వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం తన నియోజకవర్గంపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆయన ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి గెలిచారు. రెండు చోట్ల ఆయనకు పట్టు ఉంది. ప్రస్తుతం వెంకటగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయనకు టీడీపీ ఆత్మకూరు ఆఫర్ చేస్తోంది. వెంకటగరిలో టీడీపీకి బలమైన మరో నేత ఉండటంతో సర్దుబాటు చేయడం టీడీపీకి కష్టంగా మారుతోంది.
వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికి రెండుసార్లు కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటరిగి నియోజకవర్గంలో యాక్టివ్గానే ఉంటూ వస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగోండ్ల రామకృష్ణ పోటీలో ఉంటారని సంకేతాలు వచ్చాయి. అలా లైన్ క్లియర్ అవుతుందని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయింది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిపైనే ఆసక్తి చూపుతూ వస్తున్నారు.
కొద్ది రోజులుగా ఆనం అంత యాక్టివ్ గా లేరు. తాను అడిగిన టిక్కెట్ కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన అసంతృప్తిని గమనించిన చంద్రబాబు… వెంకటగిరి ఇస్తామని కబురు పంపారని చెబుతున్నారు. అలా అయితే కురుగొండ్ల రామకృష్ణకు ఏ సీటు కేటాయిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. వైసీపీ తరపున ఇప్పటికే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడికి టిక్కెట్ ఖరారు చేశారు.