హైందవశంఖారావం పేరుతో విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ సభను నిర్వహించింది. అది హైదంవ విలువలను బోధించడానికి పెట్టారో.. ఆ పేరుతో రాజకీయం చేసి ఆలయాలపై పెత్తనం పొందాలనే దురాశతో చేశారో కానీ మాట్లాడిన వాళ్లందరిదీ అదే తీరు. కాషాయం ధరించిన తర్వాత అన్నీ వదిలేస్తారు. కానీ అక్కడ కాషాయం ధరించిన ప్రతి ఒక్కరూ స్వార్థపూరిత ప్రసంగాలే చేశారు. తమకు ఏదో ఆశలుఉన్నాయని కూడా బయట పెట్టుకున్నారు. ఇంతకీ వీహెచ్పీలో అన్నవాళ్లే హిందువులా..?. ఇతరులు కాదా ?
ఆలయాలపై పెత్తనం ఎవరికివ్వాలి ?
ఆలయాలపై పెత్తనం ప్రభుత్వాలకు ఉండకూడదని.. హైందవులకే ఇవ్వాలని ఈ సభలో స్వామిజీలు ప్రధాన డిమాండ్ వినిపించారు. హైందవులంటే వీహెచ్పీ వాళ్లేనని.. మఠాలు, ఆశ్రమాల పేరుతో స్వామిజీలుగా మారిన వారేనని వారు చెబుతున్నారు. అంటే తమకే ఆలయాల బాధ్యత ఇవ్వాలంటున్నారు. అసలు వారికి ఉన్న అధికారిక అర్హత ఏమిటి?.వారిని ఏమైనా ప్రజలు తమ అధికారిక హైందవప్రతినిధులుగా ప్రజలు గుర్తించారా?. లేకపోతే వారు ఏమైనా హిందూత్వానికి.. దేవుళ్లకు ఏమైనా చేయలేనంత సేవచేశారా ?. ఏమీ చేయలేదు…కాషాయం ధరించి కాషాయం ధరించి తమను తాము హైందవ ఉద్దారకులుగా చెప్పుకుంటున్నారు.
దేవుడి దగ్గర వీఐపీ ఏంటి అంటున్న చినజీయర్ – మరి స్వామీజీలు కోరుతున్నదేంటి?
హైందవ శంఖారావసభలో పాల్గొన్న వారంతా.. తమకు గతంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో.. తమ ఈగోకు ఎక్కడెక్కడ దెబ్బతగిలిందో గుర్తుంచుకుని అదంతా హైందవానికి జరుగుతున్న పెద్ద అవమానంగా చెప్పుకొచ్చారు. అంతలో చినజీయర్ ఒకరు. ఆయనకు గతంలో తిరుమలలో వీఐపీ ట్రీట్ మెంట్ లభించలేదని .. తన మాటల్ని వినలేదని చెప్పి అసలు స్వామి వారి దర్శనానికే వెళ్లనని ప్రతిజ్ఞ చేసిన స్వామిజీ అయన. అలాంటిఆయన.. తిరుమల సన్నిధిలో వీఐపీ సంస్కృతి ఏమిటి అని ప్రశ్నించారు. దేవుడి దగ్గర వీఐపీ తనం చూపించాలనుకుంటే దేవుడు హర్షించడు. మరి అదే స్వామిజీలు కోరుకుంటున్నారు కదా. చినజీయర్ ఆలయంలోకి సామాన్య భక్తుడిలాగా వెళ్లగలరా ? ఇతర స్వామీజీలు వెళతారా ?. ఎలాంటి అధికార హోదాపేకపోయినా స్వాములన్న కారణంగా హై లెవల్ మర్యాదలు చేయకపోతే బయటకు వచ్చి ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తారు. చెప్పడానికే నీతులు ఉన్నాయన్నట్లుగా వ్యవహరిస్తారు. అంత ఎందుకు చినజీయర్ గారి ఆధ్వర్యంలోని సమతా కేంద్రంలో సామాన్యులకు.. వీఐపీలకు ఒకే ట్రీట్ మెంట్ ఉంటుందా ?
హైందవం ప్రజలందరూ కాపాడుకోవాలి – ఈ సమూహం కాదు !
హైందవాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి సభలు పెట్టి ఆలయాలపై పెత్తనం మాకే ఇవ్వాలని బలప్రదర్శన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. నిష్కల్మషంగా ధర్మప్రచారం చేయాలి. అసలైన. హైందవాన్ని తమలో చూపించాలి. కానీ హైందవ శంఖారావంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమకు వ్యక్తిగతంగా జరిగిన వ్యవహారాల్ని హైందవంపై జరుగుతున్న దాడిగా పేర్కొని.. హిందువుల్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాటిని హైందవాన్ని ఆచరించే ఏ ఒక్కరూ విశ్వసించరు.