ప్రపంచకప్ జట్టుని ప్రకటించేశారు. జట్టు విషయంలో సెలెక్టర్లు పెద్దగా ప్రయోగాలేం చేయలేదు. కాకపోతే… రాయుడుని కాదని రాహుల్‌ని ఎంచుకోవడం వెనుక ఉన్న అంతర్యమే అంతుపట్టడం లేదు. గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు రాయుడు. గణాంకాలే ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మొత్తం 55 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన రాయుడు 1694 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 47కి పైమాటే. జట్టు ఆపదలో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు.
2019లో రాయుడు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మాట వాస్తవం. 10 మ్యాచులలో కేవలం 247 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ లో కూడా తన ఆట తీరు అంతంత మాత్రంగానే ఉంది. అలాగని రాహుల్ కెరీర్ రికార్డు రాయుడు కంటే అద్భుతంగా ఏమీ లేదు. 14 మ్యాచ్‌లలో 343 పరుగులు చేశాడంతే. సగటు 34 మాత్రమే. ఇంతకు ముందు రాహుల్ ని కేవలం టెస్ట్ మ్యాచ్ ప్లేయర్‌గా మాత్రమే చూసేవారు. ఐపీఎల్ వల్ల తన ఆటతీరులో మార్పు వచ్చింది. టీ 20 క్రికెటర్‌గా ఎదిగాడు. వన్డేలలో కంటే టీ20లలో తన రికార్డు మెరుగ్గా ఉంది. 27 మ్యాచ్‌లలో 879 పరుగులు సాధించాడు. సగటు 43.95. ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించినవాళ్ల జాబితాలో రాహుల్‌కి కూడా చోటు ఉంది. ఓ సెంచరీ కూడా కొట్టాడు. దాంతో తాజా ఫామ్‌ని బట్టి… రాహుల్‌ని ఎంచుకోవాల్సివచ్చింది. జట్టుకి అత్యవసరం అనుకున్నప్పుడు రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టగలడు. అందుకే రాహుల్‌కి స్థానం దక్కిందేమో.