ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను నాశనం చేస్తోందని ..తాము సినిమాలు తీస్తే ప్రభుత్వం టిక్కెట్లు అమ్ముకుని అప్పులు తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తోందని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు ఏపీ అధికార పార్టీ నేతలకు సూటిగా తగిలాయి. ఒకరి తర్వాత ఒకరు బిలబిలమంటూ బయటకు వచ్చి పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇక ఏపీ ప్రభుత్వం తరపున టాలీవుడ్ అంశాన్ని డీల్ చేస్తున్న పేర్ని నాని .. పవన్ కల్యాణ్‌ను తిట్టడమే కాదు ఆ పేరుతో మోడీ, అమిత్ షా , కేసీఆర్ సహా అందర్నీ తిట్టేశారు. తిట్టాల్సినవి తిట్టి .. తనకు ఆ అభిప్రాయం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
పవన్ కల్యాణ్ విమర్శలపై సమాధానం ఇచ్చేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన పేర్ని నాని తెలంగాణ కంటే ఏపీలోనే సినిమాలకు ఎక్కువ షేర్ వస్తోందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన ప్రతి విమర్శ ముందు సన్నాసి అని పవన్ ను తిట్టేందుకు.. ప్రతీ దాని ముందుకు కులాన్ని తీసుకొచ్చి విమర్శలు గుప్పించారు. మాట కంటే ముందు పీకే గాడు.. వాడు .. వీడు అంటూ చెలరేగిపోయారు. మళ్లీ ఒకే కులం కాబట్టి అంటున్నామంటూ ఆ మాటలను కూడా సమర్థించుకున్నారు. పవన్ ఇండస్ట్రీ మొత్తం గురించి చెబితే.. పేర్ని నాని పవన్ కల్యాణ్ సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి.. ఎన్ని హిట్లయ్యాయి… అని లెక్కలు చెప్పి తిట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
జగన్ లోకువయ్యారనే తిట్టారని.. కానే మోడీ, కేసీఆర్, అమిత్ షాలను తిట్టగలరా అని పేర్ని ప్రశ్నించారు. వారంటే పవన్‌కు భయమని ఎద్దేవా చేశారు. నిజానికి సినిమా ఇండస్ట్రీకి తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు. ఏపీ ప్రభుత్వం పెడుతున్నన్ని ఇబ్బందులు పెట్టడం లేదనే కదా చెప్పింది. ఇక జీఎస్టీ గురించి మోడీని తిట్టాలని పేర్ని నాని సవాల్ చేశారు. అసలు జీఎస్టీ గురించిన ప్రస్తావన పేర్ని నాని ఎందుకు తెచ్చాడో తెలియదు కానీ ఈ వంకతో కేసీఆర్, మోడీ, అమిత్ షాలను పేర్ని నాని తిట్టేశారు. తర్వాత అలా పవన్ తిట్టవచ్చు కదా అనికవర్ చేసుకున్నారు. ఏపీలో పూర్తి స్థాయిలో సినిమాలు రిలీజ్ చేసుకోలేక నిర్మాతలు తంటాలు పడుతున్న విషయాన్ని కప్పి పుచ్చాడనికి ఎన్ని ధియేటర్లు ఓపెన్ అయ్యాయో లెక్కలు చెప్పారు కానీ.. యాభై శాతం సీటింగ్‌కే పర్మిషన్.. మూడు షోలు మాత్రమే అనే వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఇక టిక్కెట్ రేట్ల విషయంలో అయితే పాత వాదనే వినిపించారు.
ఒక్క పేర్ని నాని మాత్రమే కాదు ఉదయం నుంచి మంత్రులు అనిల్ కుమార్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఇలా అందరూ వరుసగా మీడియా ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఎవరూ నేరుగా పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై స్పందించలేదు. చాలా మంది అసలు టిక్కెట్ల గురించి పవన్ కేం సంబంధం అని చెప్పుకొచ్చారు. ఎక్కువగా పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడానికే సమయం వెచ్చించారు.