కొద్దిరోజుల కిందట ఇదే మాట వినిపించింది..! తెలుగుదేశంలో ఆనం సోదరులు అసంతృప్తిగా ఉన్నారనీ, పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారనీ కథనాలు వినిపించాయి. వైకాపావైపు చూస్తున్నారనీ, ఈ మేరకు తెరచాటు సంప్రదింపులు జరుగుతున్నాయనే ప్రచారమూ సాగింది. అయితే, ఆ సమయంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ రంగంలోకి దిగి ఆనం సోదరులను బుజ్జగించారు. త్వరలోనే ఎన్నికలున్నాయనీ, అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించే ప్రయత్నం చేశారు. దాంతో పార్టీ మార్పు చర్చ తాత్కాలింగా ఆగిందనే చెప్పాలి.
ఇదే తరుణంలో ఆనం సోదరుడు వివేకానంద రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దశదిన కర్మ జరిగింది. దీనికి ఆనం సోదరులతోపాటు, మద్దతుదారులు, అనుచరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మరోసారి తమ రాజకీయ భవిష్యత్తుపై ఆనం సోదరులు చర్చించారని సమాచారం! దీనికి సంబంధించి త్వరలోనే ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కొనసాగుతూ వచ్చినా, ఇప్పటికీ తమకు ప్రాధాన్యత దక్కలేదంటూ ఆనం వర్గీయులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేషన్ పదవి ఇస్తారన్న ఆశజూపి టీడీపీలోకి పిలిచారనీ, తీరా వచ్చాక తమ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారనే అభిప్రాయం ఆ వర్గంలో కొన్నాళ్లుగా ఉంది.
వివేకా మరణం తరువాత, ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో రాం నారాయణ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే తన అనుచురులతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. తెలుగుదేశంలో కొనసాగాలా వద్దా అనే అంశంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే, వివేకా మరణం తరువాత ఆనం కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. వారికి అండగా ఉంటామనే భరోసా కూడా ఇచ్చారు. దీంతో పార్టీ మార్పు అనే చర్చ తెరమీదికి ఇకపై రాకపోవచ్చనే అభిప్రాయమే ఏర్పడింది. కానీ, ఇప్పుడు మళ్లీ అదే అంశం తెరమీదికి వస్తూ ఉండటం విశేషం. ఈ వారంలో జరిగే సమావేశానంతరం సమగ్ర రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని ఆనం రాం నారాయణ అంటున్నారట! ఒకసారి మంత్రులు బుజ్జగించారు, తాజాగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అయినాసరే, పార్టీ మార్పుపై చర్చ వినిపిస్తోందంటే… రాం నారాయణ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారనే అభిప్రాయం కొంతమంది నుంచీ వ్యక్తమౌతోంది.