ప్రభుత్వంలో ఎలాగూ పలుకుబడి లేదు.. కానీ అధికారిక కార్యక్రమాలకూ పిలవకపోతే ఎలా అని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మథనపడుతున్నారు. ఆ మథనాన్ని ఆయన నేరుగానే వెల్లడించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కాకుండా… అధికారులపై విమర్శలు చేసినట్లుగా ఆయన కోపాన్ని బయట పెట్టేశారు. అధికారులపై కేసులు పెడతానని ఆయన హెచ్చరిస్తున్నారు. దీనంతటికి కారణం… నెల్లూరులో రిపబ్లిక్ డే పరేడ్ జరిగితే ఎమ్మెల్యే అయిన ఆయనకు ఆహ్వానం పంపలేదు. ప్రభుత్వ గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదని.. మాకు అర్హత లేదా? దీనికి మేము సిగ్గుపడాలో, ఏంచేయాలో అర్థం కావడం లేదని ఆయన మండిపడుతున్నారు.
దీనిపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని.. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన కుండా ఆవమానించిన అధికారులపై కేసులు వేస్తానని ఆయన చెబుతున్నారు. కొంత మంది అధికారులు ఇన్విటేషన్లు ఉన్నాయి కానీ.. పై వాళ్లు చెప్పినందునే పంపలేదని చెబుతున్నారని ఆయన అంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా ఆనంను అందరూ సైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆనం వైసీపీలో ఉన్నా.. లేనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. చివరికి నెల్లూరు జిల్లా అధికారులే కాదు.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి అధికారులు కూడా ఆయన మాట వినడం లేదు.
ప్రతిపక్ష నేతలకు ఓ కారణం అయినా ఉంటుంది.. అధికార పార్టీ నేతగా ఏ కారణం చెప్పలేకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల నెల్లూరులో ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు అన్నింటినీ అధికారులు తీసేశారు. అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి ఫ్లెక్సీల జోలికి వెళ్లడం లేదు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా చేసి.. ఆయన చనిపోయిన తర్వాత సీఎం రేసులో ఉన్నట్లుగా ప్రచారం పొందిన సీనియర్ తనకు ఎమ్మెల్యేగా కూడా… గౌరవం దక్కకపోవడంతో మథనపడుతున్నారు. ఆయన కఠినమైన నిర్ణయం తీసుకుంటారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.