ఏపీ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి అడగకుండానే మద్దతిస్తున్నాయని కానీ రాష్ట్రం కోసం ఒక్క డిమాండ్ పెట్టలేదని కొంత మంది మేధావులు మీడియా, సోషల్ మీడియాలో ఆవేదన చెందుతున్నారు. ఆలా ఆవేదన చెందడం వారికి ఉపాధి. కానీ నిజంగా ప్రజల్లో ఈ అంశంపై స్పందన ఉందా ? అంటే అసలు లేదని చెప్పుకోవాలి. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీపై దండెత్తినా కనికరం చూపలేదు. ఈ ప్రభుత్వం ఎన్నో చెప్పి.. మొత్తం సైలెంట్‌గా ఉన్నా నోరు తెరవడం లేదు. అందుకే జనాల బలహీనతను అడ్డం పెట్టుకుని పార్టీలు తమ రాజకీయం తాము చేసుకుంటున్నాయి.
ముర్ముకు మద్దుతతో రాజకీయ ప్రయోజనాలు చూసుకున్న పార్టీలు !
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ము ఏపీకి వచ్చారు. వైసీపీ ముందుగానే మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఒక రోజు ముందుగా మద్దతు ఇచ్చింది. ఆమె ఒకే రోజు రెండు పార్టీలకు చెందిన ఓటర్లతో సమావేశం అయ్యారు. ఇక జనసేన పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఆ పార్టీకి ఓట్లు లేకపోవడంతో రాష్ట్రపతి అభ్యర్థి కలవలేదనుకోవచ్చు. కానీ ఏ పార్టీ కూడా ఒక్క ప్రతిపాదన కూడా బీజేపీ ముంద ుపెట్టలేదు. ప్రత్యేకహోదాను అడగడానికి ఇదేమంచి తరుణం అని చాలా మంది తటస్థులు వైసీపీకి సూచించారు. అయితే ఏపీ పాలకులు మాత్రం పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీవి ఏ మాత్రం ప్రభావం చూపలేని ఓట్లు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. చివరి క్షణంలో సామాజిక న్యాయం పేరు చెప్పి బీజేపీ అభ్యర్థికే మద్దతు తెలిపారు. కానీ టీడీపీ కూడా ఒక్క డిమాండ్ కూడా పెట్టలేదు.
ప్రజలిచ్చిన బలంతో రాజకీయ ప్రయోజనాలు పొందుతున్న పార్టీలు !
రాజకీయ పార్టీలకు వచ్చిన బలం సొంతం కాదు. అది ప్రజలిచ్చిన బలం. ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తేనే ఆ బలం వచ్చింది. అంటే.. ఆ బలాన్ని రాష్ట్రం కోసమే వాడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. దురదృష్టవశాత్తూ ఏపీలో రాజకీయ పార్టీలు తమ బలాన్ని రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటున్నాయి. రాష్ట్రప్రజలు ఇచ్చిన బలంతో అయినా రాష్ట్రం కోసం ఫలానా మేలు చేయమని బీజేపీని అడగలేకపోయారు. నిర్ణయాత్మక శక్తి… పాలనలో ఉన్న వైఎస్ఆర్సీపీనే అడగలేదు. తామెంత అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరించారు. ఇతరులు తామంత పెద్ద వాళ్లం కాదనుకున్నారు.
తిరగబడి దెబ్బతిన్న టీడీపీ – అలా చేయకూడదనుకుంటున్న వైసీపీ !
గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు కేంద్రం నుంచి ఏపీ సర్కార్ చాలా సాధించింది. విభజన చట్టం అమలు చేయడానికి.. విరివిగా ప్రయత్నించించింది. అయినా చేయాల్సినంత చేయలేదని టీడీపీ బయటకు వచ్చేసింది. బీజేపీపై పోరాడింది. కానీ ప్రజలు ఆదరించలేదు. అదే సమయంలో ఎన్నో చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రయోజనాలనుపూర్తిగా పక్కన పెట్టేశారు. టీడీపీలా తాము దెబ్బతినకూడదని.. డిసైడయ్యారు. అందుకు ప్రజల్నే కారణంగా చూపిస్తున్నారు.
బీజేపీ గుడ్ లుక్స్‌లో ఉంటే చాలనుకకుంటున్నారా ?
భారతీయ జనతాపార్టీకి ఏపీలో బలం లేదు. అయితే ఆ పార్టీ విషయంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అణిగిమణిగి ఉంటున్నాయి. తమ జోలికి రాకపోతే చాలు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. తమ రాష్ట్రానికి ఏ మేలు చేసినా చేయకపోయినా పట్టించుకోవడం లేదు. పొత్తులో ఉన్న జనసేన పార్టీది అదే పరిస్థితి. ఇదంతా ఏపీ ప్రజలు చేసుకున్నదే.