భారతీయుల్లో చాలా మంది మధ్యతరగతి ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయంటే.. పిల్లల్ని కని.. బాగా చదివించి.. ఎంత ఖర్చు అయినా అమెరికా పంపించాలి అన్నట్లుగా ఉంటాయి. అదేదో కాంప్లెక్స్ అయినట్లుగా అక్కడికిపోతే స్వర్గంలోకి పోయినట్లేనని డాలర్లే డాలర్లని అనుకుంటారు. అమెరికా కోసమే పిల్లల్ని కన్నామన్నట్లుగా వ్యవహరిస్తూంటారు. అది కొంత కాలం వరకూ నిజమేనేమో కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అమెరికన్లే అమెరికా కోసం పిల్లలు కనే పరిస్థితి లేదు. ఇక ఇండియన్లకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా గతంలోలా స్వర్గంలా లేదు. నరకంలా మారుతోంది.
చదువు పేరుతో లక్ష కోట్లకుపైగా అమెరికాకు ధారాదత్తం
మన దేశం నుంచి చదువు పేరుతో అమెరికాకు వెళ్లేవారిలో 95 శాతం నిజంగా చదువుకోవడానికి కాదు. రెండేళ్లు చదువు పేరుతో టైం పాస్ చేస్తే హెచ్ వన్ బీ వీసా తెచ్చుకుని ఉద్యోగంలో సెటిలైపోవచ్చని అనుకుంటారు. అందు కోసం ఇండియా నుంచి వెళ్తున్న వారు అమెరికాకు లక్ష కోట్ల ఆదాయం ఇస్తున్నారు. ఫీజుల రూపంలో అక్కడ ఖర్చుల రూపంలో ధారబోస్తున్నారు. అంతేనా పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చీప్ లేబర్లుగా మారుతున్నారు.
చదువు అయిపోతున్న సగం మందికి ఉద్యోగాలు రావడం లేదు !
ఇప్పుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్న వారిలో చదువు అయిపోయేనాటికి సగం మందికి ఉద్యోగాలు రావడం లేదు. అతి కొద్ది మంది మాత్రమే హెచ్వన్ బీ వీసా లాటరీ తగులుతోంది. ఏదో విధంగా జాబ్ తెచ్చుకుని సర్వైవ్ అయిపోయే వారు తక్కువ మంది ఉన్నారు. చదువు పేరుతో అక్కడే తచ్చాడుతూ ఏదో ఓ ఉద్యోగం చూసుకునేవారు ఎక్కువైపోయారు. అలాంటి వారు అమెరికాలో ఉండి జీవితాన్ని సాగదీయడం తప్ప కొత్తగా చేసేదేమీ ఉండదు.
ఇండియాలోనే మంచి అవకాశాలు
రూ. కోటి పెట్టి అమెరికాకు వెళ్లి.. రెండు, మూడేళ్లు సమయం వృధా చేసుకుని ఉద్యోగం వస్తుందో రాదో అని టెన్షన్స్ పడటం కన్నా.. బీటెక్ మంచికాలేజీలో చదివితే వచ్చే క్యాంపస్ ఉద్యోగమే చాలా బెటర్. ఆ మూడేళ్లు పూర్తి సమయం కెరీర్ మీద .. ఉద్యోగం మీద దృష్టి సారించి ప్రయత్నాలు చేస్తే.. కీలక స్థానానికి వెళ్లిపోవచ్చు. స్కిల్స్ చూపిస్తే ఐటీ రంగంలో ఎంత వేగంగా ఎదగవచ్చో ఇప్పటికే అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. అందుకే ఇక నుంచి అమెరికా అనే టార్గెట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అమెరికా చేరుకోలేనంతటి దూరంలోలేదు. చేరుకున్నా.. ఉపయోగపడని రేంజ్‌కు దిగజారింది.