ప్రత్యేక హౌదా తదితర అంశాలపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తెలుగుదేశం నాయకత్వం కేంద్రంతో నెమ్మదిగా సర్దుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదట్లో తీవ్రంగా మాట్లాడని వారిపై ఆగ్రహం చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దూకుడు వద్దని చెబుతున్నారట. విశాఖ భాగస్వామ్య సదస్సుకు ముందే ముఖేశ్ అంబానీతో ములాఖత్ దీనికి కారణమై వుండొచ్చని అంటున్నారు. ఆ పర్యటన సమయంలోనే తాను భారీ పెట్టుబడులకు సిద్దంగా వున్నానన్న అంబానీ అప్పుడే దానిపై ఒప్పందాలు సంతకాలు మొదలెట్టారు. ప్రధాని మోడీకి సన్నిహితుడైన అదానికి ఇదివరకే భావనపాడు రేవు అప్పగించడం పూర్తయింది. కేంద్రం నేరుగా చేయకపోయినా కార్పొరేట్ ఇండియా ద్వారా పెట్టుబడులు వచ్చేలా చేస్తామన్నది బిజెపి ఆఫర్‌గా వుంది. విశాఖ సదస్సుకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకూడా తాను మాట్లాడతానని తొందరపడి సంబంధాలు చెడగొట్టుకోవద్దని సలహాలు ఇచ్చి వెళ్లారు.ఈ పరిస్థితుల్లో బడ్జెట్ సమాధానంలో ఏవైనా సవరణలు సహాయాలు ప్రకటిస్తారేమో చూడాలని టిడిపి నిర్ణయించుకుందంటున్నారు. వైసీపీ కూడా బిజెపి మెప్పు కోసం మల్లగుల్లాలు పడుతుంది గనక మనకు వచ్చిన ముప్పు లేదని ఆ పార్టీ నేతలు నిర్థారించుకున్నారు. మారిషస్ కేసు తర్వాత జగన్‌పట్ల మోడీ ధోరణి మారిందనేది వీరి వాదనగా వుంది.దీనిపై అనుకూల మీడియాలో కథనాలు కూడా రావడంతో సాక్షి ప్రత్యేకంగా సమాధానాలు ఇచ్చే పనిలోపడింది.