“అయ్యకు రెండు గుణాలే తక్కువ – తనకు తోచదు, చెబితే వినడు” అని సామెత. ఎవరి సలహాలు వినిపించుకోని… అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుని.. అవేమీ అమలుకు నోచుకోక అందర్నీ ఇబ్బంది పెడుతూ.. ఆయోమయం సృష్టించేవారిని ఇలా అంటారు. ఆంధ్రప్రదేశ్ పాలనా పరిస్థితుల్ని చూసి.. ఈ సామెత గుర్తుకొస్తే అది మన తప్పు కాదు. ఎందుకంటే.. ఏపీలో ఇప్పుడు అలాగే ఉంది. పది నెలల కాలంలో ప్రభుత్వం పాలనా పరంగా అమలు చేసిన ఒక్కటంటే..ఒక్క నిర్ణయం లేదు. ప్రతీ నిర్ణయం కోర్టులో ఆగిపోతోంది. అక్షింతలు పడుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మొత్తం అయోమయంలో పడిపోతోంది. కానీ.. చక్కదిద్దుకునే ప్రయత్నాలు జరగడం లేదు.
ప్రతీ నిర్ణయం అమలలో అయోమయమే..!
డీజీపీ హైకోర్టు ఎదుట చేతులు కట్టుకుని నిలబడతారు..! ప్రాథమిక విధి అయిన రూల్ ఆఫ్ లాను అమలును ఇక నుంచి అమలు చేస్తామని హామీ ఇస్తారు..!
చీఫ్ సెక్రటరీ తోటి ఆఫీసర్ల విషయంలో కుట్ర చేసినట్లు క్యాట్ నుంచి హెచ్చరికలు అందుకుంటారు..!
చీఫ్ సెక్రటరీకి తెలియకుండా సంతకాలు లేకుండా జీవోలు వచ్చేస్తూంటాయి..!
రంగుల నుంచి ఇంగ్లిష్ మీడియం వరకూ.. రాజధాని నుంచి అసైన్డ్ ల్యాండ్స్ లాక్కోవడం వరకు.. 40 సార్లకుపైగానే కోర్టులు ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నించాయి..!
అయినా కోర్టు నిర్ణయాల్ని ధిక్కరించి మరీ కొన్ని పనులు చేసేస్తూంటారు..!
విధానపరంగా తీసుకున్న ఒక్క నిర్ణయాన్నీ అమలు చేయలేకపోయారు..!
ఇలా చెప్పుకుంటూ.. పోతే.. ఏ ఒక్క నిర్ణయాన్నీ… ఇతమిత్థంగా అమలు చేసేలా నిర్ణయాలు తీసుకోలేదు. మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా వెళ్లిపోవడమే తెలుసని.. రాజ్యాంగాలు.. చట్టాలు.. నియమాలు.. నిబంధనలతో పని లేదని.. పాలక పెద్దలు భావిస్తున్నారు. ఫలితంగా.. పాలనలో అయోమయం ఏర్పడింది. ఆ అయోమయం.. అంతకంతకూ పెరుగుతోంది. తీసుకుంటున్న నిర్ణయాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం పాలకులు కూడా చేయడం లేదు.
రాజ్యాంగానికి.. చట్టానికి లోబడే “మార్కింగ్” పాలన ఉండాలి..!
ప్రభుత్వం తనదైన మార్క్ పాలన చేయడానికి అనేక చర్యలు తీసుకుంది. కానీ మెజార్టీ అంశాల్లో .. నిబంధనలకు కూడా పాటించకపోవడంతో.. అవన్నీ.. గాల్లోనే ఉండిపోయాయి. పాలనలో తెంపరి తనానికి.. మొట్టమొదటి సాక్ష్యం.. దిశ చట్టం. ఈ చట్టానికి ఇంత వరకూ రాష్ట్రపతి ఆమోద ముద్రపడలేదు. అంటే అమల్లో లేనట్లే. కానీ ప్రభుత్వం మాత్రం… అమలు చేసేస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తోంది. ఆ చట్టంలో రాజ్యాంగాన్ని సవరించాల్సిన అంశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఆ చట్టం.. ఆమోదం పొందడం అసాధ్యం. ఒక్క దిశ చట్టం విషయంలోనే కాదు.. ఇంగ్లిష్ మీడియం విషయంలోనూ అదే పరిస్థితి. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. నిర్బంధ ఇంగ్లిష్ మీడియం చట్టం తెచ్చారు. అదీ త్రిశంకు స్వర్గంలోనే ఉంది. విప్లవాత్మక చట్టాలు అని చెప్పుకుంటున్న వాటిని … నిబంధనలకు విరుద్ధంగా.. రాజ్యాంగ వ్యతిరేకంగా చేయడంతోనే సమస్య వచ్చింది. దాన్ని గుర్తించడానికి సిద్ధపడటం లేదు. ఫలితంగా తీసుకున్న ప్రతీ నిర్ణయం కోర్టు దగ్గరకు పోవాల్సిందే. కోర్టు నిబంధనలు గుర్తు చేసి… అక్షింతలు వేయాల్సిందే.
