రాజకీయ నాయకులు చేసినన్ని తప్పులూ ఇంకెవ్వరూ చెయ్యరు. మొత్తం వ్యవస్థలను నాశనం చేస్తున్నది వాళ్ళే. తరతరాలకు సరిపడా కావలసినంత డబ్బు సంపాదించుకోవాలనుకోవడం, కొన్ని తరాల పాటు అధికారం కూడా వాళ్ళ చేతుల్లో ఉండాలన్న తాపత్రయంతో తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. అన్ని తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టే తప్పులను ఎత్తి చూపేవాళ్ళంటే అస్సలు ఇష్టపడరు. తప్పుల గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎదురుదాడే సమాధానం అనే పాలసీని ఫాలో అవుతూ ఉంటారు. అవినీతి, ప్రజా సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు….ఇలా ఏ విషయం గురించి ప్రశ్నించినా…గతంలో ఉన్నవాళ్ళు ఏం చేశారు? వాళ్ళకంటే మేం గొప్పగానే చేస్తున్నాం, వాళ్ళ అవినీతితో పోల్చుకుంటే మాది ఎంత అనే తరహాలోనే మాట్లాడుతూ ఉంటారు. నరేంద్రమోడీ, చంద్రబాబు, కెసీఆర్, జగన్…ఇలా అందరు నేతలదీ అదే తరహా. ఆ తరహా రాజకీయాలకు విసిగిపోయిన ప్రజలే కొత్తగా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఆశగా చూస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మంది ప్రజలు పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. కానీ చిరంజీవి కూడా అవే పాత రోత రాజకీయాలు చేసేసరికి దూరం జరిగారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే పాత రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో మోడీని, చంద్రబాబుని గెలిపించండి…వాళ్ళు పనులు చేసేలాగా నేను చేస్తా అని నమ్మకంగా చెప్పాడు పవన్. మోడీ, బాబులు అధికారంలోకి వచ్చిన తర్వాత…ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా నెరవేర్చని నేపథ్యంలో …ఇంకా ప్రశ్నించవేంటి పవన్ అని అడిగినవాళ్ళకు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు పవన్. నా దగ్గర ఎమ్మెల్యేలు లేరు, ఎంపిలు లేరు…ప్రశ్నించేంత బలం నాకులేదు అన్నాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆ విషయం పవన్‌కి తెలియదా? ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్‌కి ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎలా వస్తారు? ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు కూడా అలాంటి ఓ పాత రాజకీయ డైలాగులే పేల్చాడు పవన్. ప్రజా సమస్యలను ఎత్తి చూపడం దగ్గరే ఆగిపోతున్నారు, ట్విట్టర్‌కే పరిమితమవుతున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పని పవన్ ఎదురుదాడికి మాత్రం దిగాడు. ఇంతకు ముందు ఉన్న పార్టీలు మాత్రం ఏం చేశాయి? అందరూ కూడా ఓ రెండు రోజులు సమస్య గురించి మాట్లాడి సైలెంట్ అయినవాళ్ళే కదా అని ఆయా పార్టీలను విమర్శించాడు. వాళ్ళకంటే నేనే బెటర్ అనేలా చెప్పుకొచ్చాడు పవన్. గత కొన్ని దశాబ్ధాలుగా నాయకులందరూ చేస్తున్నది ఇదే. మిగతావాళ్ళకంటే నేను బెటరే కదా అని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు పవన్ కూడా అదే చేస్తున్నాడు. సమస్యలు పరిష్కారమయ్యేవరకూ పోరాడతాను అనే సమాధానం అయితే పవన్ చెప్పలేకపోయాడు. ఇక ఆక్వా పార్క్ గురించి పవన్ స్పందించిన విధానం కూడా అస్సలు బాగాలేదు. కొన్ని గ్రామాలు, వేల మంది ప్రజలు…ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యను అధ్యయనం చేయాల్సిన బాధ్యత నాయకులకు ఉంటుంది. అంతేకానీ పొల్యూషన్ సమస్య లేదు అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళే ప్రజలను కన్విన్స్ చేయాలి అని మాట్లాడడం మాత్రం ప్రజల భయాందోళనలను తక్కువ చేసి చూడడమే. 144 సెక్షన్ విధించి మరీ పోలీసుల ద్వారా ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ చర్యల గురించి కనీస మాత్రంగా కూడా విమర్శించే ప్రయత్నం చేయలేదు పవన్. చాలా ప్రశ్నలకు అయితే ఎదురుదాడికి దిగడం, లేకపోతే లౌక్యంగా సమాధానం దాటవేసే ప్రయత్నమే చేశాడు పవన్. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ చేస్తున్న రాజకీయ ఇదే. ఇంతోటి రాజకీయానికి ఇప్పుడు మరో రాజకీయ నాయకుడు అవసరమా అన్న భావన ప్రజలకు వచ్చిందంటే మాత్రం పవన్ రాజకీయ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందనడంలో సందేహం లేదు. అలా కాకుండా తరచుగా మాటలు చెప్తున్నట్టుగా ….ప్రజలకోసం ప్రాణాలిచ్చే అవసరం లేకపోయినా…కనీసం ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ, లేకపోతే పోరాటం చేస్తున్న ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తే అది పవన్ పొలిటికల్ కెరీర్‌కే మంచిది.