సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెదేపాలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నెల్లూరు జిల్లా తెదేపా నేతలతో చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడి, ఆనం చేరిక వలన వారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మాటను కాదనలేక వారు అందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. కనుక నేడో రేపో ఆనం రామనారాయణ రెడ్డి తెదేపాలో చేరే అవకాశాలున్నట్లు భావించవచ్చును.
ఆయన మొదట తెదేపాలోనే ఉండేవారు. తెదేపా తరపున నెల్లూరులోని రాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి రెండు సార్లు శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి. రామారావు క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసారు కూడా. 1991లో తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన సమాచార మరియు ప్రజా సంబందాల శాఖ మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత 2009లో పట్టణాభివృద్ధి మరియు మునిసిపల్ శాఖల మంత్రిగా వ్యవహరించారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్దికమంత్రిగా వ్యవహరించారు.
రాష్ట్ర విభజన కారణంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోతుండటంతో ఆయన మళ్ళీ తెదేపాలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక తెదేపా నేతలు వ్యతిరేకిస్తున్న కారణంగా ఇంతకాలం వీలు కుదరలేదు. కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడే ఆయనను పార్టీలో చేర్చుకొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆయన ప్రయత్నాలు ఫలించినట్లున్నాయి. ఆయనతో బాటు ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా తెదేపాలో చేరవచ్చునని సమాచారం.