నెల్లూరులో వైసీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందన్న విషయం అప్పుడప్పుడు బయట పడుతోంది. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ సీనియర్లే కావడంతో.. ఎవరికి వారు జిల్లాపై తమ పట్టు చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం అనూహ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మరో మంత్రి గౌతం రెడ్డి ఉన్నప్పుటికీ.. ఆయన పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా నెల్లూరు రాజకీయాల్ని అనిల్ కుమారే చూసుకుంటున్నారు. ఇది సీనియర్లకు నచ్చడం లేదు.
ముఖ్యంగా జిల్లాలోనే ప్రముక రాజకీయ కుటుంబం అయిన ఆనం ఫ్యామిలీ.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిలో ఉంది. ఈ క్రమంలో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరని ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి సందర్భంగా నెల్లూరులో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర రాజకీయాల్లో మళ్లీ తమ ముద్ర చూపిస్తామని ప్రకటించారు. వివేకా మరణం వరకూ నెల్లూరు నగరం నుంచి ఆనం కుటుంబసభ్యుల్లో ఒకరు ప్రజాప్రతినిధిగా ఉండేవారు. వైసీపీలో చేరిన సమయంలో.. ఆనంకు రూరల్లో.. వివేకా కుమారుడికి నగరంలో టిక్కెట్ ఇస్తామన్న హామీని జగన్ ఇచ్చారు.
కానీ.. వివేకా కుమారుడికి టిక్కెట్ ఇవ్వలేకపోయారు. గెలిచిన ఆనంకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో.. పట్టు నిలుపుకోవాలంటే రాజకీయంగా మరింత బలపడాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆనం కుటుంబానికి విధేయంగా ఉంటూ.. రాజకీయంగా ఎదిగిన మంత్రి అనిల్.. ఇప్పుడు తమ కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నారని.. ఆనం కుటుంబీకులు నమ్ముతున్నారు. దీంతో వైసీపీ రాజకీయాలు గరంగరంగా మారాయి.