జనసేనాధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజును ఫ్యాన్స్.. ఓ రేంజ్లో చేశారు. బయట ఎక్కడైనా చేశారో లేదో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చేశారు. ఏకంగా… ట్వీట్లలో కోటి దాటించేశారు. రామకోటి రాసుకున్నట్లు పవన్ ఫ్యాన్స్… “పవన్ కోటి” రాశారు. పవన్‌ను డెమీగాడ్‌గా ఫ్యాన్స్ భావిస్తారు కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకుని ఉండొచ్చు. కానీ.. జనసేన జనంలోకి వెళ్లడానికి ఈ ట్వీట్లు పనికొస్తాయా..? పవన్ కల్యాణ్ సిద్దాంతాలు.. ప్రజల్లో చర్చకు పెట్టడానికి ఇవి వర్కవుట్ అవుతాయా..?. అసలు ఈ ట్వీట్లు చేసిన వాళ్లు ఎంత మంది చిత్తశుద్ధితో జనసేనకు పని చేస్తున్నారు..?.
పవన్ భయపడినంతగా దెబ్బకొట్టింది ఫ్యాన్సే..!
“ఈలలు, గోలలు కాదు.. ఓటు వేసి మద్దతు తెలియచేయండి..! …”
ఎన్నికల సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన అభిమానులకు… దాదాపుగా ప్రతీ సభలో చేసిన విన్నపం అది.
“నేను మీ అభిమానిని సార్.. కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేశా…!”..
ఇది ఎన్నికలయిన తర్వాత పవన్ కల్యాణ్ జరిపిన సమీక్షలో.. ఓ అభిమాని… నేరుగా పవన్ కల్యాణ్‌కే చెప్పిన మాట ఇది.
అంటే… జనససైనికుల గురించి పవన్ కల్యాణ్… దేని గురించి భయపడ్డారో.. అదే జరిగింది. తన ఫ్యాన్స్ … తన భావజాలాన్ని అంది పుచ్చుకుంటారని.. ఆయన నమ్మి.. రంగంలోకి దిగారు. ప్రజల్లో మార్పు తీసుకొస్తారని… ఆయన ఆశించారు. కానీ.. అసలు సమరం దగ్గరకు వచ్చే సరికి.. శత్రుశిబిరంలో చేరి..అభిమాన నేతనే తూట్లుగా పొడిచేశారు.. జనసైనికులు. ఇది నిజం. ఈ విషయం… జనసేనకు వచ్చిన ఓట్ల శాతమే తెలియచేస్తోంది. జనసేనకు వచ్చింది.. కేవలం.. ఆరు అంటే ఆరు శాతం ఓట్లు. నిజంగా… నిన్న ట్వీట్లు చేసిన వారు.. కోటి ట్వీట్లతో ట్రెండింగ్ చేసిన వారు.. అందరూ ఓట్లు వేసి ఉంటే.. పవన్ కల్యాణ్‌కు ఇంత ఘోరపరాజయం వచ్చి ఉండేదా..?
ఆన్లైన్ సపోర్ట్ పవన్ కల్యాణ్‌కు సరిపోతుందా..?
” నేను వంద సీట్లు గెలుస్తా.. సీఎం అవుతానంటాడు”… జగన్ ..” నేను నూట ఇరవై సీట్లు గెలుస్తా..నువ్వెలా సీఎం అవుతావ్” అంటాడు చంద్రబాబు…”మీరిద్దరూ ఏంటీ. నా ఫ్యాన్స్ ట్విట్టర్లో కోటి ట్వీట్లు చేశారు. వైరల్ అయ్యాను. .. నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నానంటాడు పవన్..” .. ఎన్నికలకు ముందు.. బాగా వైరల్ అయిన జోక్ ఇది. ఎన్నికల తర్వాత అదే నిజం అయింది. మిగతా వారి సంగతేమో కానీ.. పవన్ కల్యాణ్‌కు మిగిలింది.. ఆ ట్వీట్లే. ఓట్లు కాదు. ఫేస్ బుక్ పోస్టులు.. ట్విట్టర్ షేర్లు… వాట్సాప్ సందేశాలు..ఎప్పటికీ ఓట్లు తెచ్చి పెట్టలేవు. అందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అలాంటి బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. అదే కంటిన్యూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కానీ.. క్షేత్ర స్థాయిలో మాత్రం తమ డెమీ గాడ్‌ను నిమజ్జనం చేసేస్తున్నారు.
ఇప్పటికీ జనసైనికులు తెలుసుకునే ప్రయత్నం చేయరా..?
పవన్ కల్యాణ్… ప్రజల కోసం.. తన కెరీర్‌ను వదులుకున్నారు. ఆయన కాల్షీట్ ఇస్తే.. ఎన్ని కోట్లు వస్తాయో… సినీ అభిమానులకు తెలియకుండా ఉండదు. కానీ ఆయన అన్నీ వదులుకున్నారు. తనకు ఫ్యాన్స్ మద్దతుగా ఉంటారని… జనసేన కోసం.. జనం కోసం.. వారంతా.. పని చేస్తారని నమ్మారు. కానీ.. జనసైనికులు… పవన్ అనుకున్నతంగా పని చేయడం లేదనేది… ఓట్ల రూపంలో తేలిపోతోంది. సోషల్ మీడియాలో మాత్రం… ఎక్కడా లేనంత రచ్చ చేస్తున్నారు. ఇప్పటికైనా.. జనసైనికులు మారి… ఇతర రాజకీయ పార్టీల్లో ప్రజల్లోకి వెళ్లకపోతే… తమ డెమీగాడ్ కు అన్యాయం చేసిన వాళ్లే అవుతారు. ట్విట్టర్లో.. ఫేస్బుక్కుల్లో చేయాల్సినంత ప్రచారం చేయవచ్చు.. కానీ క్షేత్ర స్థాయిలో కార్యాచరణ లేకపోతే.. ఈ ట్విట్టర్ కోట్లు.. కొరగావు. జనసేనకు జవసత్వాలు కల్పించవు.