‘వీడి చర్యలు ఊహాతీతం సుమీ!’ – ‘అజ్ఞాతవాసి’లో ఈ డైలాగును త్రివిక్రమ్ ఏ ముహూర్తంలో రాశాడో గానీ… నిజంగా పవన్‌కల్యాణ్ చర్యలు, మాటలు ఊహాతీతమే. మెగాభిమానులకు కూడా అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా ‘రంగస్థలం’ విజయోత్సవంలో పవన్ మాటల్ని, చేతుల్ని ఎవరూ ఊహించలేదు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం కల అరుదైన హావభావంతో చూశారంటే నమ్మండి. ఒక్క వేడుకతో సినిమాల్లో పవన్‌కల్యాణ్ జెండా, అజెండా క్లియర్‌గా తెలుస్తోంది. పవన్ చేసిన ఒక్కొక్క పనినీ, మాటనీ విశ్లేషిస్తే… అందరికీ ఐడియా వచ్చేస్తుంది.
రామ్‌చరణ్ ప్యూర్లీ ఆర్టిస్ట్ మెటీరియల్…
పవన్‌కల్యాణ్ ఏ సినిమా వేడుకలోనూ ఇప్పటివరకూ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. బహుశా… నటుడిగా రామ్‌చరణ్‌కీ ఇంత గొప్ప ప్రశంస లభించి ఉండదు. కమర్షియల్ విజయాలు చరణ్ ఖాతాలో ఉన్నప్పటికీ… ‘రంగస్థలం’ ముందువరకూ నటుడిగా అతడిపై విమర్శలూ విజయాల స్థాయిలో వచ్చాయి. వాటిన్నింటీ ఒక్క సినిమాతో తుడిచిపెట్టేశాడు. బాబాయ్ పవన్ దాన్ని ప్రాజెక్ట్ చేశాడు. మరో మరో సినిమాకు ఈ స్టేట్మెంట్ ఇస్తే ప్రేక్షకులు నవ్వేవారేమో. ‘రంగస్థలం’లో చరణ్ నటన చూసిన తరవాత అంగీకరించక తప్పదు. పవనూ అదే అన్నాడు. ‘రామ్‌చరణ్ సంపూర్ణమైన నటుడు. స్వచ్ఛంగా ఆర్టిస్ట్ మెటీరియల్’ అని! నెక్స్ట్… ‘రంగస్థలం’ వంటి సినిమాల్లో నటించడానికి చాలా ధైర్యం కావాలి. పంచె కట్టుకుని, గడ్డం పెంచుకుని… అబ్బో నా వల్ల కాదు. నాకు అంత ధైర్యం లేదని పవన్ తేల్చేశాడు. ‘మగధీర’లో ఒక రకంగా, ‘రంగస్థలం’లో మరో రకంగా అద్భుతంగా నటించాడని, వైవిధ్యం చూపించాడని పేర్కొన్నారు.
కంక్లూజన్: అబ్బాయ్‌కి నటుడిగా ఫుల్ మార్క్స్
చరణ్‌లో సత్తా ఎంత?
తెలుగులో మాత్రమే చిరంజీవి, పవన్ కల్యాణ్ స్టార్డమ్ తెచ్చుకున్నారు. మిగతా భాషలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. హిందీలో చిరు రెండు మూడు సినిమాలు చేసి వచ్చేశారు. చరణ్ మాత్రం జాతీయ స్థాయిలో నటుడిగా ఎదగాలని పవన్ కోరుకున్నాడు. కోరుకోవడం కాదు.. అతడిలో అంత సత్తా ఉందని చెప్పాడు. యావత్ భారతంలో చరణ్ బలమైన నటుడిగా ఎదుగుతాడని బలంగా నమ్ముతున్నానని పవన్ చెప్పారు. హిందీలో చరణ్ ఓ సినిమా చేశారు. కాని ప్లాప్ అయ్యింది. తెలుగులో వారసత్వం వల్ల చరణ్ స్టార్ అయ్యాడనే విమర్శ ఉంది. ఒక రకంగా పవన్ మాటల్ని ఆ విమర్శకు సమాధానం అనుకోవాలా? తెలుగులో మాత్రమే కాదు.. అఖండ భారతంలో నటుడిగా ఎదిగే సత్తా చరణ్‌కి ఉందని చెప్పడాన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. విదేశాల్లో చరణ్‌కి చాలా ఫాలోయింగ్ ఉందని కూడా చెప్పుకొచ్చారు. పవన్, చరణ్ మధ్య బంధుత్వం గురించి తెలీక అక్కడి జనాలు చరణ్ గురించి గొప్పగా చెబితే పవన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయ్యారట.
