సినిమాకి కథ ఎంత ముఖ్యమో… బలమైన పాత్రలూ అంతే ముఖ్యం. ప్రతీ పాత్రకీ ఓ ఆరంభం, ముగింపు ఉండాలి. కథకి పాత్రలే పునాదులు.. మూల స్థంభాలు. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి పాత్రల్ని తెలుగు సినిమాల్లో చూడలేకపోతున్నాం. తెలుగు సినిమాలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయి… అని నిందించే ఈ కాలంలోనూ కనీసం కథానాయకుడి పాత్రని కూడా సరిగా రాసుకోకుండా, అడ్డదిడ్డంగా తీర్చిదిద్దుతున్న సినిమాలు చాలానే మన ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సరిస్థితుల్లో ‘రంగస్థలం’ ఓ హరివిల్లులా వికసించింది.
ఈమధ్య కాలంలో క్యారెక్టరైజేషన్ల మీద నడిచి, నిలిచిన సినిమా `బాహుబలి`. అందులో బాహుబలితో పాటు భళ్లాలదేవ, శివగామి, కట్టప్ప, దేవసేన…. ఇలా ప్రతీ పాత్ర కథతో మమేకం అయిపోయింది. అవే సినిమాని నడిపించాయి. ఆ తరవాత అన్ని బలమైన పాత్రలు ‘రంగస్థలం’లో కనిపించాయి. సుకుమార్ రాసుకున్న ఓ సాధారణమైన కథకి ఆ పాత్రలే ప్రాణం పోశాయి. చిట్టిబాబు, రామ లక్ష్మి, రంగమ్మత్త, ఫణీంద్ర భూపతి, కుమార్ బాబు…. ఇలా ప్రతీ పాత్ర ఆకట్టుకుంది. ఇవన్నీ బలంగా పెనవేసుకున్నాయి కాబట్టే.. రంగస్థలం కొత్త రంగులు సంతరించుకుంది.
* చిట్టిబాబు
కథానాయకుడు చెవిటివాడు.. అనే పాయింట్ ఈ కథకి చేర్చకపోతే.. రంగస్థలం ఈ రేంజులో కనిపించేది కాదు. చెవిటిమాలోకం అనే పాయింట్ చుట్టూ సరదా సన్నివేశాలు, హృదయాన్ని పిండేసే ఎమోషన్ సీన్లు రాసుకొనే అవకాశం చిక్కింది. చిట్టిబాబు – రామలక్ష్మి మధ్య ప్రేమాయణంలో ‘చెవుడు’ కీలక పాత్ర పోషించింది. రోజంతా తన చెవికి సోకని మాటల్ని, సందాళ మళ్లీ తీరిగ్గా వినడానికి ఓ అసిస్టెంట్‌ని పెట్టుకోవడం గమ్మత్తుగా అనిపిస్తుంది. ప్రెసిడెంటు ఇంటి దగ్గర తన తండ్రికి జరిగిన అవమానం.. చిట్టిబాబు ‘చెవి’కెక్కించుకోడు. అది సహాయకుడి మాటల ద్వారానే అర్థం అవుతుంది. అలా… సహాయకుడి పాత్రనీ, చిట్టిబాబు వ్యాపకాన్ని కూడా తెలివిగా వాడుకున్నాడు సుకుమార్.
తన చేతుల్లో ప్రాణాలు కోల్పోతూ అన్నయ్య చెప్పిన మాటలు చెవికెక్కించుకోవడానికి చిట్టిబాబు పడే ఆత్రం.. కదిలిస్తుంది. చిట్టిబాబు కనిపించిన సీన్ నెం.1 నుంచి.. క్లైమాక్స్ వరకూ ఆ పాత్ర ఒకేలా ప్రవర్తించింది, ఒకేలా మాట్లాడింది, ఒకే దారిలో నడిచింది. అంత నికార్సయిన తూకం కలిగిన పాత్ర ఈమధ్య కాలంలో చూడలేదేమో!
చరణ్ గెడ్డం పెంచుకుంటేనో, గళ్ల లుంగీ కట్టుకుంటేనో చిట్టిబాబు అవ్వలేదు. ఆ పాత్రని నరనరాన ఎక్కించేసుకున్నాడు. అందుకే తొలిసారి చరణ్‌లోని నటుడు పూర్తి స్థాయిలో రెక్కలు కట్టుకుని బయటకు వచ్చాడు.
