలేశాడు.
ఇది రేప్ కేస్ చుట్టూ తిరిగే కథ. నేరస్థుడెవరో, బాధితురాలెవరో ముందే చెప్పేశాడు దర్శకుడు. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు. ఓపెన్ అండ్ క్లోజ్ కేస్లా అనిపించే ఓ ఇష్యూని ప్రేక్షకుల ముందు పెట్టి, న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని ఒకొక్కటిగా కళ్లముందుకు తీసుకొచ్చాడు జీతూ జోసెఫ్. ‘నన్ను రేప్ చేసినవాడు వీడే’ అంటూ బాధితురాలు కోర్టులో మెర పెట్టుకొంటున్నా – న్యాయ స్థానం ఏం చేయలేదు. ఎందుకంటే మన చట్టాలు అలా అఘోరించాయి. ఓ దశలో శిక్ష అనుభవిస్తోంది తప్పు చేసినవాడా, లేదంటే అన్యాయానికి గురైన అమ్మాయా? అనిపిస్తుంది. ఇలాంటి చట్టాలు మనం ఎలా రాసుకొన్నాం? అని కోపం కూడా వస్తుంది.
”నేరస్థుడికి తాను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అది నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌ది” అంటూ ఓ సీన్లో మోహన్ లాల్ బాధితురాలితో మాట్లాడుతూ మనదేశ న్యాయ వ్యవస్థ గురించి కొన్ని విలువైన, సూక్ష్మమైన విషయాల్ని చెప్పుకొస్తాడు. ఆ డైలాగ్ వింటున్నప్పుడు ఓరకమైన నిరుత్సాహం, వేదన ప్రేక్షకుల్ని ఆవహిస్తాయి. నేరం చేసిందెవరో సమాజానికి, కోర్టుకీ, దోషి తరపున వాదిస్తున్న లాయర్‌కీ, ఇలా అందరికీ తెలుసు. కానీ.. నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా బాధితులదే. ఇక్కడ నిజాలు అవసరం లేదు. ఎమోషన్ అక్కర్లెద్దు. కేవలం సాక్ష్యం చాలు. ఆ సాక్ష్యాలు లేక ఎంత మంది నేరస్థులు తప్పించుకొంటున్నారో, ఎంతమంది బాధితులు మనో వేదనకు గురవుతున్నారో ఆలోచిస్తే… న్యాయస్థానంపై నమ్మకం, న్యాయ వ్యవస్థపై భరోసా మరింతగా కుచించుకుపోతాయి.
నేరస్థులది ఒక గొడవైతే.. వాళ్లని కాపాడాలని ప్రయత్నించే న్యాయవాదులది మరింత భయంకరమైన వికృత క్రీడేమో అనిపించేలా ఈ చిత్రంలో రాజశేఖర్ అనే పాత్రని సృష్టించాడు దర్శకుడు. తన క్లయింట్ తప్పు చేశాడని తెలుసు. కానీ తనని కాపాడుకోవాలి. అది వృత్తి ధర్మం. దాని ముందు న్యాయమైనా, నిజమైనా ఓడిపోవాల్సిందే. నేరస్థుడ్ని కేసు నుంచి తప్పించడానికి రాజశేఖర్ ఎంచుకొనే మార్గాలు, కోర్టులో తన వాదన, చివర్లో బాధితురాలు మనోవేదనకు గురయ్యేలా రాజశేఖర్ మాట్లాడే సూటి పోటి మాటలు చూస్తుంటే అసలు నేరస్థుడి కంటే ఆ పాత్రే భయంకరంగా కనిపిస్తుంది. చివరికి నేరస్థుడికి శిక్ష పడింది. మరి వాళ్లని అడ్డదారులు తొక్కైనా సరే కాపాడాలనుకొనేవాళ్లకు ఏ శిక్షా ఎందుకు పడదు? ఇది ప్రేక్షకులకే కాదు, న్యాయ శాస్త్రానికీ దర్శకుడు వదిలిన మరో ప్రశ్నలా అనిపిస్తుంది.
ముగింపు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. పోనీలే.. ఎలాగైనా చివరికి న్యాయమే గెలిచింది అనే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. కానీ… అప్పటి వరకూ ప్రేక్షకులు మోసిన మనో వేదనకు అది తాత్కాలిక ఉపశమనమే కాని, శాశ్వత నివారణ కాదు. ఇలాంటి కథలు ఎప్పుడు చూసినా, ఎక్కడ విన్నా.. మళ్లీ మళ్లీ ఆ గాయాలు రేగుతూనే ఉంటాయి. న్యాయ శాస్త్రాల్ని, చట్టాల్ని, విధానాల్నీ సమూలంగా మార్చినప్పుడే సంపూర్ణమైన ఆనందం, తృప్తి. మరి ఆ రోజు కోసం ఇంకెన్ని యుగాలు వేచి చూడాలో..?