ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ‘పలాస’ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ లో చాలామంది దృష్టిని ఆకర్షించింది. పలాస దర్శకుడిగా కరుణ కుమార్ కి ఒక గౌరవం వచ్చింది. తమిళ, మలయాళ డైరెక్టర్స్ లా ఒక రూటెడ్ కథని చక్కని నైపుణ్యంతో చెప్పగలిగాడు అనే కితాబు అందుకున్నాడు కరుణ్ కుమార్.
రెండో సినిమాకు ఆయనకు కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న హీరో దొరికాడు. సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేశారు. ఈ సినిమా పెద్ద దెబ్బకొట్టింది. అటు విమర్శకుల నుంచి అనుకొన్న రెస్పాన్స్ రాలేదు. ఇటు బాక్సాఫీస్ వద్ద నిలబడలేక చతికిల పడింది. ఇటీవలే ఈ సినిమా గురించి ఆయన పోస్ట్ మార్టమ్ చేశారు. ముందు అనుకొన్న కథ వేరని, ఆ తరవాత కథంతా మార్చేశారని చెప్పాడు. ఏదేమైనా దర్శకుడిగా ఆ సినిమా వైఫల్యాన్ని ఆయన మోయ్యాల్సిందే.
శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత కరుణికు సినిమా ఇవ్వాలంటే హీరోలు కాస్త వెనకా ముందు అయ్యారు. చివరికి సత్యం రాజేష్ లాంటి నటుడితో తో ‘కళాపురం’ అనే ఒక చిన్న సినిమాని తీసుకున్నారు. ఈ సినిమా కూడా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. పైగా అసలు కరుణ కుమార్ కు ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది? అనే ఒక విమర్శ ని ఎదుర్కొవాల్సి వచ్చింది. నిజానికి చాలా వీక్ స్క్రిప్ట్ ఇది.
కానీ కళాపురం తర్వాత కూడా వరుణ్ తేజ్ లాంటి మెగా కాంపౌడ్ హీరో కరుణ కుమార్ పై నమ్మకం ఉంచారు. కలిసి మట్కా చేశారు. ఎన్నడూ లేనంతగా వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రచారం చేశాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ సినిమా గురించి చెప్పుకుంటారు అని దర్శకుడు కరుణకుమార్ చాలా ఉత్సాహంతో ప్రకటించాడు. తీరా సినిమా చూస్తే సినిమా అనుకున్నంతగా లేదు. రాత, తీతలో చాలా వెనకబడి ఉంది. వరుణ్ తేజ్ మూడు డిఫరెంట్ గెటప్పుల్లో, టైమ్ లైన్స్ లో తన ట్రాన్స్ఫర్మేషన్ చూపించి చక్కగా నటించాడు అనే ఒక్క మాట తప్పితే మట్కా ఇంకెందులోనూ ప్రభావం చూపలేకపోయింది. వసూళ్లు, ఓపెనింగ్స్ వసూళ్లు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
అసలు మట్కా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? అని దర్శకుడు సమీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఈ సినిమా కోసం అందరూ హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు కూడా కరుణ కుమార్‌కి ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వనంత బడ్జెట్ ఇచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సెట్స్ వేశారు. నాలుగు సెకండ్ల సీన్ కోసం కూడా సెట్ వేసిన వైనం కనిపిస్తుంది. ఇన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఆ సినిమాకి మంచి సహకారం ఉంది. అయినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులు ఆశించినంతగా, ముఖ్యంగా మెగా అభిమానులే పెదవి విరిచినట్లుగా వుంది. ఇది దర్శకుడి వైఫల్యమే.
ఇండస్ట్రీలో ఒక్క ఫెయిల్యూర్ కే జనాలు ఎలెక్ట్ అయిపోతారు. అలాంటిది కరుణకి రెండు ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత కూడా వరుణ్ తేజ్ లాంటి హీరో ఆయనకు పై డేట్స్ ఇచ్చారు. నిజానికి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్స్ చాలా పగడ్బందీగా సినిమాని ప్లాన్ చేసుకుంటారు. కానీ కరుణ ఈ విషయంలో అంత పగడ్బందీగా లేడేమో అనిపించింది సినిమా చూశాక. పైగా `శ్రీదేవి సోడా సెంటర్` ఫ్లాప్ కి కథ మారిపోయిందటూ కారణాలు వెదికిన కరుణకు ఈసారి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నిర్మాతలు, హీరో తనకు కావల్సినంత స్పేస్ ఇచ్చారని కరుణ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు కొత్త కారణాల్ని వెదుక్కోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
కరుణ స్వతహాగా కథకుడు. సాహిత్యంలో ప్రవేశం వుంది. వాసు లాంటి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు ఓ మోస్తరు గా కూడా ఆకట్టుకోలేకపోవడం దురదృష్టకరం. సాహిత్యం వేరు సినిమా వేరైనప్పటికీ రాస్తున్న కథలో సినిమాకి పనికొచ్చేది ఎంత అనే జడ్జ్ మెంట్ లేకపోవడం ఒక లోపమే. కరుణకి ఇది వరుసగా మూడో ఎదురుదెబ్బ. మరో హీరో ఆయన కథని విన్నప్పుడు జడ్జిమెంట్ తీసుకోవడంలో చాలా లెక్కలు వస్తాయి. కథ చెప్పినప్పుడు బావున్నప్పటికీ అది తెరపై ఎంతలా వస్తుందో అనే అనుమానం మట్కా చూసిన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి కరుణ ఏవిధంగా కమ్ బ్యాక్ అవుతారో చూడాలి.