వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయమరెడ్డి… సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మొత్తం మాఫియా గుప్పిట్లోకి పోయిందని మండిపడ్డారు. నెల్లూరులో భూమి, మద్యం, ఇసుక, బెట్టింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఈ మాఫియా ఆగడాలు భరించలేక ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనం వ్యాఖ్యలు ప్రభుత్వంలో కూడా కలకలం రేపుతున్నాయి. నెల్లూరులో సహజంగానే.. వైసీపీ తిరుగులేని స్థానంలో ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ వాళ్లే. వైసీపీ ఎమ్మెల్యేలు తరచూ.. ఇసుక, బెట్టింగ్ వివాదాలతో.. తెరపైకి వస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు దిగి.. వార్తల్లోకి ఎక్కారు.
అయితే.. వైసీపీ కీలక ప్రజాప్రతినిధులందరికీ.. బెట్టింగ్, ఇసుక రాకెట్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో విచారణ కూడా ఎదుర్కొన్నారు. నెల్లూరులో.. ఎవరెవరికి.. ఏ రంగం నుంచి వాటాలు అందుతాయో.. బహిరంగంగా చెప్పుకుంటారు. ఇది చాలా కాలంగా సాగుతున్న వ్యవహరమే. అయితే.. హఠాత్తుగా ఆనం రామనారాయణరెడ్డి ఈ అంశాన్ని హైలెట్ చేయడానికి కారణం ఏమిటన్నదే వైసీపీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. జిల్లా వైసీపీలో… ఆనమే సీనియర్. అయితే.. ఆయన ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. తానే సీనియర్ని అయినందున పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారారు. కానీ జగన్ అలా ఆలోచించలేదు. ఆనం కుటుంబం సాయంతో.. రాజకీయాల్లోకి వచ్చిన… అనిల్ కుమార్ యాదవ్కు.. చాన్సిచ్చారు.
ఆ తర్వాత కూడా.. ఆనంకు.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. వెంకటగిరి ఎమ్మెల్యేగా మాత్రమే .. ఆయనను పరిగణిస్తున్నారు. ఆయన ప్రమేయం లేకుండా.. పదవుల పంపకం జరుగుతోంది. ఆయన అనుచరులకు.. ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో.. ఆనం తన.. ప్రాధాన్యతను గుర్తించడానికి.. నెల్లూరు ఇసుక, బెట్టింగ్ మాఫియాను తెరపైకి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ హైకమాండ్ స్పందన ఎలా ఉంటుందో.. దానికి తగ్గట్లే ఇతర పరిణామాలు ఉండే అవకాశం ఉంది.