ఆనం సోదరులు… నెల్లూరు జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చే నాయకులు వీరు. ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డి.. ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. పార్టీలో చేరిన మొదట్లో తరచూ వార్తల్లో ఉండే ఈ సోదరులు… ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఈ సోదరుల్లో ఒకరైన ఆనం వివేకా గురించి తాజాగా కొన్ని కథనాలు వచ్చాయి. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనీ, అందుకే కొన్నాళ్లుగా ఎక్కువగా హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారని వినిపిస్తోంది. ఇక, మిగిలింది… రామనారాయణ రెడ్డి. ప్రస్తుతం ఈయన టీడీపీ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో టీడీపీ అధిష్టానం మాటిచ్చిందని అనుచరులు అంటారు. అయితే, ఇంతవరకూ ఆ ఊసే టీడీపీలో లేదనే చెప్పాలి. తాజా పరిస్థితి తీసుకున్నా… మంత్రివర్గంలో కొత్త మార్పులూ చేర్పులకూ ఇది సరైన సమయం అనే పరిస్థితీ లేదు. అయితే, తాజా సమాచారం ఏంటంటే… ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో ఉన్న ఓ సీనియర్ మంత్రిని రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నట్టుగా టీడీపీ వర్గాల్లో ఓ కథనం చక్కర్లు కొడుతోందట..!
అదే జరిగితే, ఆ సీనియర్ నేత నిర్వహిస్తున్న శాఖ బాధ్యతల్ని రామనారాయణ రెడ్డికి అప్పగిస్తారనే ఆశాభావం ఆయన వర్గంలో వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. పదవి విషయమై పార్టీ అధిష్టానంతో ఇటీవలే ఆయన చర్చించారనే కథనం కూడా వినిపిస్తోంది. వివేకాకు ఎమ్మెల్సీ, ఆయనకు మంత్రి పదవి ఇస్తారన్న డీల్ తోనే ఈ ఇద్దరూ టీడీపీ గూటికి వెళ్లారంటూ అప్పట్లో బాగా నచ్చ జరిగింది. కనీసం ఇప్పుడైనా వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఆనం అనుచరుల నుంచి కూడా కొంత ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం! ఆనంకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జిల్లాలో పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉందనే వాదన కూడా ఇదే సమయంలో తెరమీదికి వస్తుండటం గమనార్హం.
జిల్లాలో ప్రతిపక్ష వైకాపాకి ధీటుగా నిలిచే నాయకులు లేరనీ, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నా.. ఆయన సొంత నియోజక వర్గం వరకూ మాత్రమే పరిమితం అవుతున్నారనే అభిప్రాయం ఉంది. ఇక, ఈ మధ్య కాలంలో నెల్లూరుపై మంత్రి నారాయణ కూడా కాస్త శ్రద్ధ పెంచారు. అయితే, ఆయన వైకాపాపై కౌంటర్ల జోలికి వెళ్లడం లేదు. తన పనేదో తనదీ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆ తరుణంలో, ఆనం రామనారాయణ రెడ్డికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా జిల్లాలో పార్టీకి ఒక బలమైన వాయిస్ గా ఆయన నిలుస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోందట! ఇటీవల కొంతమంది అనుచరులతో ఆనం భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, ఇదే భేటీలో కొంతమంది పార్టీ మార్పు ప్రస్థావన తీసుకొచ్చారనీ, తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీలోనే కొనసాగుదామంటూ ఆనం సర్దిచెప్పారనీ అంటున్నారు! మరి, ఈ కథనాలు నిజంగానే పరిస్థితుల డిమాండ్ మేరకు తెరమీదికి వచ్చాయో… లేదా, పరిస్థితులను నేతలు డిమాండ్ చేస్తే చర్చనీయం అవుతున్నాయో మరి..!