తెలంగాణలో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేశాయ్. దసరా నాడు 21 కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. పరిపాలన సౌలభ్యం, పారదర్శకత కోసం జిల్లాల పునర్విభజన జరిగింది. అయితే చిన్న జిల్లాలు ఏర్పడగానే అభివృద్ధి దానంతట అదే జరిగిపోదు. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రజలు సమిష్టిగా ముందడుగు వేయాలి.
దేశంలోని వివిధా రాష్ట్రాల్లో జిల్లాలను పెంచుకున్నవీ ఉన్నాయి. పెంచకుండా అలాగే ఉంచినవీ ఉన్నాయి. అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుజరాత్ కు గుర్తింపు ఉంది. ఆ రాష్ట్ర జనాభా 6 కోట్లు. అంటే తెలంగాణకంటే 2.5 కోట్లు ఎక్కువ. అక్కడ 33 జిల్లాలున్నాయి. అయినా దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రంగా ఖ్యాతి పొందింది. అది దేశంలోనే 24 గంటల విద్యుత్తు సరఫరా ప్రారంభించిన తొలి రాష్ట్రం. వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన తొలి రాష్ట్రం. ఇంకా చాలా రంగాల్లో గుజరాత్ తిరుగులేని అభివృద్ధిని సాధించింది.
ఉమ్మడి ఏపీ కంటే చాలా పెద్దదైన మహారాష్ట్ర జనాభా 11.2 కోట్లు. ఆ రాష్ట్రంలో 36 జిల్లాలున్నాయి. కొన్ని విషయాల్లో ఆ రాష్ట్రం ఉమ్మడి ఏపీ కంటే ముందుంది. పారిశ్రామిక, విద్యుత్తు, మరికొన్ని రంగాల్లో మెరుగ్గా ఉంది. ఇది సానుకూలాంశం. రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉంది. అది వ్యతిరేకాంశం.
జనాభాపరంగా అతిపెద్దదైన యూపీలో 75 జిల్లాలున్నాయి. చాలా విషయాల్లో ఆ రాష్ట్రంవెనబడిపోయింది. పారిశ్రామిక, వ్యవసాయ, తదితర రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. అదే సమయంలో 10 కోట్ల జనాభా గల బీహార్ లో 38 జిల్లాలున్నాయి. ఒకప్పుడు అది బిమారూ రాష్ట్రాల్లో ఒకటి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాల సంఖ్య మారలేదు గానీ రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఒక దశలో అత్యధిక వృద్ధిరేటు సాధించే రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందింది. ఇప్పటికీ అనేక సమస్యలున్నా, నితీష్ ప్రభుత్వ పనితీరు వల్ల బీహార్ గణనీయంగా మెరుగుపడింది.
ఇలాంటి రాష్ట్రాలను గమనించినప్పుడు జిల్లాల సంఖ్య కంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి అన్నింటికంటే ముఖ్యమని అర్థమవుతుంది. ప్రభుత్వం సరిగా, అవినీతి రహితంగా పనిచేసినప్పుడు పెద్ద జిల్లాలున్నా బాగుపడతాయి. ప్రభుత్వం సరిగా లేనప్పుడు, అవినీతి విలయ తాండవం చేసినప్పుడు లక్ష జనాభాకు ఒక జిల్లా అయినా ఫలితం ఉండదు. కేసీఆర్ ప్రభుత్వం చెప్తున్న అవినీతి రహిత, పారదర్శక పాలన అనేది చేతల్లోనూ కనిపించాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో పాటు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవి ఎంత చిత్తశుద్ధితో జరుగుతాయనే దాన్ని బట్టే బంగారు తెలంగాణ కల సాకారం కావడం కాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది.