గతం లో స్టాలిన్ అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్న మురుగదాస్ మళ్ళీ ఇప్పుడు స్పైడర్ రూపం లో ఇంకో ఫ్లాప్ ఇచ్చాడు. దాంతో గతం లో జరిగిన చర్చ – “తమిళం లో సూపర్ హిట్లిచ్చిన దర్శకులు తెలుగులో ఎందుకు ఫ్లాప్స్ ఇస్తున్నారు” అనేది మళ్ళీ మొదలైంది ఇండస్ట్రీలో. ఇప్పుడు మురుగూదాస్ కానీ గతం లో ధరని, విష్ను వర్ధన్ లాంటి వాళ్ళు కానీ తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో ఫ్లాపివ్వడానికి కారణం ఒకటే కనిపిస్తోంది.
ఈ తమిళ దర్శకులు తెలుగు హీరోల ఇమేజ్ ని అంచనా వేయడం లో ఘోరంగా విఫలమవుతున్నారు. ఉదాహరణకి స్పైడర్ ని తీసుకుందాం. సినిమా మొత్తం మహేష్ ని కంప్యూటర్ స్క్రీన్ నుందు కూర్చోబెట్టేసి, ఆఖరుకు విలన్ ని పట్టుకునే కీలక ఘట్టాన్ని కూడా మహిళల చేతికి అప్పగించే సీన్ వ్రాసుకున్నాడు మురుగదాస్. ఇదే సీన్ ని ఆయన, తమిళం లో ఏ విజయ్ లాంటి హీరోకో చెప్పగలడా, చెప్పి ఒప్పించగలడా. అసలు ఆ కోణం లో ఆలోచించగలడా? లేదు. ఎందుకంటే గ్రాస్ రూట్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ ఆయనకి స్పష్టంగా తెలుసు. కానీ మహేష్ ది కూడా అంతకు సమానమైన లేదా అంతకు మించిన ఇమేజ్ అనే విషయం ఆయన ప్రక్కనపెట్టేశాడు.
అలాగే ధరణి అనే దర్శకుడు ఉనాడు.ఆయన తమిళ్ లో దిల్ (తెలుగు లో శ్రీరాం), ధూల్ (తెలుగులో వీడే), ఒక్కడుని రీమేక్ చేసి గిల్లీ తీసాడు. అన్నీ సూపర్ హిట్లే. ఆయన పవన్ తో బంగారం అనే సినిమా తీసాడు. అందులో పవన్ కి హీరోయిన్ ఉండదు. మీరా చోప్రా ఉన్నా ఆమె వేరే అతన్ని లవ్ చేస్తుంది, పెళ్ళి చేసుకుంటుంది. పవన్ లాంటి మాస్ హీరోకి ఇలాంటి సబ్జెక్ట్ సూటవదని ఆయనకి తట్టలేదు.ఇలాంటి సబ్జెక్ట్ ఆయన తమిళ్ స్టార్స్ కి చెప్పలేకపోయాడు. అలాగే తమిళ్ లో బిల్లా తీసిన విష్ణు వర్ధన్ పవన్ తో పంజా తీసాడు. ఇదీ అంతే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ వరకూ ఆయనకి పవన్ ఎంత పెద్ద స్టారో తెలీలేదట. ఆయనే చెప్పాడు. ఆడియో ఫంక్షన్ లో అంతమంది ఫ్యాన్స్ ని చూసి ఈ విషయం ముందే చెప్పిఉంటే బాగుండేదే అన్నాడు. అయితే పవన్ మాత్రం అలా తెలీకపోతేనే మీరు కథకి న్యాయం చేస్తారని చెప్పలేదు అని సమాధానమిచ్చాడు. కానీ ఆ సినిమా బొక్కబోర్లా పడింది. తెలుగు హీరోల ఇమేజ్ ని క్యాచ్ చేయకుండా ఇలాంటి సినిమాలు తీయడం వల్ల అవి కాస్తా డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. ఉదాహరణకి స్పైడర్ లాంటి సినిమా ని మహేష్ తో కాకుండా రంగం సినిమా తీసిన జీవా లాంటి వాళ్ళతో మీడియం బడ్జెట్ లో తీసిఉంటే బహుశా ఆడేదేమో.
ఇక ఇప్పుడు బాలకృష్ణ 102 వ సినిమా తీస్తున్న కె.ఎస్. రవికుమార్, బన్నీ తో తీయనున్న లింగు స్వామి అయినా ఈ లోపాన్ని అధిగమిస్తారా అనేది చూడాలి.