సూపర్‌స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం వూహించిన పరిణామమే గాని ఆ రాక వెనక వున్న రాజకీయం మరింత ఆసక్తికరమైంది. బిజెపి నేతలు చాలా కాలంగా ఆయనను తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. జయలలిత కరుణానిధితో సహా చాలా మంది బిజెపితో సన్నిహితంగా వున్న మాట నిజమే గాని ఆ పార్టీ నేతగా తమిళుల ఓట్లు పొందడం కుదరదని రజనీకి తెలుసు.పైగా ఆయనకు కర్ణాటక అనుబంధం సమస్య వుండనే వుంది. ఈ నేపథ్యంలో స్వయంగా పార్టీ పెట్టి ఎంజిఆర్ జయలలితల లాగే తను కూడా కేంద్రంలో వున్న వారితో మంచిగా వుండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే తన ప్రసంగంలో తమిళనాడు గురించి తప్ప దేశం గురించి దాదాపు మాట్లాడలేదు.పార్లమెంటు ఎన్నికలపై పరిశీలన చేస్తున్నామని మాత్రమే అన్నారు. ఈ ప్రకటనకు ముందు రోజే దినకరన్ జయలలిత స్థానాన్నిఎవరూ భర్తీ చేయలేరని పరోక్షంగా దాడి చేశారు. ఇంతకూ దినకరన్ ప్రస్తుత ఎఐడిఎంకె ప్రభుత్వాన్ని పడగొడితే శాసనసభ ఎన్నికలుకూడా ఒకేసారి రావచ్చని ఒక భావన. అయితే స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన 18 మంది దినకరన్ వర్గీయుల భవిష్యత్తుపై జనవరి 9న కోర్టు తీర్పు వెలువడుతుంది. దాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానన్న రజనీ మాట పరోక్షంగాబిజెపితో చెలిమికి ఉద్దేశించిందేనని పరిశీలకులు అంటున్నారు. దానికి తగినట్టే బిజెపినేతలు ఒక్క సుబ్రహ్మణ్య స్వామి తప్ప తక్కిన వారంతా స్వాగతించారు. రజనీకాంత్ వామపక్షాలతో లేదా కాంగ్రెస్‌తో కలిసే అవకాశం లేదు.ఇప్పటివరకూ అసహనంపైన గాని మరో విషయంలో గాని ఆయన ప్రకటన చేసింది లేదు.ఉన్నంతలో ప్రధాని మోడీ పట్ల సానుకూలంగానే వ్యవహరించారు. డిఎంకె ఆర్కే నగర్లో కూడా దెబ్బ తిన్న దృష్ట్యా ఆయన చూపు యావత్తు అధికార పీఠంపైనే వుండటంలో ఆశ్చర్యం లేదు. మిగిలిన అవినీతి వ్యతిరేకత వంటివన్నీ షరా మామూలుగా అందరూ చెప్పేవే. రజనీ ప్రవేశంతో తమిళరాజకీయాలు ద్రవిడ వరవడి నుంచి దారి మార్చుకోవలసిందే. కమల్ హాసన్ ఎలాగూ ఆయనతో సరితూగే పరిస్థితి వుండదు. అన్నా డిఎంకెలో ఓట్లు తెచ్చేవారు లేరు గనక నెమ్మదిగా ఆ నాయకులు కూడా ఇటు మళ్లినా ఆశ్చర్యం లేదు. దేశంలో సినిమా రాజకీయాల్లో రజనీ రాకడ మరో ఘట్టం అవుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసినప్పుడే సమర్థించిన రజనీకి ఆయనతోనూ మంచి సంబంధాలే వున్నాయి. పైగా వెంకయ్య నాయుడు వంటి వారు వుండనే వున్నారు.