వైసీపీలో చేరిన నెల్లూరు నేత ఆనం రామనారాయణరెడ్డి…మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్లను పార్టీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారా..? ప్రస్తుతం ఆయన వేస్తున్న అడుగులు చూస్తూంటే.. అదే నిజం అనుకోవాలి. హఠాత్తుగా మైదుకూరు వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి… మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఖాజీపేటలోని స్వగృహంలో డీఎల్ తో చర్చలు జరిపారు. చర్చల సారాంశం ఏమిటో బయటకు రాకపోయినా… ఆనం..డీఎల్ ను.. వైసీపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆనం.. వైసీపీ అగ్రనేతల సూచనల మేరకే… డీఎల్ ఇంటికి వెళ్లారా..? లేక సొంతంగానే బాధ్యత తీసుకన్నారా..? అన్నదానిపై క్లారిటీ లేదు.
డీఎల్ రవీంద్రారెడ్డి.. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మధ్య మధ్యలో టీడీపీలో చేరుతారని కొన్ని సార్లు.. వైసీపీలో చేరుతారని మరికొన్ని సార్లు ప్రచారం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ బాబాయ్ వైఎస్ వివేకాకు మద్దతు తెలిపారు. ఆయన వర్గానికి చెందిన స్థానిక సంస్థల ఓట్లు వివేకాకు వేయించారు. ఆ తర్వాత టీడీపీకి దగ్గరయినట్లు ప్రచారం జరిగింది. డీఎల్ రవింద్రారెడ్డికి మైదుకూరు టిక్కెట్ ఇచ్చేందుకే.. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్చార్జ్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ చైర్మన్ గా పదవి ఇచ్చారని గతంలో టీడీపీలో చెప్పుకున్నారు. ఆ సమయంలోనే డీఎల్ ఎప్పుడైనా టీడీపీలో చేరవచ్చనుకున్నారు. కానీ ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరో వైపు పుట్టా సుధాఖర్ యాదవ్ మాత్రం టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినా మైదుకూరు నుంచి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేసి సుధాకర్ యాదవ్.. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈయన మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా.
ప్రస్తుతం మైదుకూరులో వైసీపీ ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ఉన్నారు. ఒక వేళ డీఎల్ వైసీపీలో చేరిన టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది సందేహమే. డీఎల్ రవీంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అందుకే తరచూ ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆనం తో డీఎల్ చర్చల తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.