కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టగానే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఓ గగ్గోలు ప్రారంభమవుతుంది. మా రాష్ట్రం పేరు కూడా ప్రస్తావించలేదని చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని అంటూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అయితే.. అద్భుతంగా ఉందని పొగిడేస్తూ ఉంటాయి. కానీ బడ్జెట్ ను రాజకీయం చేయడం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉంటాయో లేదో కానీ.. ఇదంతా పాత కాలం రాజకీయంగా మారిపోతోంది.
కేంద్రం అంటే రాష్ట్రాలే.. రాష్ట్రాల్లో చేసే ఖర్చే కేంద్ర బడ్జెట్ !
కేంద్ర ప్రభుత్వం పరిపాలించేది అన్ని రాష్ట్రాలను. కేంద్రానికి ప్రత్యేకమైన భూభాగం లేదు. కేంద్రం బడ్జెట్ పెట్టినా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్రాల్లోనే రాష్ట్రాల ప్రజలకే ఖర్చు పెట్టాలి. వేరే ఎక్కడా ఖర్చు పెట్టడానికి చాన్స్ లేదు. కేంద్రం తన ఆదాయాన్ని ఎక్కెడెక్కడ ఖర్చు పెట్టాలన్నది డిసైడ్ చేస్తుంది. ఓ సమాఖ్య ప్రభుత్వం డబ్బులన్నీ ఓ చోట కుప్ప పోసినట్లుగా కేటాయింపులు చేయడం అసాధ్యం.
నిధుల వినియోగంపై రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు
కేంద్రానికి వచ్చే ఆదాయం మొత్తం కేంద్రం ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేసుకుంటుందని అనుకుంటారు. అది నిజం కాదు. ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. ఆ ప్రకారమే పంపణీ చేస్తారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి ఓ రాష్ట్రానికి నిధులు ఆపే అవకాశం లేదు. అదే సమయంలో ఒకే రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసే చాన్స్ కూడా లేదు. అందుకే రాజ్యాంగం ప్రకారం రావాల్సిన అన్ని నిధులు రాష్ట్రాలకు వస్తాయి. అయితే అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రాజకీయ పార్టీలు విమర్శిస్తూంటాయ. కానీ ఈ అదనం అనే మాట మాత్రం చెప్పవు.
కేంద్ర ప్రాజెక్టులు అన్ని రాష్ట్రాలకూ కేటాయింపు !
ప్రత్యేకంగా ఓ రాష్ట్రంపై వివక్ష చూపిస్తే మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో రాజకీయవర్గాలకు తెలుసు. అందుకే కేంద్రం ప్రాజెక్టుల కేటాయింపులో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. తెలంగాణకూ పలు ప్రాజెక్టులు కేటాయించింది. జాతీయ రహదారులు నిర్మించింది. ఏపీకి కొంత ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఉన్నా.. అప్పనంగా ఏమీ చేయడంలేదని అందరికీ తెలిసిన విషయం. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు కొన్ని ప్రాజెక్టులు ప్రకటించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మొత్తంగా కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రాలకు వచ్చేది.. రాజ్యాంగబద్దంగా వచ్చేవి తప్ప.. ఇంకేదో వస్తాయని ఆశలు పెట్టుకోవడం వృధానే.. కానీ రాజకీయంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీపై ఎటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.