అంతన్నారు.. ఇంతన్నారు.. వేల కోట్ల లెక్కలు చెబుతున్నారు కానీ రైతుకు భరోసా కింద ఇస్తున్నది రూ. ఐదున్నర వేలే. రైతు భరోసా పథకం కింద ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కి నిధులు విడుదల చేయబోతున్నారు. యాభై లక్షల మంది రైతులకు రూ. 3700 కోట్లకుపైగా జమ చేస్తున్నామని ఘనంగా ప్రకటించారు. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన దాని ప్రకారం చూస్తే ప్రతీ రైతుకు రూ. ఏడున్నర వేలు రావాలి. కానీ ఐదున్నర వేలే జమ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం ఇచ్చే రెండు వేలకు కూడా ఇప్పుడు తాము మీట నొక్కుతున్న అకౌంట్లో కలిపేశారు.
కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని కలిపేశారు.. కేంద్రం ఇచ్చే ఆరు వేలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో చూపిస్తోంది. నిజానికి కేంద్రం ఏపీ రైతులకు పంచే డబ్బుల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. ముఫ్పై లక్షల మందికి కూడా ఆ మొత్తం రావడం లేదు. మిగిలిన వారికి ఏపీ సర్కార్ నిధులు ఇస్తోందో లేదో ఎవరికీ తెలియడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే రూ. ఐదున్నరవేలే పథకం మొత్తం. ఆ తర్వాత రెండు విడుదలల్లోనూ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. మరో విడతలో రూ. నాలుగువేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది..కానీ అందులోనూ రెండు వేలు కేంద్రానివే. ఆ తర్వాత జనవరిలో మూడో విడత ఇచ్చేది పూర్తిగా కేంద్రమే.
కేంద్రం పీఎం కిసాన్ ను ప్రకటించక ముందే జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. అందులో పన్నెడున్నరవేలు రైతుకు మేలో ఒకే సారి ఇచ్చి పంటకు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. కానీ అధికారంలో వచ్చాక మాట మార్చేశారు. కేంద్రం ఇస్తోంది కదా అని తము కత్తిరించేశారు. కానీ తామే ఇస్తున్నట్లుగా మీటలు నొక్కుతున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతులకు ఒకే సారియాభై వేల వరకూ లబ్ది చేకూర్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి ఐదారువేలు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఉన్న ఇతర పథకాలన్నింటినీ ఆపేశారు. ప్రభుత్వ పరంగా రైతులకు ఏ ఒక్క పథకం దన్నూ ఉండటం లేదు.