మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద సంఖ్యలో అనుచురులతో కలిసి… జగన్ పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలం అనే ఊళ్లో కండువా కప్పించుకున్నారు. జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆనం రామనారాయణరెడ్డి కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన… రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసినా విజయం సాధించలేదు. ఆ తర్వాత సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే భావనతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. తనకు, వివేకా కుమారుడు రంగమయూర్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా రోజులు ఎదురు చూశారు. అయినా జగన్ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చివరికి టిక్కెట్ హామీ లేకుండానే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సర్వేల ప్రకారం ఎన్నికల ముందు టిక్కెట్లు ఖరారు చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆనం నియోజకవర్గం.. ఆత్మకూరులో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని.. ఆనంకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత వెంకటగిరి ఇచ్చినా పర్వాలేదని.. జగన్ ను ఆనం అడిగినట్లు ప్రచారం జరిగింది. అందుకే ఓకే అన్నట్లు కూడా ఆనం సన్నిహితవర్గాలు ప్రచారం చేశాయి. అయితే అనూహ్యంగా..మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడిని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కూడా మరో రెండు, మూడు రోజుల్లో వైసీపీలో చేరే అవకాశం ఉంది.
నెల్లూరులో వరుసగా పార్టీ నేతలను చేర్చుకుంటూ ఉండటంతో జగన్ కు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టిక్కెట్ల సర్దుబాటు తలనొప్పులు తెచ్చి పెట్టే అవకాశం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే… ఇతర నేతలు టిక్కెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆనం లాంటి బలమైన నేతల్ని చేర్చుకుంటూండటంతో.. వారితో పాటు వారి వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆనంను పార్టీలో చేర్చుకోవడంపై మేకపాటి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు