రెండు రోజుల తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ డిక్లరేషన్ పేరుతో హామీలను ప్రకటించి రైతుల్లో చర్చజరిగేలా చూసుకున్నారు . ఆ డిక్లరేషన్‌పై విపక్షాలు కూడా చర్చ ప్రారంభించడం ఓ రకంగా సక్సెస్సే. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లోని నేతల అంతర్గత పోరాటంపైనా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు బహిరంగసభతో పాటు ఇటు గాంధీ భవన్లో జరిగిన సమావేశంలోనూ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఎవరు పార్టీ గీత దాటినా గెంటేయడం ఖాయమన్నారు. ఎంత పెద్ద నేత అనే సంగతిని తాము చూడమన్నారు.
నిజానికి ఇలాంటి వార్నింగ్‌లు ఎప్పుడూ ఇస్తారు. కానీ అంతర్గత సమావేశాల్లో ఇస్తారు. ఈ సారి నేరుగానే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుకునేది కాంగ్రెస్సేనని చెబుతూంటారు. పంజాబ్‌లో అదే నిజమయింది. అక్కడ నాయకులకు ఒకరితో ఒకరికి పొసగకపోవడం వల్ల మొదటికే మోసం వచ్చింది. అప్పుడే కొంత మందిని వదులుకుని ఉంటే.. పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదన్న అభిప్రాయం ఉంది. అందుకే అలాంటి తప్పులు తెలంగాణలో జరగకూడదన్న లక్ష్యంతో రాహుల్ ఉన్నారని అందుకే హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు.
అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరి మాటా వినేవారు కాదు. జగ్గారెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ పార్టీకి చేసిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వారిని బుజ్జగిస్తున్నారు కానీ వదిలించుకోవడం లేదు. రేపు తేడా వస్తే మళ్లీ అదే దారిలో వెళతారు. ఇక టీఆర్ఎస్ , బీజేపీలతో ఎవరెవరు కుమ్మక్కయ్యారో ఆ పార్టీలో బహిరంగం. అలాంటి వారు రాహుల్‌తో వేదికపై మాట్లాడారు. వారికి కూడారాహుల్ వార్నింగ్ ఇచ్చారు. కానీ వారు ఆయా పార్టీలతో సంబంధాలు తెంపుకోవడం కష్టమే. మొత్తంగా అయితే అందరి జాతకాలు రాహుల్ దగ్గర ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక ముందు ఓ లెక్క రాహుల్ సందర్భం వచ్చినప్పుడు నిరూపిస్తే.. పార్టీలో క్రమశిక్షణ దారికొస్తుంది. రాహుల్ టూర్ సక్సెస్ తో రేవంత్ ఇమేజ్ పెరిగిందని భావించేవాళ్లు రేపోమాపో తెరపైకి వచ్చి కొత్త గలాటా ప్రారంభిస్తారు. అలాంటి వారిపై వెంటనే వేటు వేస్తే ఇతరులు అలాంటి సాహసం చేయకుండా ఉంటారు. మాటలు చెప్పినంత సీరియస్‌గా రాహుల్ చేతలు చూపిస్తే టీ కాంగ్రెస్ రేసుకొచ్చినట్లే అనుకోవచ్చు.