” వ్యాపారం చేయడం ప్రభుత్వ విధి కాదు..” అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్మోహమాటంగాప్రకటించి..ప్రభుత్వ రంగ సంస్థలను.. ప్రైవేటు పరం చేయడానికి ప్రధానమైన కారమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ కారణం చెప్పి… ప్రభుత్వ రంగంలో పేరెన్నిక గన్న సంస్థలన్నింటినీ.. డిజిన్వెస్ట్ మెంట్ పేరుతో ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో బ్యాంకింగ్ రంగం నుంచి ప్రజా రవాణా వరకూ అన్నీ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది..? ప్రజల్ని ప్రైవేటుకి వదిలి చోద్యం చూస్తుందా..? ప్రైవేటు కంపెనీల దగ్గర ఎలక్షన్ ఫండ్స్ తీసుకుని వారికి అనుకూలంగా విధానాలు రూపొందిస్తుందా..?. ఆ కంపెనీలు గుత్తాధిపత్యం సాధించి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూంటే చూస్తూ ఉంటారా..?. అభివృద్ధి చెందిన దేశాల్లోని విధానాలను చూసి అయినా ప్రజలపై కాస్త బాధ్యతగా ఉండే ప్రయత్నం చేయరా..?
తెగనమ్మడమే ప్రధాన వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం పని తీరు..!
కేంద్రం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వంద ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మకానికి పెడుతోంది.వీటి విలువ అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ప్రభుత్వ అధీనంలోని ఇంధన సంస్థలు, స్పోర్ట్స్ స్టేడియాలు, రైల్వే, టెలికామ్ లాంటి వివిధ సంస్థలను ప్రైవేటుపరం చేయలని మోదీ సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను కేంద్రం ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపింది కూడా. జాబితాలోని సంస్థలకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడెప్పుడు ఏ కంపెనీని ప్రైవేటుపరం చేయాలి.. ఎంతకు అమ్మాలి అనే దానిపై షెడ్యూల్ తయారు చేసే పనిలో ఉంది కేంద్రం. 2022 ఆర్థిక సంవత్సరానికి లక్షా 75 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలోనే ఆ ఏడాదిలోనే మరిన్ని సంస్థలు ప్రైవేటుపరమవ్వడం ఖాయంగా తెలుస్తోంది. దశాబ్దాలుగా ప్రభుత్వరంగం పోగేసి కాపాడుతున్న ఆస్థులన్నింటినీ అమ్ముకోవడం. ఇప్పుడు ఈ ఫార్ములాతో కేంద్రం దేశంలోని ప్రధాన సంస్థలన్నిటిని ప్రైవేటకు కట్టబెట్టనుంది. ఆర్థికవ్యవస్థను పీడిస్తోన్న అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. అలా అని ఏ నిపుణులు కేంద్రానికి నివేదించారో కానీ.. ఆ విషయంలో దూకుడుగా ఉంటోంది. నిజానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. గుజరాత్లో ప్రైవేటీకరణను పెద్దగా అనుమతించలేదు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ను ఆయన ఓఎన్జీసీలో విలీనం చేయించడం… ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. ప్రధానమంత్రి అయిన కొత్తలో కూడా.. ప్రభుత్వరంగ సంస్థలు చనిపోవడానికే పుట్టాయన్న వాదన సరైంది కాదని ఆయన అన్నారు, గుజరాత్ లో ప్రభుత్వ రంగ సంస్థల్ని వృత్తి నిపుణులతో నింపి లాభసాటిగా మార్చామని చెప్పుకున్నారు. బహుశా.. ఆ పద్దతిలో మోడీ ప్రభుత్వ రంగ సంస్థల్ని సంస్కరిస్తారేమో అని అనుకున్నారు. కానీ జరుగుతోంది వేరు.
ప్రభుత్వ సంస్థల్ని నష్టాల్లోకి నెడుతోంది ప్రభుత్వ విధానాలే..!
ప్రభుత్వరంగానికి సంబంధించిన నిర్ణయాలు కేవలం ప్రభుత్వానికో, రాజకీయ పార్టీలకో సంబంధించినవి కావు, ప్రజల ఆస్తికి ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వానికి ఆ ఆస్తిని అమ్మే హక్కు లేదు. ఒక్క స్టీల్ ప్లాంట్.. మరో ఎల్ఐసి మాత్రమే కాదు, దేశంలో ప్రభుత్వరంగ సంస్థల పరిస్థితి ప్రభుత్వం చిత్రిస్తున్నంత దారుణంగా ఏమీ లేదనేది రికార్డుల బట్టి తెలుస్తుంది. దేశంలోని 366 ప్రభుత్వరంగ సంస్థల్లో కేవలం 43 మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. వీటిలో అత్యధికం… ఆయా సంస్థల వైఫల్యం కాదు.. ప్రభుత్వ విధానాల కారణంగానే నష్టాల్లోకి వెళ్తున్నాయి. ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే..ఏ ప్లాంట్ కీ రానన్ని లాభాలు వస్తాయి. అదే విధంగా 2009 వరకు ప్రభుత్వ రంగ టెలికం పరిశ్రమ లాభాలతో నడిచేది. అయినా ఆధునికీకరణను ఉద్దేశపూర్వకంగానిలిపిశారు. ఫలితంగా జియోలాంటి సంస్థలు భారీ పెట్టుబడులతో వచ్చి బీఎస్ఎన్ఎల్ మార్కెట్‌ను అందిపుచ్చుకున్నాయి. విమానాశ్రయాలు, రేవులను కూడా పద్ధతి ప్రకారం నష్టాల్లో నెట్టివేస్తున్నారు.
బ్యాంకుల్ని విలీనం చేసింది హోల్‌సేల్‌గా అమ్మడానికా..!
నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలుగా విలీన ప్రక్రియ జోరందుకుంది. దేశంలో ఉన్న 28 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి 6 లేక 7 పెద్ద బ్యాంకులుగా చేయాలని కొన్ని కమిటీలు సిఫార్సులు చేయడంలో ఆ మేరకు విలీనాలు పూర్తి చేశారు. పెద్ద బ్యాంకులుగా చేసి, మూలధన వాటాలను అమ్మటం ద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించుకొని ప్రైవేటీకరణ చేయటమే దాని సారాంశం. ఇప్పుడు ్దే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుబంధ బ్యాంకులను ఎస్బిఐలో విలీనం చేసింది. మిగిలిన బ్యాంకులనూ విలీనం చేశారు.ప్రపంచమంతా చిన్న బ్యాంకుల మార్గమే మంచిదని చెపుతుంటే మన దేశంలో మాత్రం భిన్నమైన మార్గంలో పయనించారు.2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభకాలంలో అమెరికా, యూరప్‌లోని అనేక దేశాలలో అతిపెద్ద బ్యాంకులు కుప్పకూలీ ఆర్ధిక వ్యవస్థలు మందగించాయి. ఆ అనుభవం తరువాత చిన్న బ్యాంకులే ఆర్ధిక వ్యవస్థకు శ్రేయస్కరమని ప్రపంచబ్యాంకు కూడా ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. ఎంత పెద్ద బ్యాంక్ కుప్పకూలితే ఆర్ధిక వ్యవస్థకు అంత ఎక్కువ నష్టం. దీన్ని చెప్పడానికి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులై ఉండాల్సిన అవసరం కూడా లేదు.
ప్రభుత్వంలోనూ ప్రైవేటీకరణ ప్రారంభమయింది..! తెలిసింది కొందరికే..!