హైకోర్టులో ఇన్ని ఎదురుదెబ్బలు తిన్న ప్రభుత్వం ఉందా..?
హైకోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ..ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలైన పిటిషన్లపైనే విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. రాజ్యాంగ, చట్ట వ్యతిరేక నిర్ణయాలన్నింటిపై కోర్టులో కేసులు పడ్డాయి. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలనే విషయం దగ్గర్నుంచి రాజధానిలో భూములును.. ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడం వరకూ.. ప్రభుత్వంపై.. వివిధ వర్గాలు వేసిన పిటిషన్లు పెద్ద సంఖ్యలో విచారణలో ఉన్నాయి. ఇక పీపీఏలు, పోలవరం..వంటి అంశాల్లో ప్రైవేటు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లు అదనం. ఇప్పటికి 40కిపైగా అంశాల్లో కోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. నిర్ణయాలను కొట్టి వేసింది. జీవోలను రద్దు చేసింది. ఇంకా పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సమర్థించుకోవడానికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టులో ఎలా వాదించుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు.
తప్పులు చేస్తున్నట్లు కోర్టు ముందు నిలబడుతున్న ఉన్నతాధికారులు..!
పరిపాలన అయినా సక్రమంగా జరుగుతోందా అంటే.. బాసులే.. రాజ్యాంగ వ్యవస్థల ముందు.. తప్పు చేసినట్లుగా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. పోలీసు వ్యవస్థ పనితీరుపై కొద్ది రోజులుగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు సైన్యం మాదిరిగా అధికార పార్టీ రాజకీయ టార్గెట్లను… వారు అపహరిస్తున్నారని.. ఆరోపణలు వస్తున్నాయి. జ్యూడిషియల్ విచారణలలోనూ ఇలాంటిదేదో ఉందని తేలడంతో హైకోర్టు గతంలో… ఓ సారి డీజీపీని హైకోర్టుకు పిలిపించి హెచ్చరించింది. మరోసారి ఏకంగా పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఓ ఎస్పీ స్థాయి అధికారిపై సీబీఐ విచారణ జరుగుతోంది. చంద్రబాబు విశాఖ పర్యటనలో అడ్డుకోవడానికి వచ్చిన గుంపును చెదరకొట్టకుండా పోలీసులు .. చంద్రబాబునే అరెస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది. సీఆర్పీసీ 151 కింద చంద్రబాబును అరెస్ట్ చేసినట్లుగా చెప్పడంతో.. హైకోర్టు డీజీపీని మరోసారి రావాలని ఆదేశించింది. ఆయన హైకోర్టు ఎదుట తప్పు చేసినట్లుగా ఒప్పుకోవాల్సి వచ్చింది. హైకోర్టు ముందు…తప్పు చేసినట్లుగా నిలబడేది.. వ్యక్తిగతంగా డీజీపీ కాదు… పోలీసు వ్యవస్థనే. పోలీసు వ్యవస్థ పరిస్థితి మాత్రమే కాదు.. అధికార యంత్రాంగం పరిస్థితి కూడా అంతే ఉంది. సీఎస్ .. సంతకం లేకుండానే జీవోలు బయటకు వస్తున్నాయి. చట్ట విరుద్ధంగా.. సాటి అధికారులపై సీఎస్ తీసుకుంటున్న చర్యలను క్యాట్ తప్పు పట్టింది. జాస్తి కృష్ణకిషోర్ అనే ఐఆర్ఎస్ అధికారి విషయంలో సీఎస్‌ను.. క్యాట్ తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది. ఇది వ్యవస్థల్ని నడిపించాల్సిన ఉన్నతాధికారుల దుస్థితే. కింది స్థాయి పరిశీలనకు వెళ్తే.. అందరూ నోళ్లు నొక్కుకోవాల్సి ఉంటుంది.
