ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారైపోయాయి. అయితే, తెలంగాణలో జరగబోతున్న ఎన్నికలు తెరాస వెర్సెస్ కాంగ్రెస్ తో కలుస్తున్న కొన్ని పార్టీల కూటమి అనేది సుస్పష్టం. కానీ, దేశం దృష్టంతా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై ఉన్నాయి. ఇవి భాజపా పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. గతంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భాజపాదే గెలుపు అంటూ చెప్పుకొచ్చిన రాష్ట్రాలన్నిటా జరిగింది… కాంగ్రెస్ నుంచి భాజపాకి జరిగిన అధికార మార్పు! కానీ, ఇప్పుడీ మూడు రాష్ట్రాల్లో భాజపా మరోసారి పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి. పరువు కూడా నిలుపుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటే, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను లోక్ సభకు సెమీ ఫైనల్స్ గా చెప్పుకోవచ్చు.
ఇక, కేంద్రంలోని మోడీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఆ మధ్య కర్ణాటకలో ప్రముఖ పార్టీల నేతలందరూ చేతులు కలుపుతూ కనిపించారు. అయితే, ఇప్పుడీ రాష్ట్రాల ఎన్నికలకు వచ్చేసరికి… ప్రముఖ పార్టీలు ఒక్కోటిగా కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లే అవకాశం లేదన్నట్టుగా మాయవతి అన్నారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్నట్టుగానే ప్రకటనలు చేస్తున్నారు. బెంగాల్ నుంచి మమతా బెనర్జీ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. తాజా ఎన్నికల షెడ్యూల్ తరువాత ఈ పార్టీల మధ్య చర్చలు జరిగి, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు జరుగుతాయేమో చూడాలి.
కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు వచ్చేసరికి కొంత ధీమాగానే ఉంది. సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలు విడిగా పోటీకి దిగితే… వ్యతిరేక ఓటు చీలిపోయి, భాజపాకి కొంత మేలు జరుగుతుందనే విశ్లేషణలూ లేకపోలేదు. ఈ పార్టీలు యూపీలో పట్టున్నంతగా ఈ రాష్ట్రాల్లో లేవనేది కాంగ్రెస్ లెక్క! కానీ, మధ్యప్రదేశ్ లో బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే, వీటన్నింటికీ మించిన స్థాయిలో మోడీ వ్యతిరేకత తీవ్రంగా ఉందనీ, ప్రత్నామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే అభిప్రాయమూ ప్రజల్లో బలంగా ఉందనీ, కాంగ్రెస్ బలం కంటే… మోడీపై వ్యతిరేకతే ఆ పార్టీకి కలిసొస్తుందనేది వారి అంచనా అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఇతర పార్టీలు కలిసొస్తే ఓకే, లేకుంటే ఒంటరిగా బరిలోకి దిగడానికి కాంగ్రెస్ ఏమాత్రం సంశయించడం లేదంటున్నారు. అయితే, సెమీ ఫైనల్స్ అనుకుంటున్న ఈ ఎన్నికల్లో కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్న సమాజ్ వాదీ, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలను బుజ్జగించి తీసుకుని రావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు మాత్రమే పడుతుంది అనుకునే కంటే… ఆ అవకాశాలను ఎందుకు ఇవ్వడం అనే ధోరణితో కాంగ్రెస్ వ్యూహం ఉండాలి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో వ్యూహం మారుతుందేమో చూడాలి.