ఇవాళ ప్రభుత్వ సంస్థల్ని అమ్మి రేపు ప్రభుత్వాలను ప్రైవేటు పరం చేస్తారని.. కొంత మంది ప్రధాని మోడీపై సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ప్రభుత్వంలోనూ ప్రైవేటీకరణ ప్రారంభమయింది. మోడీ సర్కార్ కొద్ది రోజుల కిందట.. ప్రైవేట్ రంగానికి చెందిన 9 మంది వ్యక్తులను సంయుక్తకార్యదర్శులుగా నియమించింది. దేశానికి అత్యున్నతమైన సివిల్ సర్వీస్ వ్యవస్థ ఉంది. వారి శిక్షణ కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అత్యుత్తమమైన పరీక్షా మార్గంలో ప్రతిభను వెలికి తీస్తున్నారు. వారిని కాదని ప్రైవేటు కార్యదర్శుల్ని… ప్రైవేటు రంగంలో ప్రతిభ చూపిన వారిని నియమించుకోవడానికి మోడీ సర్కార్ ఆసక్తి చూపించింది. ఈ నియామకాలు ఇంతటితో ఆగవు. ప్రతీ రంగానికి విస్తరిస్తాయి. చివరికి ప్రభుత్వం ప్రైవేటు గుప్పిట్లోకి వెళ్లడానికి ఇదే.. సూది మొనంత మార్గం ఇచ్చినట్లయింది. తర్వాత ఇది ఏనుగు పట్టేంత మార్గంగా మార్చేస్తారు. విశృంఖల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలనే కాదు, ఆర్థికవ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తుందనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట.
అన్నింటినీ ప్రైవేటు పరం చేసినా విద్య, వైద్యం జాతీయకరణ చేస్తే చాలు..!
వ్యాపారం ప్రభుత్వ విధి కాదు.. కానీ ప్రజలను ప్రైవేటుకు వదిలేయడం కూడా ప్రభుత్వ విధి కాదు. ఇంకా చెప్పాలంటే.. అసలు ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ… ప్రజలందర్ని వారి వైపు నెట్టేస్తుంది. తర్వాత ప్రజలను ఆ సంస్థలు పీడించవనేదానికి గ్యారంటీలేదు. దానికి ప్రస్తుతం సెల్ ఫోన్ చార్జీలే నిదర్శనం. సరే.. వాటిని నియంత్రించడానికి కేంద్రం ఏదో చట్టం చేస్తుందని అనుకుందాం. మరి ప్రభుత్వ సంస్థలన్నింటినీ తెగ నమ్మి వచ్చే నిధులతో ఏం చేస్తారు. ప్రైవేటీకరణ విషయంలో ప్రజలకు రక్షణ ఉండేలా చట్టాలు చేసి ముందడుగు వేసినా ప్రజలు హర్షిస్తారు. అయితే.. విద్య , వైద్య రంగాన్ని మాత్రం పూర్తిగా జాతీయీకరణ చేయాలనే డిమాండ్ ప్రజల్లో ఉంది. దేశ ప్రజల ఆర్థిక కష్టాలకు.. ఈ విద్య, వైద్య ఖర్చులే కారణం. తమ సంపాదనకు ఎన్నో రెట్లు అప్పులు చేసి… విద్య, వైద్య సేవల కోసం ప్రజలు ఖర్చు చేస్తున్నారు. ఈ రంగాలను కూడా ప్రైవేటుకు వదిలివేస్తే.. ఇక ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
అభివృద్ధిచెందిన దేశాల్లో… వ్యాపార సంస్థలు.. ప్రభుత్వ అధీనలో ఉండవు. ప్రైవేటు అధీనంలోనే ఉంటాయి. కానీ ఆయా దేశాల్లో విద్య, వైద్య రంగాలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ప్రజలకు ఆ రెండు సౌకర్యాలను అందుబాటులోకి ఉంచుతారు. అందుకే అన్నింటినీ ప్రైవేటీకరణ చేసే ముందు.. ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది… అదే.. “దేశం అనేది కంపెనీ కాదు”..!