గుణశేఖర్ – సమంతల శాకుంతలం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. అన్ని ప్రాంతాలకూ సమంత వెళ్తోంది. అక్కడ సినిమా గురించి కాస్త గట్టిగానే మాట్లాడుతోంది. శాకుంతలం సమంత కెరీర్ లో కీలకమైన సినిమా. తనకే కాదు.. గుణశేఖర్ కెరీర్ కూడా ఈ సినిమాతోనే ముడి పడింది. దిల్ రాజు జడ్జిమెంట్ కి ఇది మరో పరీక్ష.
లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోకెల్లా అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిదే అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సమంతపై రూ.70 కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా సాహసమే. ఈ డబ్బుల్ని శాకుంతలం రాబట్టగలిగితే… చిత్రసీమకు బూస్టప్ దక్కుతుంది. హీరోయిన్లని నమ్ముకొని ఎంతైనా ఖర్చు పెట్టొచ్చన్న ధీమా వస్తుంది. లేడీ ఓరియెంటెడ్ కథలకు మరింత గిరాకీ ఏర్పడుతుంది. సమంత లాంటి స్టార్లు అప్పుడు ధైర్యంగా సినిమాలు చేయొచ్చు.
త్రీడీలో తయారైన సినిమా ఇది. తెలుగులో త్రీడీ అంతగా వర్కవుట్ కాలేదు. కల్యాణ్ రామ్ తీసిన `ఓం` ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. రుద్రమదేవికి కూడా త్రీడీ ఎఫెక్టులు ఇచ్చారు కానీ అంతగా వర్కవుట్ కాలేదు. రాజమౌళి లాంటి వాళ్లే త్రీడీలతో పడలేమంటూ లైట్ తీసుకొన్నారు. కానీ గుణశేఖర్ మరోసారి త్రీడీని నమ్ముకొని రిస్క్ చేశారు. నిజానికి ఈ సినిమా త్రీడీ ఫార్మెట్ లో షూట్ చేయలేదు. 2డీలో తీసి, త్రీడీగా కన్వెర్ట్ చేశారు. ఆ ఎఫెక్ట్ కి తగిన ప్రతిఫలం వస్తుందా? రాదా? అనేది చూడాలి. త్రీడీ వల్ల బడ్జెట్ పెరుగుతుంది. ఆ మేరకు వసూళ్లూ పెరగాలి. లేదంటే.. త్రీడీ ఎప్పుడూ నిర్మాతలకు అదనపు ఖర్చుగానే మిగిలిపోతుంది. ఒకవేళ గుణశేఖర్ కష్టానికి ప్రతిఫలం లభించి, త్రీడీ వల్ల ప్రేక్షకులు పెరిగితే, ఈ సినిమా స్థాయి పెరిగితే.. భవిష్యత్తులో త్రీడీ సినిమాల గురించి జనం ఆలోచించడం మొదలెడతారు.
అన్నింటికంటే ముఖ్యంగా గుణశేఖర్ కి ఇది డూ – ఆర్ – డై పరిస్థితి. ఎంతో ఖర్చు పెట్టి తీసిన రుద్రమదేవి తగిన రిజల్ట్ రాబట్టలేకపోయింది. రానాతో తీయాల్సిన హిరణ్య కశ్యప ఆగిపోయింది. గుణశేఖర్ ని నమ్మి హీరోలెవరూ రాని పరిస్థితుల్లో, సమంతని నమ్ముకొని చేసిన ప్రయోగం ఈ శాకుంతలం. గుణశేఖర్ మంచి టెక్నీషియన్. ఈ విషయంలో డౌటే లేదు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఘనత ఆయనకు ఉంది. అలాంటి గుణశేఖర్ ఎందుకో రేసులో వెనుకబడ్డాడు. అలాంటి దర్శకుడికి హిట్ పడాల్సిన అవసరం ఉంది. తెలుగు చిత్రసీమ స్కేలుని మార్చాలని తహతహలాడే గుణశేఖర్… ఇప్పుడు గనుక హిట్టు కొట్టాడంటే… తన కలల చిత్రం హిరణ్య కశ్యపని కూడా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలడు. ఇవన్నీ జరగాలంటే.. శాకుంతలంకి మంచి రిజల్ట్ రావాలి. మరి… ఈ సినిమా జాతకం ఎలా ఉందో?!