నెల్లూరు రాజకీయానికి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పేరే ఉంది. కారణం ఆనం కుటుంబం. ఆనం సోదరులలో పెద్దవారైన వివేకానందరెడ్డిది విభిన్నమైన తీరు. అందరితో కలిసిపోయే తత్వం. వ్యంగ్య బాణాలు. దేనికీ వెరవని గుణం. ఏలాంటి పనైనా సంకోచం లేకుండా చేయడం ఆయన నైజాలు. బహిరంగంగా సిగరెట్ కాలుస్తారు. కార్యక్రమాన్ని బట్టి అలంకరణ కూడా చేసుకుంటారు. సాధ్యమైనంత వరకూ ఆయన చేష్టలు హాస్యస్ఫోరకంగా ఉంటాయి. టోపీ పెట్టుకుని కనిపిస్తారు. గుర్రం ఎక్కుతారు. విచిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తారు. ఇదంతా ఆయన కలివిడి మనస్తత్వానికి దర్పణం.
అందుకు భిన్నంగా ఆనం వివేకానంద రెడ్డి గడిచిన రెండు రోజులుగా కనిపిస్తున్నారు. మా భాషింతేనని చెప్పుకోడానికీ, సమర్థించుకోడానికీ వీలుగా ఉంటుందనేమో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు. ఆయన లోటస్ పాండ్‌లో కూర్చుని మందు తాగుతారన్నారు. నెలకో దీక్ష, ధర్నాలు చేసి, ఆరామ్‌గా సేదదీరుతారనీ చెప్పారు. సిక్స్‌ప్యాక్ కోసం నిరాహార దీక్షలు చేస్తారన్నారు. టీడీపీ వారికి ఆయన వ్యాఖ్యలు ఆనందం కలిగించి ఉండవచ్చు. భలే అన్నారని అనిపించుడవచ్చు. ఎదుటి పక్షంలో మాత్రం ఇవి మంటలు రేపుతాయి. వాళ్ళూ అలాగే స్పందిస్తే. దిగజారుడు రాజకీయవ్యాఖ్యలకు అడ్డూఅదుపూ ఉంటుందా.
కొంతకాలంగా చంద్రబాబు తమకు ప్రాధాన్యతనీయడం లేదని అలిగిన వివేకా పార్టీ మారతారనే వార్తలు వినిపించాయి. కడుపుమండితే ఏం చేస్తారండి మరీ పార్టీ మారక. అమెరికా వెళ్ళే ముందు చంద్రబాబు వివేకాను పిలిచి మాట్లాడడంతో కాస్త నెమ్మదించారు. ఆ తరవాత తన కోపాన్ని ప్రతిపక్షనేతపై కక్కేశారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో చిత్రమైన పరిస్థితుంది. అది ఉంటే అధికార పార్టీలో ఉండాలి లేకుంటే ప్రతిపక్ష వైసీపీలోకి మారాలి. చూస్తూ చూస్తూ ఎంత గొప్ప పార్టీ అయినా.. దశాబ్దాలపాటు పోషించినా ప్రస్తుతం ఉనికిని చాటుకోడానికి నానా పాట్లు పడుతున్న కాంగ్రెస్‌లోకి వెళ్ళేలేరు కదా. అలాగని, బీజేపీలో చేరి వెంకయ్యనాయుడు చాటున పసలేని రాజకీయాన్నీ చేయరేదు కదా. ఏపీలో వెంకయ్య బీజేపీకి ఎంత చెబితే అంత. కాదంటారా.. ఆ నాయకుడికి పుట్టగతులుండవు. సింహంలా బతికిన ఆనం కుటుంబం అటు వెళ్ళదు గాక వెళ్ళదు.
ఇక అసలు విషయంలోకొస్తే.. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వివేకా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నువ్వా జగన్‌ని విమర్శించేదంటూ ప్రశ్నించారు. ఏమనుకుంటున్నావో.. మళ్ళీ విమర్శిస్తే నీ ఇంటిమీదకు దొమ్మికొస్తామంటూ హెచ్చరించారు. దీని వివేకా వైపు నుంచి కౌంటర్ పడింది. ఆయన కుమారుడు మయూర్ రెడ్డి నువ్వంటూ మాట్లాడారు. ఇప్పటికే మా ఇంటిముందొక స్తంభముంది. వచ్చి చూడు.. రెండో స్థంభంగా మారిపోతావంటూ రంకెలు వేశారు. ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా రాజకీయాన్ని అపహాస్యం పాలుచేశాయి. నలుగురు చూసి నవ్వుకునేలా ఉన్నాయి. ఆనం కుటుంబంలోనే ఇవి చిచ్చు పెట్టాయి. బాబాయి విజయకుమార్ రెడ్డినే నువ్వంటూ సంబోధించిన మయూర్ రెడ్డి తీరు విభ్రమ గొలిపింది.
ప్రజా సేవకోసం రాజకీయాలు ఒకనాటి మాట. ప్రజలు వీరికి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తారు. తమకు ఓటేసిన ప్రజల ముందు ఎలా మెలగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. హుందాతనాన్ని పూర్తిగా మరిచిపోయారు. అధికారం కోసమే పుట్టామన్నట్లు.. అదేదో శాశ్వతమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఎన్నికల వరకూ రాజకీయాలు.. ఆ తరవాత అభివృద్ధి కోసమే పనిచేయాలనే చంద్రబాబు తీరు వీరికి ఎప్పటికి వంటబడుతుందో. ప్రతిపక్షమూ ఇందులో తక్కువ తినడం లేదు. విమర్శను ఘాటుగానూ, తెలివిగానూ తిప్పికొట్టడం మాని..సవాళ్ళకు దిగుతోంది. ఇరుపక్షాల వైఖరి నెల్లూరు రాజకీయాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకూ చంద్రబాబు అమెరికా నుంచి తిరిగిరారు. ఈలోగా నెల్లూరు జిల్లాలో ఎన్ని విపరిణామాలను చూడాల్సి వస్తుందో..ఏమో..
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి