అధికారంలో ఉన్నా .. లేకపోయినా వైసీపీ చేసేది రాజకీయం కాదు నేరాలే. అధికార పార్టీగా ఉన్నప్పుడు తమ నేరాలను పోలీసుల కంట పడినా బహిరంగంగా తప్పించుకున్న వారు ఇప్పుడు మాత్రం ఉక్కపోతకు గురవుతున్నారు. నేరాలు చేస్తూ అదే రాజకీయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి తీరుతో ఏపీ రాజకీయం కలుషితం అవుతుంది. తప్పుడు ప్రచారాలు, ఫేక్ దాడులు, ఫేక్ ఆరోపణలు, మత విద్వేషాలు, కుల రాజకీయాలు అన్నట్లుగా వారి రాజకీయం మారిపోతోంది. ఇలాంటి రాజకీయాలతో వారు ఎం బావుకుందామనుకుంటున్నారో కానీ.. రాష్ట్రానికి మాత్రం చేటు చేస్తున్నారు.
జగన్ రెడ్డి కోసమే వైసీపీ నేతల క్షుద్ర రాజకీయాలు !
జగన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆయనకు చంద్రబాబుతో పోటీగా సెక్యూరిటీ కావాలన్న కోరిక ఉంది. ఆయన గడాఫీ వారసుడిలా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే సీఎంగా ఉన్నప్పుడు తన కోసం వేల మందిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక భద్రతా వ్యవస్థను సృష్టించుకున్నారు. అది పోయాక ఆయనకు ఏదోలా ఉంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని లాగేసుకున్నారని ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. హోదా ఇవ్వాలని..చంద్రబాబుతో సమానంగా సెక్యూరిటీ ఇవ్వాలని కుట్రలు చేసుకుంటున్నారు. తనపై తాను కుట్రలు చేసుకుంటూ సెక్యూరిటీ లేదని తన పార్టీ నేతలతో చెప్పించుకుంటున్నారు.
ఇంకెంన్ని కోడికత్తి, గులకరాయి డ్రామాలు వస్తాయో ?
జగన్ రెడ్డి చేసేదంతా డ్రామాల రాజకీయం. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి దగ్గర నుంచి గులకరాయి వరకూ ఆయన చేసిన రాజకీయం చూస్తే అందరికీ ఒకటే క్లారిటీ వస్తుంది. ఇప్పటికీ దాన్నే ఆయన నమ్ముకుంటున్నారు. హెలిప్యాడ్ దగ్గరకు జనాల్ని తరలించి…గందరగోళం చేయించుకోవాల్సిన అవసరం ఏంటి?. నేరాల్లో పీహెచ్డీ చేసిన జగన్ క్రిమినల్ మైండ్ కు.. కుట్రలు చేయడం చాలా చిన్న పని. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతలపై చట్టాన్ని ప్రయోగించి చేశారు. ఇప్పుడు తనపై తాను చేసుకుంటున్నారు. కానీ ఎక్కడిక్కడ ప్రజలకు దొరికిపోవడం ఆయన స్టైల్. కానీ నమ్మే గుడ్డి గొర్రెలు ఉన్నాయని ఆయన నమ్మకం అందుకే ఈ రాజకీయం చేస్తున్నారు.
అభివృద్దిని అడ్డుకోవడానికి అడ్డగోలు పనులు !
ఐదు సంవత్సరాలు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్క పని కూడా చేయలేదు. మద్యం విధానం పేరుతో దోచుకోవడం.. అప్పులు తెచ్చి ప్రజలకు పదో పరకో పంపడమే పాలన అన్నట్లుగా సాగింది. ఇప్పుడు రాజధాని నిర్మాణంతో పాటు పరిశ్రమల్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. అమరావతికి నిధులు ఇవ్వకుండా.. ప్రపంచబ్యాంక్‌కు ఎన్ని లేఖలు రాశారో చెప్పాల్సిన పని లేదు. వివిధ స్వచ్చంద సంస్థల పేరుతో ఫిర్యాదులు చేశారు. పోలవరం నుంచి ప్రతి పనికి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీని వల్ల ఎవరికి నష్టం ?
ఫేక్ ప్రచారాలు, మత విద్వేషాలతో ఏం సాధిస్తారు ?
ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయింది. ఎక్కడా చిన్న అసంతృప్తి కూడా కనిపించకపోవడంతో ఎలా అని కంగారు పడుతున్నారో కానీ దేవుడి మీద పడ్డారు. ముందుకు తిరుమల శ్రీవారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ వ్యవహారాన్ని హత్య అని రుద్దే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పని చేయడం మానేసి.. ఇలాంటి తప్పుడు రాజకీయాలతో.. నేర పూరిత మనస్థత్వంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీని వల్ల వారికి లాభం ఉంటుందో లేదో కానీ.. రాష్ట్రం మాత్రం తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.