మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరే ముహుర్తం ఎట్టకేలకు ఖరారయింది. వైఎస్ వర్ధంతి రోజు అయిన సెప్టెంబర్ రెండో తేదీన ఆయన విశాఖ పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆనం వివేకానందరెడ్డి మరణం తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని… పార్టీలో ఉండలేనని.. ప్రకటించారు. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ… వైసీపీలోని మేకపాటి వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో… చేరిక వాయిదా పడింది. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి కూడా.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఎప్పుడు చేరతారన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన కూడా గతంలో వైఎస్ వర్ధంతి రోజే.. పార్టీలో చేరాలని అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆనం పార్టీలో చేరిన రెండు, మూడు రోజుల తర్వాత ప్రత్యేకంగా విశాఖ వెళ్లి వైసీపీలో చేరే యోచనలో ఉన్నారు.
ఇప్పుడు కూడా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆనం వర్గీయులకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెబుతున్నారు. సర్వేల ప్రకారం టిక్కెట్లు ఇస్తామని.. ముదుగా పార్టీలో చేరాలని షరతు పెట్టారని చెబుతున్నారు. టీడీపీలో ఉంటే ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ ఖాయమే అయినా… ఆ పార్టీలో నారాయణ, సోమిరెడ్డి, ఆదాల, బీద సోదరులు లాంటి చాలా మంది సీనియర్లు ఉండటంతో.. భవిష్యత్ రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం దక్కదని.. ఆనం భావించారు. అదే సమయంలో.. వైసీపీలో… మేకపాటి తప్ప మరో సీనియర్ నేత నెల్లూరు జిల్లాలో లేరు. వైసీపీలో చేరితే సీనియర్ గా తనకే ప్రాధాన్యత దక్కుతుందని అంచనా వేసుకుని..ఇప్పటికిప్పుడు ఎలాంటి టిక్కెట్ల హామీ లేకపోయినా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆనం వర్గీయులు చెబుతున్నారు.
ఆనం వైసీపీలో చేరినా.. ఆయనకు, వివేకా కుమారుడికి టిక్కెట్లు సాధించుకోవడం అంత తేలికగా సాధ్యమయ్యే పని కాదన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది. ఆయన ఆత్మకూరును వదులుకుని.. వెంకటగిరి, ఉదయగిరి లాంటి నియోజకవర్గాలపై కన్నేసినా.. అక్కడ కూడా… జగన్ ప్రత్యామ్నాయ నేతలను ఇప్పటికే రెడీ చేసుకుంటున్నారు. దీంతో ఆనం కుటుంబానికి జగన్ టిక్కెట్లు ఎక్కడ సర్దుబాటు చేస్తారు..? ఆ ఎఫెక్ట్ ఏ నేతలపై పడుతుందన్న చర్చ ఇప్పటికే వైసీపీలో ప్రారంభమయింది. ఆనం వర్గం చేరికను మొదటి నుంచి మేకపాటి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి స్పందన ఎలా ఉంటుందో.. ఆనం చేరిక తర్వాతే వెల్లడి కానుంది.