సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ‘రాష్ట్రం అనాధగా మారిపోయిందని, దానిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, అంతకంటే వేరే మార్గం లేదని’ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులిద్దరూ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత వారిద్దరూ తెదేపాలో చేరడం, అప్పుడప్పుడు జగన్ విమర్శలు గుప్పిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వారిలో ఆనం వివేకానంద రెడ్డికి కాస్త దూకుడు ఎక్కువే. ఆయన జగన్ గురించి మళ్ళీ నిన్న చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కొన్ని వ్యాఖ్యలు కూడా చేసారు.
“రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయమని కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము కోరిన మాట వాస్తవం. అయితే అప్పట్లో జగన్ గురించి మాకు సరిగ్గా తెలియకపోవడంతో చేతనే మేము ఆయన పేరు సూచించాము. ఇంకా చాలామంది అదే విధంగా సూచించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అది మంచి నిర్ణయమేనని ఆ తరువాత మాకు అర్ధమయింది. జగన్ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఆయనకు అహంభావం ఎక్కువ. డబ్బున్న వాళ్ళు అంటే చాలా మోజు. ఎవరికి ఎక్కువ డబ్బుంటే వారినే గౌరవిస్తుంటారు. మమ్మల్ని బయట కూర్చోబెట్టిన రోజులున్నాయి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికీ ఎక్కడా పోలికే లేదు. పోల్చడానికి కూడా వీలులేదు. జగన్ ఎటువంటి వాడయినప్పటికీ ఇప్పుడు మాకు అనవసరం. అటువంటి వ్యక్తి క్రింద మేము పనిచేయలేము. కనుక మేము వైకాపాలో చేరడం అసంభవం. మీడియాలో అటువంటి వార్తలు వస్తే అవి నిజం కాదు,” అని చెప్పారు.
జగన్ గురించి ఇన్ని వివరాలు చెపుతున్న ఆనం వివేకానంద రెడ్డి, అతని గురించి తెలియకనే ముఖ్యమంత్రి చేయమని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ పై ఆయనకు దురాభిప్రాయం ఉన్నట్లు ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది. కానీ అది నిజమైన అభిప్రాయమేనా లేక ప్రస్తుతం తెదేపాలో ఉన్నారు కనుకనే ఆవిధంగా మాట్లాడుతున్నారో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాలి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆయనకు తెదేపా టికెట్ ఇవ్వకపోతే, అప్పుడు ఆనం సోదరులకు జగన్ గురించి తమ అభిప్రాయాలు మార్చుకొంటారేమో?