రాచపుండు లాంటి సమస్యలకు పరిష్కారం వెదకడం అంత తేలిక కాదు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని సరి చేయాలనుకుంటే.. ఆ తప్పులన్నీ మీదపడిపోతాయి, అందుకే ఇలాంటి అతి పెద్ద సమస్యల్ని ఎలాంటి ప్రభుత్వాలూ కెలుక్కోవాలని అనుకోవు, ఒక వే కెలుక్కుంటే అది ఎటు దారి తీస్తుందో ఊహించలేరు. రాజకీయంగా లాభం జరుగుతుందని అసలు అనుకోలేరు. అందుకే మూసీని మురిక కాలువ చేసి ఇందులో కాలనీలు కట్టేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. చెరువుల్ని మూసేసి ఆపార్టుమెంట్లు కట్టేసినా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదంతా తాను సరి చేయాలని రేవంత్ రెడీ అయ్యారు. ఆయన ఉద్దేశం మంచిదే కానీ.. ఇంత పెద్ద సమస్యను చిటికెలో పరిష్కరించేయగలనని ఆయన అనుకోవడంలోనే అసలు సమస్య ప్రారంభమయింది.
ముందు విస్తృతంగా చర్చ పెట్టాల్సింది !
రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి రెండు నెలలే అయింది. రెండు నెలలో ఆ సంస్థ కూల్చివేతల్లో సగం హైదరాబాద్ ను కూల్చివేసినంతగా గగ్గోలు రేగుతోంది. ఎందుకిలా అంటే…. ప్రజల్ని ప్రిపేర్ చేయకపోవడమే. ఆ అవకాశాన్ని విపక్షాలు వాడుకోవడమే. హైడ్రా ఏర్పాటును హడావుడిగా చేశారు. ఇంకా అసెంబ్లీలో చట్టబద్ధం చేయలేదు. అసెంబ్లీలో దీనిపై విస్తృతంగా చర్చ పెట్టి… ప్రజల ఆమోదం లభించేలా తన వాదనను ప్రభుత్వం వినిపించాల్సి ఉంది. సాధారణంగా కబ్జాలకు ప్రజల మద్దతు లభించదు. కాబట్టి .. ఆ తర్వాత హైడ్రా చట్టబద్ధంగా నోటీసులు జారీ చేసి.. అందర్నీ మెంటల్ గా ప్రిపేర్ చేసి కూల్చివేతలు చేసినట్లయితే వ్యతిరేకత కనిపించేది కాదు.. పైగా ప్రజల నుంచి మద్దతు వచ్చేది.
మూసి విషయంలోనూ ఇంత తొంతరపాటా ?
చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలపై దూకుడు చూపించినా పెద్దగా పట్టించుకోరు కానీ.. మూసి విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. ఎందుకంటే ఆ మురికి కాలువగా మారిపోయిన మూసిలో అంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, నిరుపేదలే ఉంటారు. అది కూడా నిన్నమొన్నటి నుంచి కాదు. దశాబ్దాల నుంచి. ఇలాంటి సమయంలో వారిని మెంటల్ గా ప్రిపేర్ చేయాలంటే.. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది. అందరికీ న్యాయం చేసి..అక్కడి నుంచి తరలిస్తేనే ప్రాజెక్టుకు సార్థకత ఉంటుంది. ఎందుంటే వారి వద్ద నుంచి ప్రభుత్వం అన్ని రకాల పన్నులూ వసూలు చేస్తోంది మరి. రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. మూసి విషయంలో రాత్రికి రాత్రి వెళ్లి మార్కింగ్ చేయడం ఎవరికైనా అసంతృప్తే. వారికి ముందు న్యాయం జరుగుతుందన్నభరోసా కల్పించిన తర్వాతే ముందడుగు వేయాల్సి ఉంది. కానీ దూసుకెళ్లిపోయారు.
ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోలేదు !
అవి ప్రభుత్వ స్థలాలే.. నదులే అయినా అక్కడ ఉన్న వారిని బుల్ డోజ్ చేసేస్తామంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఉండటానికి ప్రభుత్వాలే అనుమతి ఇచ్చాయి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం అది ఎవరి ప్రభుత్వం అన్నది మ్యాటర్ కాదు. వారి వద్ద నుంచి ఇంటి పన్నులు కట్టించుకుని రిజిస్ట్రేషన్లు చేసిచ్చి ఇప్పుడు అది.. ప్రభుత్వ స్థలం.. నది జాగా అంటే .. ప్రభుత్వం తప్పు చేసినట్లే. ముందుగా నిందించాల్సింది ప్రభుత్వాన్నే. బాధ్యత ప్రభుత్వానిదే. ఏ ప్రభుత్వమైనా ముందు బాధ్యత నిర్వర్తించి ఆ తర్వాత అధికారాన్ని చెలాయించాలి. రేవంత్ సర్కార్ ఈ లాజిక్ మిస్సయింది. ఉద్దేశం మంచిదే కానీ ఎగ్జిక్యూషన్ ఎంతో తెలివిగా ఉండాలి.