ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తరువాత తెలుగు రాష్ట్రాలకు వచ్చారు వెంకయ్య నాయుడు. తెలంగాణలో ఆయనకి ఘన సత్కారం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రాకి రాగానే భారీ ఎత్తున స్వాగత సత్కారాలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఒక తెలుగు నాయకుడికి ఉన్నతమైన రాజ్యాంగ పదవి లభించినందుకు సగటు తెలుగువాడు గర్వపడే సందర్భం ఇది, ఆనందంతో ఉప్పొంగే అవకాశం ఇది! కానీ, ఆ సంతోషాన్ని వెంకయ్య నాయుడు లేకుండా చేస్తున్నారా అనేదే ప్రశ్న..? ఎందుకంటే, ఉప రాష్ట్రపతి అయ్యాక ఎక్కడ మాట్లాడినా… రాజకీయాలకు దూరమైపోయానే అనే అసంతృప్త స్వరాన్నే వెంకయ్య నాయుడు ఎక్కువగా వినిపిస్తున్నారు.
అమరావతిలోని స్వర్ణభారతి ట్రస్ట్ భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి పదవి ఎలా ఉందని ప్రశ్నిస్తే… అరెస్టు చేసినట్టుగా ఉందని చమత్కరించారు. రాజ్యాంగబద్ధ పదవి కదా… ఇందులోని నిబంధనలు అర్థం చేసుకుని, కుదురుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు. మొన్నటికి మొన్న వెలగపూడిలో జరిగిన పౌర సన్మానంలో కూడా ఇలానే మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవి చేపట్టాక పార్టీ కార్యకలాపాలకు దూరమౌతున్నాననే బాధగా ఉందని అన్నారు. అంతకుముందు, హైదరాబాద్ లో కేసీఆర్ సన్మానించినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. ఇవే కాదు… ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను నామినేట్ చేసిన దగ్గర నుంచీ ఇదే అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇకపై క్రియాశీలంగా ఉండలేననీ, నిబంధనల మధ్య ఇరుక్కుంటాననీ, చట్రంలోనే ఉండాల్సి వస్తుందనీ ఇదే ధోరణి.
నిజమే… కొన్ని దశాబ్దాలపాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న నాయకుడికి ఇది కచ్చితంగా మార్పే. ఆ మార్పును స్వాగతించాలి. అంతేగానీ.. దాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆ అవస్థని బయటపెట్టేస్తుంటే ఎలా..? ఈ క్రమంలో ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తి రానురానూ ఎలా వినిపిస్తోందంటే… ఉపరాష్ట్రపతి పదవి అంటే అంత ప్రాధాన్యత లేదినా అనీ, కట్టిపడేసినట్టు ఒకచోటే కూర్చుని ఉండటమే ఆ పదవిలో ఉన్నవారి పనా అన్నట్టుగా ఉంది! ఇలాంటి పదవిలోకి వెంకయ్య వెళ్తున్నారా అనేట్టుగా ఉంటోంది. ప్రతీ సందర్భంలోనూ ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తి వెనక ఇలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నట్టు వెంకయ్య గుర్తించటం లేదా అనేది కొంతమంది అభిప్రాయం! ఒక ఉన్నతమైన పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, దాని ఉన్నతి గురించే మాట్లాడితే బాగుంటుంది. ఆ పదవీ బాధ్యతకు లోబడి, ఆ స్థానానికి వన్నె తెచ్చే విధంగా ఏం చేయబోతున్నారో చెబితే బాగుంటుంది. అంతేగానీ… దేనికో దూరమైనట్టు, ఇంకేదో సమస్యల్లో ఇరుక్కుపోతున్నట్టు మాట్లాడితే ఎలా…? తన మనసులోని మాటల్ని చెప్పుకోవడానికి ఇకపై సందర్భం దొరకదూ దొరకదూ అంటూనే అన్ని సందర్భాల్లోనూ ఇదే తరహాలో మాట్లాడుతున్నారు.