కంక్లూజన్: మావాడు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ హీరో
చరణ్ గుండెలోతుల్లో సహజత్వం…
“నాకు తెలిసిన చరణ్ నేలకు దగ్గరగా ఉండేవాడు. ఎంత ఎత్తుకి ఎదిగినా అణిగి మణిగి ఉండేవాడు. చరణ్‌ని అతడి చిన్నతనం నుంచి చూస్తున్నా.. వాడి గుండెలోతుల్లో సహజత్వం ఈ సినిమాలో కనిపించింది” అని పవన్ మాట్లాడారు. పూర్తిగా చరణ్ వ్యక్తిత్వం గురించి కొన్ని మాటలు చెప్పారు.
కంక్లూజన్: మా అబ్బాయ్ మంచోడు.
ముద్దు… మీరూ చూశారా!
‘రంగస్థలం’ విజయోత్సవంలో అబ్బాయ్ రామ్‌చరణ్‌పై ప్రేమను బాబాయ్ పవన్ ముద్దు రూపంలో వ్యక్తం చేశాడు. ఏంటి… పవన్ కల్యాణ్యేనా ముద్దు పెట్టింది? అని ప్రేక్షకులు షాక్ తిన్నారు. దాన్నుంచి తేరుకునే లోపు అబ్బాయ్ ఇంకో షాక్ ఇచ్చాడు. బాబాయ్‌కి వెంటనే ముద్దు పెట్టేశాడు. ఎవరూ ఊహించని ఈ సంఘటన మెగాభిమానులకు డబల్ కిక్. ప్రేక్షకులకు డబల్ షాక్. దీంతో బాబాయ్-అబ్బాయ్ మధ్య ఎంత ప్రేమ ఉందనే సంగతి అందరికీ తెలిసింది.
కంక్లూజన్: అబ్బాయ్‌కి ప్రేమతో…
వీడు నా తమ్ముడు.. అన్నయ్య తండ్రి…
సారీ… పవన్-చరణ్‌లను బాబాయ్-అబ్బాయ్ అనకూడదు ఏమో! ఒకవేళ అలా అంటే పవన్‌కి కోపం రావొచ్చు రామ్‌చరణ్‌ని ఆయన తమ్ముడిగా పేర్కొన్నారు మరి. వేదిక మీద అబ్బాయ్‌ని ‘వీడు’ అని సంభోదించారు. అంతేనా? ‘వీడు నా తమ్ముడు’ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ‘తక్కువసార్లు నేను వీణ్ణి వీడు అని పిలుస్తా. చనువు తీసుకుంటా’ అన్నారు. తరవాత పవన్ చెప్పిన డైలాగ్ పీక్స్. “అన్నయ్య నాకు తండ్రి. మా వదిన నా తల్లి. నేను బాబాయ్ కంటే వాళ్లకు (చరణ్, సుస్మిత, శ్రీజ) అన్నయ్యను. వీళ్ళు నాకు తమ్ముడు చెల్లెల్లు లాంటోళ్ళు” అన్నారు. బహుశా… ఈ మాటతో చిరంజీవి ఆనందానికి అవధులు ఉండి ఉండవు.
కంక్లూజన్: ‘మేమంతా ఓ కుటుంబమే’ అని చెప్పడమే.
ఫైనల్ కంక్లూజన్: ‘రంగస్థలం’ విజయోత్సవంలో చివరకు తేలింది ఏంటంటే… సినిమా కంటే ఎక్కువ రామ్‌చరణ్‌ని హైలైట్ చేశాడు పవన్. సినిమాలో పవన్ జెండా, అజెండా కూడా స్పష్టం చేశాడు. మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు అయినా రావొచ్చు. మెగా హీరోలందరిలో పవన్‌కి చరణ్ అంటేనే ఎక్కువ ప్రేమ, అభిమానం, ఆప్యాయత. కావాలంటే ఒక్కసారి ఈ మాటలు రీప్లే చేసుకోండి… “చరణ్ తమ్ముడు, చిరంజీవి తండ్రి. చరణ్‌కి జాతీయ స్థాయిలో నటుడిగా ఎదిగే సత్తా ఉంది. చరణ్ ఆర్టిస్ట్ మెటీరియల్” – ఈ మాటల్లో పవన్ జెండా, అజెండా కనిపించడం లేదూ?