* రామలక్ష్మి
ఎంత సక్కగున్నావే అంటూ రామలక్ష్మి కోసం పాట రాసేశాక.. ఇక ఆమెను కొత్తగా పొగడడం అనవసరం. పల్లెటూరి అందమంతా ఆమెలో కనిపించింది. అలాగని ఆమెకేం.. ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ వేయలేదు. పదహారణాల పడుచులూ ముస్తాబు చేసి చూపించలేదు. ఎప్పుడు చూసినా మాసిన దుస్తుల్లో కనిపించింది. కనీసం జుత్తు కూడా దువ్వు కోలేదు. పల్లెటూర్లలో పొలం పనులు చేసుకునే అమ్మాయిలు ఎంత సహజంగా ఉంటారో అంతే సహజంగా చూపించాడు. కానీ.. ఆమె అందం చెక్కు చెదరలేదు. డీ గ్లామర్‌లో ఉన్న గ్లామరేంటో ఈ పాత్ర నిరూపించింది.
* రంగమ్మత్త
పల్లెటూర్లలో ఓ గొప్ప సంప్రదాయం కనిపిస్తుంది. ఎవరినైనా సరే.. వరసలు పెట్టి పిలిచేస్తుంటారు. పక్కింట్లో పెళ్లయిన అంటీలంతా అత్తలే. ‘అల్లుడా.. అల్లుడా’ అంటూ ఆ అత్తలూ సరదాగా సరసమాడేస్తుంటారు. రంగమ్మత్తని చూస్తే… అలాంటి అత్తలకు ప్రతిరూపంలా తోచింది. కేవలం ఆ పాత్రని సరసానికే వాడుకోలేదు. ఆమె ఓ భయంకరమైన విషాదాన్ని గుండెల్లో దాచుకుని మౌనంగా రోదిస్తున్న సగటు ఇల్లాలు. ‘అసలే మా ఆయన దుబాయ్‌లో ఉన్నాడు’ అంటూ రొమాంటిక్‌గా మాట్లాడిన రంగమ్మత్త.. ఎంతలోతుగానైనా ఆలోచిస్తుందని, మాట్లాడగలదని.. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం ద్వారా అర్థం అవుతుంది. చివర్లో ఈ పాత్రకు ఇచ్చిన ముగింపు కూడా బాగుంది.
* ఫణీంద్ర భూపతి
జగపతి బాబు విలన్‌గా మారాక ఆయనకెప్పుడూ రొటీన్ పాత్రలే పడ్డాయి. అదే ఆవేశం, అవే అరుపులు. ఇందులో ఫణీంద్ర భూపతి వేరు. ఎక్కడా… ‘మీటర్’ దాటి ప్రవర్తించలేదు. డైలాగ్ డెలివరీలోనూ అనూహ్యమైన మార్పు కనిపించింది. పెద్దరికం ముసుగులో ఉన్న ఓ పెద్దపులిలా, కూల్‌గా పీకలు నరికేసే టైపు పాత్రలు చూసి చాలా రోజులైంది. అయితే ఈపాత్రని ముగించిన విధానం ఇంకాస్త బాగుండేదేమో అనిపిస్తుంది. ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనిపిస్తుంది. కుమార్ బాబు చనిపోయిన తరవాత.. రెచ్చిపోయిన ఊరి జనాలకు ఫణీంద్ర భూపతి ఎదురైతే.. కథలో కీలకమైన ట్విస్టుకి అవకాశం ఉండేది కాదు. అందుకే సుకుమార్ ఇలాంటి ఎత్తు వేసి ఉంటాడు.
* కుమార్ బాబు
ఆలోచన. వివేకం, కాస్తకోపం, తమ్ముడిపై ఎనలేనంత మమకారం, ఊరికి ఏదైనా చేయాలన్న తపన.. ఇవన్నీ ఉన్న ఓ అన్నయ్య ఎలా ఉంటాడు..?? కుమార్ బాబులా ఉంటాడు. ఆ పాత్ర కోసం ఆది పినిశెట్టిని ఎంచుకోవడం దగ్గరే.. సుకుమార్ గెలిచాడు. సరైనోడులో విలనిజం పీక్స్‌లో పండించిన ఆది… ఈసారి మంచి అన్నయ్య పాత్రలో అంత చక్కగా ఒదిగిపోయాడు. ఆ పాత్రపై ప్రేక్షకులకు ఎంత ప్రేమ కలిగితే.. ‘రంగస్థలం’లో ఎమోషన్ అంత పండుతుంది. అందుకే.. సీన్ సీన్‌కీ.. కుమార్ బాబుపై ప్రేమ కలిగేలా చేసుకుంటూ వెళ్లాడు సుకుమార్. బతికేశాడేమో అనుకుంటున్న తరుణంలో.. ఆ పాత్రని దూరం చేసి – గుండెల్ని మరింతగా మెలిపెట్టేశాడు.
ఇలా… ప్రతీ పాత్రతోనూ స్నేహం చేసి, ప్రేమించి… ఆ ప్రేమనంతా వెండితెరపై కురిపించాడు సుకుమార్. ‘రంగస్థలం’ గురించి ఎన్నాళ్లు చెప్పుకున్నా, ఎన్ని వసూళ్లు సాధించినా ఈ పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.