సమైక్య ఆంద్ర రాష్ట్ర మాజీ ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కొన్ని రోజుల క్రితమే తెదేపాలో చేరిన సంగతి అందరికీ తెలుసు. ఈరోజు వారి అనుచరులు సుమారు రెండు వేలమంది నెల్లూరు నుండి విజయవాడకు ప్రత్యేక రైలులో ఆదివారం ఉదయం బయలుదేరారు. విజయవాడలో ఒక కన్వెషన్ సెంటర్లో బారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారందరూ తెదేపాలో చేరబోతున్నారు. ఆనం సోదరుల చేరిక పట్ల నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు తెదేపా నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడానికే వారిని చేర్చుకోవలసి వస్తోందని చంద్రబాబు నాయుడు సదరు నేతలకు నచ్చ జెప్పి ఆనం సోదరులను పార్టీలోకి చేర్చుకొన్నారు. ఇప్పుడు చాలా బారీ సంఖ్యలో వస్తున్న వారి అనుచరులను కూడా పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఆనం సోదరుల రాకతో నెల్లూరు జిల్లాలో పార్టీ బలపడుతుందో లేక పార్టీలో సీనియర్ నేతలు పార్టీకి దూరం అవుతారో కాలమే చెపుతుంది.
తెదేపా నుండి ఎవరయినా సీనియర్ నేత వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు “మా పార్టీకి కార్యకర్తలే బలం. వారిపైనే మా పార్టీ ఆధారపడి ఉంది. నేతలు ఎంతమంది పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయినా మాకు ఎటువంటి నష్టమూ లేదు. ఒక నాయకుడు వెళ్ళిపోతే నేను మా పార్టీ కార్యకర్తలలో నుండే వందమంది నాయకులను తయారు చేసుకోగలను,” అని గంభీరంగా చెపుతుంటారు.
చంద్రబాబు నాయుడు అటువంటి ప్రయత్నం ఏదీ చేసినట్లు కనబడదు కానీ కాంగ్రెస్, వైకాపాల నుండి ఇటువంటి ‘రెడీ మేడ్’ సీనియర్ నేతలను తెదేపాలోకి ఆహ్వానించి పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటారని స్పష్టం అవుతోంది. తెలంగాణాలో తెరాస, ఆంధ్రాలో తెదేపా రెండింటిలో కూడా ఇప్పుడు ఆ పార్టీలను నమ్ముకొని పైకి ఎదిగిన వారి కంటే ఇతరపార్టీల నుండి కీలక స్థానాలు ఆక్రమించినవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పార్టీని నమ్ముకొన్న వారిని కాదని అవకాశవాదులయిన ఇతర పార్టీల నేతలను భుజానికి ఎత్తుకొని మోయడం వలన, ఏదో ఒకరోజు పరిస్థితులు మారితే వాళ్ళు మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.