పరీక్షలు..ఎన్నికలు..బడ్జెట్.. అన్నీ ఒకే సారా..? ఆ మాత్రం ప్రణాళిక ఉండదా..?
రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన పనులనైనా ప్రభుత్వం సక్రంగా చేస్తుందా అంటే అదీ లేదు. స్థానిక ఎన్నికలను ఈ నెల 31లోపు పూర్తి చేయకపోతే… 5వేల కోట్ల నిధులు రాకుండా పోతాయి. ఇది ఆర్థిక శాఖలోని కింది స్థాయి అధికారి వరకూ తెలుసు. కానీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రిజర్వేషన్లు ఖరారు చేసి..కోర్టు కేసులు పడేలా చేసి.. చోద్యం చూసింది. ఫలితంగా పీకల మీదకు వచ్చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తోంది. దీని కోసం టెన్త్ పరీక్షలు వాయిదా వేశారు. అదే సమయంలో..మార్చి 31వ తేదీలోపు బడ్జెట్ ఆమోదించకపోతే.. రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. 31నే బడ్జెట్ పెడతామని ప్రభుత్వం చెబుతోంది. ముందు చూపు లేకుండా.. రెండు వారాల కిందట.. అసెంబ్లీ ఉభయసభల్ని ప్రోరోగ్ చేశారు. ఇప్పుడు.. అసెంబ్లీని సమావేశపర్చాలంటే.. పధ్నాలుగు రోజుల ముందుగా నోటిఫికేషన్ ఇవ్వాలి. మళ్లి గవర్నర్‌తో నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇప్పటి వరకూ.. అలాంటి ప్రయత్నమే జరగలేదు. అన్నీ పికల మీదకు వచ్చేశాయి. ప్రతీ దానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది.
సూపర్ సీఎంల పాలన కాబట్టే ఇంత రచ్చ..!?
ఓ వైపు ఆర్థిక నిర్వహణ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఏడాదిలో అరవై వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వంగా రికార్డులకెక్కబోతోంది. ఆ అరవై వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఏపీ జీడీపీ .. ప్రజల ఆదాయం పెరిగేలా.. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా అంటే.. అప్పటికి ఫుల్ స్వింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల్ని కూడా నిలిపివేశారు. ప్రభుత్వంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో ఉన్నతాధికారులకే స్పష్టత లేదు. ఒక్కో విభాగానికి ఒక్కో సూపర్ సీఎం ఉన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. పోలీసు వ్యవస్థను ఒకరు.. ఆర్థిక వ్యవస్థను మరొకరు.. విశాఖను మరొకరు.. ఇలా పంచేసుకుని పనులు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలకు సాధికారతే ఉండటం లేదు. వందల సంఖ్యలో రహస్య జీవోలు విడుదలవుతున్నాయి. అంతకు మించి ఇచ్చిన జీవోలను రద్దు చేయకుండానే..దానికి వ్యతిరేక జీవోలు విడుదల చేస్తున్నారు. అసలు ఏది ఆదేశమో.. ఏది నిర్ణయమో అర్థం కాని పరిస్థితిలో ఏపీ పాలన పడిపోయింది. ప్రభుత్వంలో గందరగోళం.. ఆయోమయం నిర్ణయాల్లో మాత్రమే కాదు.. రాష్ట్ర ఆర్థికానికి పిల్లర్‌గా ఉండాల్సిన రాజధాని విషయంలోనూ ఉంది. ఇప్పుడు ఏపీ రాజధాని ఏది అంటే… మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులకు చెప్పినట్లుగా.. ఎల్లుండి చెబుతానని..కవర్ చేసుకోవాలి. ఆ ఎల్లుండి ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే.. ఏపీలో ఈ అయోమయం పాలనకు ఎప్పుడు అంతం ఉంటుందో..ఎవరూ అంచనా వేయలేరు.